పాకిస్తాన్ హై కమిషన్ ముసుగులో వాళ్లు చేసిన మోసాలివే

  • Published By: Subhan ,Published On : June 3, 2020 / 03:55 PM IST
పాకిస్తాన్ హై కమిషన్ ముసుగులో వాళ్లు చేసిన మోసాలివే

ఇండియా లో పాకిస్తాన్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ కుయుక్తులు మరోసారి బైట పడ్డాయి . మన దేశానికి చెందిన కీలక సమాచారం సంపాదించడానికి ఐ ఎస్ ఐ అనేక ఎత్తుగడలు అనుసరిస్తోంది . త్రివిధ దళాలకు చెందిన కీలక సమాచారం సేకరించడానికి ఐ ఎస్ ఐ రకరకాల పద్ధతుల్లో ప్రయత్నిస్తోంది . అంతేకాదు … దేశ భద్రతకు సంబంధించిన వివిధ సంస్థల సమాచారం కూడా సేకరించడానికి ఐ ఎస్ ఐ ఏజెంట్లు ప్రయత్నిస్తున్నారు . అందుకోసం ప్రభుత్వ అధికారులు , సైనిక దళాలకు చెందిన అధికారులకు డబ్బిచ్చి లోబరుచుకుంటున్నారు . కొన్ని సార్లు సామాజిక మాధ్యమాల ద్వారా ” హనీ ట్రాప్ ” తో ఆకర్షిస్తున్నారు .  మన ఇంటలిజెన్స్ విభాగం గతం లో అనేక దఫాలు ఇలాంటి ఎత్తుగడలను వమ్ము చేసింది . పాక్ గూఢచారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి . శ్రీలంక , నేపాల్ వంటి మన పొరుగు దేశాల్లో కూడా ఐ ఎస్ ఐ ఏజెంట్లు చురుగ్గా పని చేస్తున్నారు . అక్కడి నుంచి మన త్రివిధ దళాలకు కు చెందిన కీలక సమాచారం సంపాదిస్తున్నారు . తాజాగా ఢిల్లీ లో మరో కేసు వెలుగులోకి వచ్చింది . 
 
పాకిస్తాన్ కు చెందిన ఇద్దరు ఐ ఎస్ ఐ ఏజెంట్లను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . ప్రభుత్వ అధికారులు , భారత సైనిక దళాలకు చెందిన అధికారులు , జవాన్ల నుంచి దేశ భద్రతకు సంబంధించిన కీలక పత్రాలను వీళ్ళు సేకరిస్తున్నారు . అందుకోసం డబ్బు , ఖరీదైన కానుకలు ఆశ చూపుతున్నారు . ఇండియా లోని పాక్ రాయబార కార్యాలయం లో పనిచేస్తున్న వీరిద్దరూ రెండేళ్లుగా ఇదేపనిమీద ఉన్నారు . మిలిటరీ ఇంటలిజెన్స్ వర్గాలు కొన్నాళ్లుగా వీరిపై నిఘాపెట్టి ఢిల్లీ పోలీసులకు ఉప్పందించడంతో రెడ్ హ్యాండెడ్ గా దొరికారు . 
 
ఇండియా లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం లో పని చేస్తున్న ఇద్దరు ఐ ఎస్ ఐ ఏజెంట్లను ఢిల్లీ పోలీసులు వలపన్ని రెడ్ హాండెడ్ గా పట్టుకున్నారు . దాంతో పాకిస్తాన్ గూఢచారుల గుట్టు రట్టయ్యింది . పాకిస్తాన్ రాయబార కార్యాలయం ఉద్యోగుల ముసుగులో ఐ ఎస్ ఐ ఏజెంట్లు రెండేళ్లుగా ఇండియా లో తమ గూఢచర్యం సాగిస్తున్నారు . అబిద్ హుస్సేన్ , ముహమ్మద్ తాహిర్ …వీరిద్దరూ పాక్ రాయబార కార్యాలయం ఉద్యోగులు . 
 
