Pan Coronavirus Vaccine : పాన్ కరోనావైరస్ వ్యాక్సిన్ అభివృద్ధికి ఇదే సరైన సమయం

ఏడాదిన్నర దాటింది.. ఇంకా కరోనావైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. అదుపులోకి వచ్చినట్టే వచ్చి మళ్లీ విజృంభిస్తోంది. టీకాలు వచ్చినా మహమ్మారి ముప్పు ఇంకా పూర్తిగా..

Pan Coronavirus Vaccine : పాన్ కరోనావైరస్ వ్యాక్సిన్ అభివృద్ధికి ఇదే సరైన సమయం

Pan Coronavirus Vaccine

Pan Coronavirus Vaccine : ఏడాదిన్నర దాటింది.. ఇంకా కరోనావైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. అదుపులోకి వచ్చినట్టే వచ్చి మళ్లీ విజృంభిస్తోంది. టీకాలు వచ్చినా మహమ్మారి ముప్పు ఇంకా పూర్తిగా తొలగలేదు. కరోనావైరస్ కొత్త వేరియంట్లు మానవాళి మనుగడకు సవాల్ విసురుతున్నాయి. భవిష్యత్తులోనూ ఇలాంటి మహమ్మారుల ముప్పు ఉందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి సమయంలో అన్ని రకాల కరోనా వైరస్‌లను ఎదుర్కొనే టీకా (పాన్ కరోనా వ్యాక్సిన్) అభివృద్ధి చేసేందుకు ఇదే సరైన సమయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. మరో మహమ్మారిని నిరోధించడంతోపాటు ఎన్నో రకాల కరోనా వైరస్‌ల నుంచి ఈ తరహా వ్యాక్సిన్‌ పూర్తి రక్షణ కల్పిస్తాయని అభిప్రాయపడింది.

‘కరోనా వైరస్‌లన్నింటినీ ఎదుర్కొనే వ్యాక్సిన్‌ రూపొందించే సమయం ఆసన్నమైంది. కానీ, ఇందుకు ప్రపంచ దేశాలు సహకరించాలి. అంతేకాకుండా వీటిని అభివృద్ధి చేయడంతో పాటు అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు పరిశోధకులు, సంస్థలు, అంతర్జాతీయ ఏజెన్సీలు కీలక పాత్ర పోషించాల్సి ఉంది’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ అన్నారు. ఆ విధంగా భవిష్యత్తులో ఎదురయ్యే ఇతర మహమ్మారుల నుంచి రక్షించుకోవచ్చని తెలిపారు.

ఇదిలాఉంటే, భవిష్యత్తులో వివిధ రకాల కరోనావైరస్‌ల వల్ల సంభవించే మహమ్మారుల నుంచి రక్షణ కల్పించేందుకు అమెరికాలోని నార్త్‌ కరోలినా యూనివర్సిటీ (UNC) శాస్త్రవేత్తల బృందం ఇప్పటికే ఓ యూనివర్సల్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే పనిలో నిమిగ్నమైంది. ముఖ్యంగా జంతువుల నుంచి మానవులకు సోకే కరోనావైరస్‌ కుటుంబానికి చెందిన ఇతర వైరస్‌లను ఎదుర్కొనేలా దీనిని అభివృద్ధి చేస్తున్నారు. ఎలుకల్లో జరిపిన ప్రయోగాల్లో ఇది కొవిడ్‌-19తో పాటు ఇతర కరోనా వైరస్‌ల ప్రమాదకర వేరియంట్లను ఎదుర్కొనేలా రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. సెకండ్‌ జనరేషన్‌ వ్యాక్సిన్‌ల పేరుతో ఈ పరిశోధన ముమ్మరంగా కొనసాగుతోంది.

జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 21 కోట్ల దాటగా.. మరణాల సంఖ్య 45లక్షలకు చేరింది. కరోనా వైరస్‌ను నిరోధించే వ్యాక్సిన్‌ పంపిణీ కూడా వేగంగా కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 180కిపైగా దేశాల్లో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగా.. ఇప్పటివరకు 520 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు సమాచారం.

ఇక భారత్‌లోనూ వ్యాక్సిన్‌ పంపిణీ వేగం మరింత పుంజుకుంది. ఆగస్టు 28న ఒక్కరోజే దేశవ్యాప్తంగా కోటి డోసులను పంపిణీ చేశారు. అంతేకాకుండా దేశంలో 50శాతం మందికి (18 ఏళ్లు పైబడిన వారిలో) కనీసం ఒక డోసు అందించడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ భారత్‌ను అభినందించారు.