All Party Meetingలో పార్టీల నేతలు ఏమన్నారంటే

  • Published By: madhu ,Published On : June 20, 2020 / 01:49 AM IST
All Party Meetingలో పార్టీల నేతలు ఏమన్నారంటే

ఆల్‌పార్టీ మీటింగ్‌లో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ… భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. క్లిష్టమైన సంక్షోభ సమయంలో దేశ ప్రజలకు సమాచారం లేదని ఆమె కేంద్రంపై మండిపడ్డారు. చైనా బలగాలు లద్దాఖ్‌లో ఎప్పుడు ప్రవేశించాయని ప్రశ్నించారు. మే 5 నుంచి జూన్‌ 6వరకు విలువైన సమయాన్ని వృథా చేశామన్నారు. కోర్‌ కమాండర్‌ స్థాయి చర్చల అనంతరం రాజకీయ,దౌత్యపర చర్చలు జరపాల్సిందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని.. దాని ఫలితమే 20మంది జవాన్లను బలితీసుకుందన్నారు.

తృణమూల్‌ కాంగ్రెస్ : –
చైనా కుతంత్రాలను తిప్పికొట్టడంలో తమ పార్టీ మద్దతు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, బెంగాల్‌సీఎం మమతాబెనర్జీ అన్నారు. చైనాముందు ఎట్టి పరిస్థితుల్లోనూ తలవంచవద్దన్నారు. చైనా నియంతృత్వదేశమని… తాను ఏదనుకుంటే అదే చేస్తుందన్నారు. ఇలాంటి సమయంలో అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. టెలికాం, రైల్వే, వైమానిక రంగాల్లోకి చైనాను అనుమతించొద్దని ఆమె కోరారు.

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి  : –
భారత ప్రభుత్వం పంచశీల సూత్రాలను పాటించాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ కేంద్రాన్ని కోరారు. భారత్‌ను తమ కూటమిలోకి లాగేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలను ఎదుర్కోవాలన్నారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ : –
అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌… చైనా విషయంలో ఏమాత్రం తొందరపాటు వద్దన్నారు. అదే సందర్భంలో దేశ ప్రయోజనాల  విషయంలో తలవంచాల్సిన అవసరం లేదన్నారు. చైనాను ఎదుర్కొనేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలను అవలంభించాలని కేంద్రానికి సూచించారు. చైనా విషయంలో కేంద్ర ప్రభుత్వానికి తాము సంపూర్ణ మద్దతు తెలుపుతామని.. దేశంలో ఇప్పుడు కావాల్సింది రాజకీయం కాదు…. యుద్ధనీతి కావాలని అభిప్రాయపడ్డారు. 

ఏపీ సీఎం జగన్ : –
ఇదే మీటింగ్‌లో పాల్గొన్న ఏపీ సీఎం జగన్‌… ప్రధాని మోదీయే మనదేశ బలమని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మోదీ నెలకొల్పారని అన్నారు. భారత్‌ను అస్థితర పరిచేందుకు చైనా కుట్రలు చేస్తోందని.. దౌత్య, ఆర్థికపరంగా చైనాను ఎదుర్కోవాలన్నారు.

బీహార్‌ సీఎం, డీఎంకే అధినేత, శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం : –
చైనాపట్ల దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోందని బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ అన్నారు.  దేశభక్తి విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ఉంటాయని డీఎంకే అధినేత స్టాలిన్‌ అన్నారు. భారత్ శాంతి కోరుకుంటోందంటే దానర్థం చేతగానితనం కాదని శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. మనమందరం ఒక్కటేనన్నారు. ప్రధానితో అందరం ఉన్నామని, సైనిక బలగాలు, వారి కుటుంబాలతో ఉంటామని ఈ సందర్భంగా అఖిలపక్షనేతలు భరోసా ఇచ్చారు.  

సైన్యం పూర్తి సన్నద్ధం : రాజ్‌నాథ్‌సింగ్‌
గాల్వాన్‌లోయలో చైనా బలగాలు కుట్రపూరితంగా దాడిచేసి 20మంది భారత జవాన్లను పొట్టనపెట్టుకోవడంపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి కాంగ్రెస్‌తోపాటు 20 ప్రతిపక్షపార్టీలు  హాజరయ్యారు. దీంతో ప్రతిపక్ష నేతల నుంచి కేంద్ర ప్రభుత్వం సలహాలు, సూచనలను  స్వీకరించింది. అదే సమయంలో గల్వాన్‌ లోయలో జరిగిన పరిణామాలను రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రతిపక్ష నేతలకు వివరించారు. ఇంటెలిజెన్స్‌ ఫెయిల్యూర్‌ లేదని.. సైన్యం పూర్తి సన్నద్ధంగా ఉందని ప్రతిపక్షాలకు తెలిపారు.

సరిహద్దులకు అదనపు బలగాలు : –
మరోవైపు సరిహద్దుల్లో చైనా దురాక్రమణకు పాల్పడుతుండటంతో దాన్ని అడ్డుకునేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. సరిహద్దులకు అదనపు బలగాలను తరలిస్తోంది. ఇటు ఎయిర్‌ఫోర్స్‌ కూడా అప్రమత్తమైంది. కీలకమైన తూర్పు లద్దాఖ్  ప్రాంతానికి ఆయుధాలను తరలిస్తోంది. ఎయిర్‌ చీఫ్‌ భదౌరియా యుద్ధ సన్నద్ధతను పరిశీలిస్తున్నారు.

Read: సరిహద్దుల్లోకి ఒక్కర్ని కూడా అడుగుపెట్టనివ్వలేదు.. అంగుళం కూడా ఆక్రమించనివ్వలేదు: పీఎం మోడీ