అసలు వాళ్లు ఎవరు?
అబిద్ హుస్సేన్ పాకిస్తాన్ హై కమిషన్ లో అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు . పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన వాడు . ముహమ్మద్ తాహిర్ అప్పర్ డివిజన్ క్లర్క్ గా పని చేస్తున్నాడు . ఇస్లామాబాద్ కు చెందిన వాడు . వీళ్ళిద్దరూ పాక్ హై కమిషన్ లో వీసా విభాగం లో పనిచేస్తున్నారు . వీరిద్దరితో పాటు డ్రైవర్ జావేద్ అక్తర్ ను కూడా ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . జావేద్ వీరిద్దరికీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు . పాకిస్తాన్ లోని మియాన్ వాలీ కి చెందిన వాడు .  
 
ఇంతకీ పాక్ ఐ ఎస్ ఐ కుట్ర ఎలా వెలుగులోకి వచ్చింది ? సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం …కొన్నాళ్ల క్రితం ఇండియా మిలిటరీ ఇంటలిజెన్స్ విభాగానికి ఒక రహస్య సమాచారం అందింది . పాకిస్తాన్ హై కమిషన్ కు చెందిన కొందరు ఉద్యోగులు గూఢచర్యానికి పాల్పడుతున్నారన్నది ఆ సమాచారం . భారత సైనిక దళాలకు చెందిన అధికారులు , జవాన్లను లక్ష్యంగా చేసుకుని వీరు పని చేస్తున్నారు . సైనిక దళాలు . దేశ భద్రతకు సంబంధించిన సంస్థల కీలక సమాచారం సంపాదించడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు . అంతేగాక భారత సైనిక దళాలు ఎక్కడెక్కడ మోహరించాయన్న విషయాల గురించి కూడా కూపీలాగుతున్నారు . 

ఎలా చేస్తారు?
ఇండియా లో పాక్ గూడాచారుల ”మోడస్ అపరాండీ” ఏమిటి ? వీళ్ళు గూఢచర్యం కోసం ఎలాంటి పద్ధతులు అనుసరిస్తున్నారు ? అబిద్ హుస్సేన్ , ముహమ్మద్ తాహిర్ …ఇద్దరూ భారతీయుల అవతారం ఎత్తారు . పేర్లు మార్చుకున్నారు . నకిలీ ఆధార్ కార్డులు సంపాదించారు . పంజాబ్ కు చెందిన వారీగా చెప్పుకుంటున్నారు , వ్యాపారులుగా నటిస్తున్నారు . సైనిక దళాల అధికారులు , జవాన్లు , కీలక శాఖల్లో పని చేస్తున్న అధికారులను కలుస్తుంటారు . ఎవర్ని కలవాలన్నది పాకిస్తాన్ లోని ఐ ఎస్ ఐ ఏజెంట్లు వీరికి సమాచారం పంపుతారు . ఢిల్లీ మార్కెట్లు , బజార్లలో కలిసి తాము వ్యాపారులమని నమ్మిస్తారు . జర్నలిస్టులకు ఫలానా సమాచారం అవసరం అయ్యిందని కూడా నమ్మిస్తారు .  సమాచారం లేదా అందుకు సంబంధించిన కీలక పత్రాలు అందిస్తే డబ్బిస్తామని బేరం కుదుర్చుకుంటారు . సమాచారం ఇస్తే పాతికవేల రూపాయలు , ఐ ఫోన్ వంటి ఖరీదైన కానుకలు ఇస్తారు . ఒక్కసారి వీరి వలలో పడితే …ముందుముందు వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి మరిన్ని పత్రాలు … రహస్య సమాచారం సేకరిస్తారు . ఇప్పటికే అనేక మంది ప్రభుత్వ అధికారులు , సైనికాధికారులు , జవాన్లు వీరి వలలో చిక్కారు . 
 
