వేసినా బాదుడే – తీసినా బాదుడే… బ్యాంకుల్లో అడ్డగోలుగా చార్జీలు వసూలు

వేసినా బాదుడే – తీసినా బాదుడే… బ్యాంకుల్లో అడ్డగోలుగా చార్జీలు వసూలు

Banks charging service charges from customers for every transaction : బ్యాంకులు సర్వీసు చార్జీల పేరుతో సమాన్యుడిపై భారం మోపుతున్నాయి. కరోనా లాక్ డౌన్ కాలంలో గతంలో ఉన్న రూల్స్ మారిపోయి, కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. అవి తెలుసుకోని వినియోగదారుల ఖాతాల నుంచి సర్వీసు చార్డీల కింద బ్యాంకులు వందలకు వందలు వసూలు చేస్తున్నాయి. బ్యాంకులో నగదు వేసినా, తీసినా సర్వీసు చార్జీల కింద భారం మోపుతున్నాయి. కోవిడ్ కారణంగా నగదు నిర్వహణ భారం పెరిగిందని బ్యాంకులు చెపుతున్నాయి.

మూడ్నెల్ల నుంచి కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఏటీఎంలో నగదు విత్ డ్రా చేసినా, డిపాజిట్ చేసినా చార్జీలు విధిస్తున్నాయి. గతంలో కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నెలకు ఐదుసార్లు లావాదేవీలు నిర్వహించుకునేందుకు అవకాశం ఉండేది. ఇప్పుడు దాన్ని 3 సార్లుకు తగ్గించారు.

బ్యాంకుల్లో సేవింగ్స్ ఖాతాలపై ప్రస్తుతం 2 శాతం వడ్డీ లభిస్తోంది. ఫిక్స్ డ్ డిపాజిట్లపై స్వల్ప కాలానికి 3 శాతానికి మించి వడ్డీ ఇవ్వటంలేదు. బ్యాంకులు నగదు డిపాజిట్లపై వసూలు చేస్తున్న చార్జీలు అంతకంటే 3 రెట్లు ఎక్కువగా ఉంటున్నాయి. నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకే ఇలా చార్జీలు వసూలు చేస్తున్నట్లు కొన్ని బ్యాంకులు చెపుతున్నాయి.

ప్రభుత్వ బ్యాంకులు పరిమితికి మించి చేసిన లావాదేవీలకు ప్రతి వెయ్యికి 2రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నాయి. ప్రైవేటు  బ్యాంకులైతే  5రూపాయల వరకూ వసూలు చేస్తున్నాయి. దీనిపై మళ్లీ జీఎస్టీ అదనంగా వసూలు చేస్తున్నాయి. వాస్తవానికి తమ ఖాతాదారులకు బ్యాంకు సిబ్బంది ఈ విషయం తెలియచేయాలి. కానీ ఏబ్యాంకులోనూ ఇందుకు సంబంధించిన సూచిక బోర్డులు కనిపించట్లేదు.

నగదు నిర్వహణ భారం పెరగటం వలనే బ్యాంకులు తప్పనిసరి పరిస్ధితుల్లో చార్జీలు వసూలు చేస్తున్నాయని కొందరు బ్యాంకర్లు చెపుతున్నారు. ఏది ఏమైనా ఖాతాదారుల జేబులకు మాత్రం చిల్లు పడుతోంది.