8th Pay Commission : బిగ్ అప్డేట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పండగే.. ఇదే జరిగితే కనీస వేతనం రూ. 58వేల వరకు పెరగొచ్చు!
8th Pay Commission : 8వ వేతన కమిషన్‌లో కనీస వేతనాల గణనపై ఉద్యోగ సంఘాలు భారీగా డిమాండ్ చేస్తున్నాయి. ఆధారపడిన తల్లిదండ్రుల కోసం ఫ్యామిలీ యూనిట్‌ను 3 నుంచి 5కి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే కనీస ప్రాథమిక వేతనం సుమారు 66 శాతం పెరుగుతుంది.
8th Pay Commission
- 8వ వేతన సంఘంపై కీలక అప్డేట్
- కనీస వేతనాల గణనపై ఉద్యోగ సంఘాల డిమాండ్
- ఫ్యామిలీ యూనిట్ 3 నుంచి 5కు పెంచాలని డిమాండ్
- 7వ వేతన సంఘంలో 3 ఫ్యామిలీ యూనిట్లతో లెక్కింపు
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్.. 8వ వేతన సంఘం గురించి కీలక అప్డేట్ బయటకు వచ్చింది. కనీస వేతనాన్ని లెక్కించే విషయంలో ప్రాతిపదికన భారీగా మార్పు చేయాలని ఉద్యోగి సంస్థలు డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్‌లో కుటుంబ యూనిట్ల సంఖ్యను 3 నుంచి 5 పెంచాలని ఉంది.
అయితే, ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే మాత్రం ఉద్యోగుల కనీస వేతనం, ఫిట్మెంట్ ఫ్యాక్టర్, పెన్షన్ భారీ మొత్తంలో పెరిగే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన ఉద్యోగి సంఘాల సమావేశాల్లో ఈ అంశం ప్రముఖంగా లేవనెత్తారు. వేతన సంఘానికి సమర్పించే ఉమ్మడి మెమోరాండం రెడీ అవుతోంది.
ఫ్యామిలీ యూనిట్ ఏంటి? :
7వ వేతన సంఘం 3 ఫ్యామిలీ యూనిట్ల ఆధారంగా కనీస వేతనాన్ని లెక్కించింది. ఉద్యోగి, జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలు. దీని ఆధారంగా కనీస ప్రాథమిక జీతం రూ. 18,000గా నిర్ణయించింది.
ప్రస్తుత సామాజిక, ఆర్థిక పరిస్థితులలో తల్లిదండ్రులు కూడా ఆధారపడి ఉన్నారని, ప్రస్తుత ఫ్యామిలీ యూనిట్‌ను 5కి పెంచాలని ఉద్యోగి సంస్థలు చెబుతున్నాయి. 5 యూనిట్లను బేస్‌గా లెక్కిస్తే.. 3 నుంచి 5 నిష్పత్తి సుమారు 66 శాతంగా ఉంటుంది. ఫలితంగా కనీస ప్రాథమిక జీతం రూ. 18,000 నుంచి రూ. 54,000కి లేదా కొన్ని అంచనాల ప్రకారం.. రూ. 58,500కి పెరగవచ్చు.
ఫిట్మెంట్ ఫ్యాక్టర్, పెన్షన్‌పై ప్రభావం :
ప్రస్తుత వేతనాన్ని కొత్త వేతనంగా మార్చేందుకు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ చాలా కీలకం. ప్రస్తుతం ఇది 2.57గా ఉంది. 3 శాతం నుంచి 3.25కి పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే ఉద్యోగుల జీతం పెరగడమే కాదు వారి చివరి ప్రాథమిక జీతంలో 50 శాతం పెన్షన్ కూడా అదే నిష్పత్తిలో పెరుగుతుంది.
ఇతర ముఖ్య డిమాండ్లు :
- సమావేశాలలో అనేక ఇతర డిమాండ్లు కూడా చర్చకు వచ్చాయి.
- వార్షిక జీతం పెంపు 3 శాతం నుంచి 7 శాతానికి పెంపు
- పాత పెన్షన్ పథకం పునరుద్ధరణ
- ప్రమోషన్ విధానంలో మెరుగుదల, కనీసం 5 ప్రమోషన్లు
- ఇంటి అద్దె భత్యం, కరువు భత్యం, ఇతర భత్యాలలో సవరణ
- సెలవుల క్యాష్ లిమిట్ 300 రోజుల నుంచి 400 రోజులకు పెంచడం వంటివి ఉన్నాయి.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయం దృష్ట్యా, 3-యూనిట్ మోడల్ ఇప్పుడు పాతదిగా మారిందని ఉద్యోగుల సంస్థలు చెబుతున్నాయి.
ఈ ప్రక్రియ ఎక్కడికి చేరుకుంది? :
8వ వేతన సంఘం జనవరి 2025లో ప్రకటించింది ప్రభుత్వం. నిబంధనలు తర్వాత విడుదల అయ్యాయి. కానీ, అనేక కీలక డిమాండ్లు అందులో చేర్చలేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఉద్యోగుల సంఘం ప్రస్తుతం ఒక జాయింట్ మెమోరాండంను రెడీ చేస్తోంది. వేతన సంఘం చైర్పర్సన్ జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్‌కు దీన్ని సమర్పిస్తారు. తుది నిర్ణయం కమిషన్ సిఫార్సులు, కేంద్ర ప్రభుత్వ ఆమోదంపై ఆధారపడి ఉంటుంది.
ఈ నిర్ణయమే ఫైనలా? :
కుటుంబ యూనిట్‌ను 5కు పెంచే ప్రతిపాదన ప్రస్తుతం డిమాండ్ దశలోనే ఉంది. ఇది ఆమోదించాలా వద్దా అనేది పూర్తిగా వేతన సంఘం, ప్రభుత్వం నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. జనవరి 1, 2026 నుంచి ఆమోదం పొంది అమలు జరిగితే జీతాలు, పెన్షన్లు భారీ మొత్తంలో పెరుగుతాయి.