మాటు వేసి పట్టుకున్నారు:
పాక్ గూఢచారులు సంబంధించిన రహస్య సమాచారం అందగానే మిలిటరీ ఇంటలిజెన్స్ అప్రమత్తం అయ్యింది . అబిద్ హుస్సేన్ , ముహమ్మద్ తాహిర్ కదలికలపై నిఘాపెట్టింది . ఢిల్లీ లోని కరోల్ బాగ్ లోని ఆర్య సమాజ్ రోడ్డులో ఉన్న బికానెర్ వాలా చౌక్ లో ఇంటలిజెన్స్ స్పెషల్ టీం మాటు వేసింది . వీళ్ళిద్దరూ అక్కడ ఒక వ్యక్తిని కలవబోతున్నట్లు సమాచారం ఉంది . అతడి నుంచి కొన్ని కీలక పత్రాలు సేకరించనున్నారన్నది ఇంటలిజెన్స్ వర్గాలకు అందిన సమాచారం . పాకిస్తాన్ హై కమిషన్ కారులో వాళ్లిదరు అక్కడికొచ్చారు . వెంటనే ఢిల్లీ పోలీసుల సాయంతో మిలిటరీ ఇంటలిజెన్స్ స్పెషల్ టీం వీరిని రెడ్ హాండెడ్గా పట్టుకుంది . సిరివెర్ జావేద్ అక్తర్ సహా ముగ్గురినీ అదుపు లోకి తీసుకుంది .   
 
పాకిస్తాన్ హై కమిషన్ ఉద్యోగుల ముసుగులో గూఢచర్యం సాగిస్తున్న ఐ ఎస్ ఐ ఏజెంట్లు ఢిల్లీ పోలీసుల చేతికి చిక్కారు . వారి నుంచి పోలీసులు ఎలాంటి సమాచారం రాబట్టారు ? ఇప్పటి వరకు ఎంతమంది అధికారులను , ఆర్మీ జవాన్లను వీళ్ళు బుట్టలో వేసుకున్నారు ? ఇంతవరకూ ఎలాంటి సమాచారం సేకరించారు ? ఇలాంటి ఐ ఎస్ ఐ ఏజెంట్లు ఇండియా లో ఇంకెంత మంది ఉన్నారు ? 

ఏం దొంగిలించారు:
పాక్ గూఢచారులు ఇప్పటికే కీలక శాఖల్లో పని చేస్తున్న అధికారులు చాలా మందిని బురిడీ కొట్టించారు . అటు సైనిక దళాల్లో కూడా అనేక మంది అధికారులు , జవాన్లు వీరి బుట్టలో పడ్డారు . ఇప్పటికే భారత సైనిక దళాలకు చెందిన అనేక కీలక పత్రాలు వీళ్ళు సేకరించారు . దేశ భద్రతకు సంబంధించిన కొన్ని సంస్థల నుంచి రహస్య సమాచారం చేతులు మారింది . అందుకోసం వీళ్ళు భారత అధికారులకు డబ్బిచ్చారు . ఖరీదైన కానుకలు సమర్పించారు . తాము పాకిస్తాన్ గూఢచారులని గానీ , పాక్ హై కమిషన్ ఉద్యోగులని గానీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు . చండీగఢ్ కు చెందిన వ్యాపారులుగా తమను పరిచయం చేసుకున్నారు . కొందరు జర్నలిస్టులకు ఫలానా సమాచారం కావాలని , అందుకు డబ్బిస్తామని నమ్మబలికారు . 

ఏమేం చేశారంటే: 
ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు , మిలిటరీ అధికారుల బంధువుల్లో ఎవరైనా పాక్ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే క్షణాల్లో వాళ్ళ పనులు చేసిపెడతారు . ఇప్పటికి ఏ ఏ శాఖల్లో ఎంత మంది  వీరి వలలో చిక్కారో తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు . ఇంతవరకూ ఎలాంటి సమాచారం చేతులు మారిందన్న విషయం పై కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు . ఇప్పటి వరకు వివిధ కీలక ప్రభుత్వ శాఖలకు , సైనిక దళాలకు చెందిన పన్నెండు మందిపై అధికారులు , జవాన్లపై మిలిటరీ ఇంటలిజెన్స్ , ఢిల్లీ పోలీలు నిఘా పెట్టారు . వాళ్లకు సంబంధించిన పూర్తి సమాచారం సేకరిస్తున్నారు . వారి బంధువుల సమాచారం కూడా సేకరిస్తున్నారు .  

