గంగవరం పోర్టులో అదానీ గ్రూప్‌కి పెరిగిన వాటాలు

గంగవరం పోర్టులో అదానీ గ్రూప్‌కి పెరిగిన వాటాలు

Adani Group Stake Increased In Gangavaram Port

ఏపీలో అత్యంత కీలకమైన, రెండో అతిపెద్ద పోర్టు గంగవరం పోర్టులో అదానీ గ్రూప్ వాటాలు పెంచుకుంది. భారత్‌లోనే అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్‌గా తమ సంస్థను విస్తరించేందుకు అడుగులు వేస్తున్న అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ పోర్ట్స్ అండ్ ఎస్‌ఈజెడ్ లిమిటెడ్.. డీవీఎస్ రాజు కుటుంబం నుంచి 58.1 శాతం వాటాలను కొనుగోలు చేసింది. 3వేల 604 కోట్ల రూపాయలుగా దాని విలువ ఉంది. గతంలో వార్ బర్గ్ పింకస్ నుంచి 35.5 శాతం వాటాలను కొనుగోలు చేసింది.

లేటెస్ట్‌గా కొనుగోలుతో గంగవరం పోర్టులో 89.6 శాతం వాటాను అదానీ గ్రూప్ కైవసం చేసుకుంది. ఆరు నెలల్లో ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యే అవకాశం ఉందని అదానీ గ్రూప్ వెల్లడించింది. తూర్పు తీరంలో పోర్టులను ఒక్కొక్కటిగా చేజిక్కించుకుంటున్న అదానీ గ్రూప్ గత ఏడాది ఏపీలోని మరో పోర్ట్ అయిన కృష్ణపట్నాన్ని 12వేల కోట్లతో కొనుగోలు చేసింది. కృష్ణపట్నం, గంగవరం పోర్టుల కొనుగోలుతో ఏపీ సముద్ర తీరంపై అదానీ పోర్ట్స్‌ ఆధిపత్యం సాధించినట్టయింది.

ఏపీలో రెండో అతిపెద్ద నాన్‌ మేజర్‌ పోర్టు అయిన గంగవరం.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు అతి దగ్గరగా ఉంటుంది. దీని సామర్థ్యం 64 మిలియన్ మెట్రిక్‌ టన్నులు. అన్ని సీజన్లలో రవాణాకు ఈ పోర్టు అనుకూలంగా ఉంటుంది. లోతు ఎక్కువ. రెండు లక్షల డెడ్‌ వెయిట్ టన్నుల సామర్థ్యం ఉండే భారీ సూపర్ కేప్ సైజ్ ఓడలు కూడా ఈ పోర్టుకు రాకపోకలు సాగించగలవు.

బొగ్గు, ఇనుప ఖనిజం, ఎరువులు, సున్నపురాయి, బాక్సైట్‌, పంచదార, అల్యూమినియం, స్టీల్ సహా అన్ని రకాల ముడి సరుకులను భారీ ఎత్తున రవాణా చేయవచ్చు. ప్రస్తుతం గంగవరం పోర్ట్ లిమిటెడ్‌ 9 బెర్త్‌లను ఆపరేట్ చేస్తోంది. 1,800 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీన్ని 31 బెర్తులతో 250 మిలియన్ మెట్రిక్‌ టన్నుల సామర్థ్యానికి విస్తరించవచ్చు.

పోర్టును దాని సామర్థ్యానికి తగ్గట్టుగా 250 మిలియన్ మెట్రిక్ టన్నులకు విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని గతంలోనే కరన్ అదానీ చెప్పారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో పోర్టు కార్గో వాల్యూమ్ 34.5 మిలియన్ మెట్రిక్ టన్నులు. వెయ్యీ 82 కోట్ల ఆదాయం లభించింది. పోర్టుకు గంగవరం పోర్ట్‌కు ఎలాంటి అప్పులూ లేవు. 500 కోట్ల మిగులు ఆదాయం ఉంది. గంగవరం పోర్టులో ప్రస్తుతం 9 బెర్తులున్నాయి. 18వందల ఎకరాల ఖాళీ భూమి ఉంది.

ఏపీకి 974 కిలోమీటర్ల తీరప్రాంతం ఉంది. ఇది దేశంలోనే రెండో పెద్ద తీర ప్రాంతం కాగా… భారత తూర్పు తీరంలో అత్యంత పొడవైనది. కార్గో రవాణాలో గుజరాత్‌ అగ్ర స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో నిల్చింది. కృష్ణపట్నం పోర్టు ఇప్పటికే అదానీ గ్రూప్‌ పరిధిలోకి వచ్చింది. ఇప్పుడు గంగవరం పోర్టు కూడా అదానీ పరమైంది. దీంతో ఏపీలోని రెండు కీలకమైన పోర్టులు అదానీ గ్రూప్‌ కంట్రోల్‌లోకి వచ్చినట్లైంది. కోల్‌, ఐరన్‌ఓర్‌, ఫెర్టిలైజర్స్, లైమ్‌స్టోన్‌, షుగర్‌, స్టీల్‌ వంటివి ఎగుమతులు, దిగుమతులకు గంగవరం పోర్టు అనుకూలం.