ఇన్వెస్టిగేషన్ జరుగుతుందిలా:
పాకిస్తాన్ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న భారతీయుల వివరాలు కూడా సేకరిస్తున్నారు . వారిలో ప్రభుత్వ ఉద్యోగులు , మిలిటరీ అధికారుల బంధువులు ఉన్నారా అన్నది పరిశీలిస్తున్నారు . వీళ్లంతా ఏ ఏ శాఖల్లో , ఈ విభాగాల్లో పని చేస్తున్నారు అన్నది కూడా తెలుసుకుంటున్నారు . దాని ఆధారంగా ఎలాంటి సమాచారం చేతులు మారిందన్న విషయంపై ఒక అవగాహనకు రావచ్చు . అసలు పాక్ గూఢచారులు , భారత దేశానికి చెందిన వ్యక్తుల మధ్య ఎలాంటి సంబంధం ఉందన్న విషయంపై కూడా ”కౌంటర్ స్పయింగ్” ఏజెన్సీలు ఆరా తీస్తున్నాయి . భారత మిలిటరీ ఇంటలిజెన్స్ విభాగం తీగ లాగింది . ఇప్పుడు డొంకంతా కదులుతోంది . ఇదంతా ఒక కొలిక్కి వస్తే చాలా మంది అరెస్టు కావచ్చని ఢిల్లీ పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి . 
 
తవ్వే కొద్దీ చాలా విషయాలు బయటకు రావచ్చని కూడా ఢిల్లీ పోలీసు వర్గాలు చెబుతున్నాయి . ముందుగా పాక్ వీసా కోసం వచ్చిన దరఖాస్తులను వడబోస్తారు . అందులో ప్రభుత్వ అధికారులు , మిలిటరీ అధికారుల బంధువులు ఎవరైనా ఉన్నారా అనేది తెలుసుకుంటారు . అలాంటి వారు దొరికితే …తక్షణం వాళ్ళ వీసాలు మంజూరు చేసి పరిచయం చేసుకుంటారు . వాళ్ళ ద్వారా అధికారులను కలుస్తారు . కాంటాక్ట్ కోసం వీళ్ళు అనుసరించే పధ్ధతి ఇది . మిలిటరీ ఇంటలిజెన్స్ దర్యాప్తులో మరో విషయం కూడా బైటపడింది . 
 
కీలక మైన పత్రాల కోసం వీళ్ళు ఒక్కొక్క పత్రానికి పాతిక వేల రూపాయలు చెల్లిస్తారు . పోలీసుల చేతికి చిక్కిన ఇద్దరు పాక్ హై కమిషన్ ఉద్యోగులు ఇలాంటి చెల్లింపుల కోసం ఫోన్ వాలెట్ యాప్ ఉపయోగిస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు . ఒక సారి వీరి వలలో పడితే … ఆ తరువాత బ్లాక్ మెయిల్ చేస్తారు . మరింత సమాచారం , మరిన్ని పత్రాలు కావాలంటారు . ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియా లోని గోపినాథ్ బాజార్ , సదర్ బాజార్ లో ఎక్కువగా వీళ్ళు మిలిటరీ అధికారులను కలుస్తారు . ఆర్మీ జవాన్లు కొందరిని వీళ్ళు పేస్ బుక్ ద్వారా పరిచయం చేసుకుంటారు …ఆ తరువాత మెసెంజర్ లో చాటింగ్ తో ముగ్గులోకి లాగుతారు . 

పట్టుబడ్డ పాక్ హై కమిషన్ ఉద్యోగులను భారత ప్రభుత్వం ”పెర్సొన నాన్ గ్రాటా” గా ప్రకటించింది . దీనర్ధం ఇలాంటి వ్యక్తులను భారత దేశం అంగీకరించబోదు . ఇరవై నాలుగు గంటల్లో వీళ్ళు దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించింది . కానీ , పాకిస్తాన్ మాత్రం భారత్ చర్యను ఖండించింది . ఇదంతా పాకిస్తాన్ వ్యతిరేక భారత మీడియా కుట్ర అని వ్యాఖ్యానించింది . 

ఎప్పుడు దొరికారంటే:
మే నెల 31 వ తేదీన పాక్ గూఢచారులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు . వారు ప్రయాణిస్తున్న కారు నుంచి కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు . 15  వేల రూపాయల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు . వారి వద్ద రెండు కొత్త ఐ ఫోన్లు కూడా దొరికాయి . తాము పాకిస్తాన్ హై కమిషన్ లో పని చేస్తున్నామని , ఐ ఎస్ ఐ ఏజెంట్లమని వాళ్ళు ఇంటరాగేషన్ లో అంగీకరించినట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి . అవసరమైన సమాచారం కోసం తాము అనేక మందిని కలిశామని కూడా పాక్ గూడాచారులు పోలీసులకు చెప్పారు . కాకపోతే ఆ అధికారుల పేర్లు మాత్రం పోలీసులు వెల్లడించ లేదు . భారత విదేశాంగ శాఖ పాకిస్తాన్ చర్యలను ఖండించింది . ఇది దౌత్య స్థాయికి తగిన వ్యవహారం కాదంది. 

విచారణలో తేలిన నిజాలు:
భారత దేశానికీ హాని తలపెట్టేవారు దౌత్య కార్యాలయాల్లో ఉండరాదని తేల్చి చెప్పింది . ఇరవై నాలుగు గంటల్లో వీళ్ళు దేశం విడిచి వెళ్లాల్సిందిగా పాక్ హై కమిషన్ కు తెలియ చేసింది . ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ , ఇతర ”కౌంటర్ స్పయింగ్” ఏజెన్సీలు పాకిస్తాన్ గూఢచారులను ఇంటరాగేషన్ చేశాయి . పోలీసుల చేతికి చిక్కిన పాక్ గూఢచారులు తాము భారతీయులమని చెప్పుకున్నారు . వెంటనే తమ వద్ద ఉన్న ఆధార్ కార్డులు తీసి చూపించారు . అవి నకిలీ ఆధార్ కార్డులని తరువాత పోలీసులు తెలుసుకున్నారు . ఇంటరాగేషన్ లో మాత్రమే వాళ్ళు పాకిస్తాన్ హై కమిషన్ లో పని చేస్తున్నట్లు అంగీకరించారు . ఐ ఎస్ ఐ తో సంబంధాలు కూడా అంగీకరించారు . 
 
తప్పుడు ఆరోపణలు అంటోన్న పాకిస్తాన్:
మొత్తం వ్యవహారం పై పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది . తమ దౌత్య కార్యాలయ సిబ్బందిని ”పెర్సొన నాన్ గ్రాటా” గా భారత ప్రభుత్వం నిర్ణయించడం పై పాకిస్తాన్ విదేశాంగ శాఖ అభ్యంతరం తెలిపింది . ఇదంతా పాకిస్తాన్ వ్యతిరేక భారత మీడియా సృష్టి అని ఆరోపించింది . దానికి అనుగుణంగా భారత విదేశాంగ శాఖ చర్యలు ఉన్నాయన్నది . తమ దౌత్య కార్యాలయ సిబ్బందిని అరెస్టు చేయడం , వారిని చిత్ర హింసలు పెట్టడం , వారిని బలవంతం పెట్టి  , వారి నుంచి తప్పుడు వాంగ్మూలం  తీసుకోవడం దౌత్య స్థాయికి తగిన వ్యవహారం కాదని వ్యాఖ్యానించింది . ఇకపై పాకిస్తాన్ దౌత్య కార్యాల ఉద్యోగులు భారత్ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన రాదని భారత విదేశాంగ శాఖ పాక్ హై కమిషన్ కు రాతపూర్వకంగా తెలియజేసింది .

మరో పక్క ఇండియా పొరుగు దేశాల నుంచి కూడా ఇలాంటి సమాచారం అందుతోంది . శ్రీలంక లోని పాక్ దౌత్య కార్యాలయ సిబ్బంది కొందరు భారత్ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని భారత్ విదేశాంగ శాఖకు సమాచారం అందుతోంది . 2016  లో కూడా ఇలాంటి కేసు ఒకటి జరిగింది . ఆనాడు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పాకిస్తాన్ దౌత్య కార్యాలయం ఉద్యోగి ఒకరిని ఇలాంటి ఆరోపణలమీదే అరెస్టు చేసింది .