చంద్రబాబు మోసం చేశారు, అందుకే వైసీపీలోకి.. నెక్స్ట్ గంటానే..?

చంద్రబాబు మోసం చేశారు, అందుకే వైసీపీలోకి.. నెక్స్ట్ గంటానే..?

chandrababu cheated me: ఏపీ సీఎం జగన్ పాలన నచ్చి వైసీపీలో చేరినట్టు గంటా శ్రీనివాస రావు ప్రధాన అనుచరుడు కాశీ విశ్వనాథ్ చెప్పారు. పదవులు ఇస్తామంటూ అనేకసార్లు టీడీపీలో తనను మోసం చేశారని కాశీ ఆరోపించారు. గత రెండేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని ఆయన తెలిపారు. కాశీ విశ్వనాథ్ చేరిక కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు ఇతర కీలక నేతలు ఉన్నారు. అయితే ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ మాత్రం దూరంగా ఉన్నారు.

దూరంగా అవంతి శ్రీనివాస్:
ఆది నుంచి గంటాపై మంత్రి అవంతి నిప్పులు చెరుగుతున్నారు. దీంతో గంటా ప్రధాన అనుచరుడైన కాశీ విశ్వనాథ్ చేరిక కార్యక్రమానికి పూర్తిగా దూరంగా ఉన్నారు అవంతి. ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో కాశీ చేరిక కార్యక్రమం ఉండగా, అవంతి మాత్రం ఓ ప్రైవేట్ దుకాణం ప్రారంభోత్సవానికి వెళ్లారు. ఏడాది క్రితమే కాశీ విశ్వనాథ్ వైసీపీలో చేరాల్సి ఉన్నా అవంతి అభ్యంతరం చెప్పడంతో చేరిక వాయిదా పడింది. చివరికి అవంతి ఇష్టానికి వ్యతిరేకంగా కాశీని పార్టీలోకి ఆహ్వానించింది వైసీపీ అగ్రనాయకత్వం. పైగా, కొన్ని నిర్ణయాలు కొంతమందికి నచ్చకపోవచ్చని, కానీ అంతిమంగా జగన్ నిర్ణయమే ఫైనల్ అంటూ ముక్తాయింపు ఇచ్చే ప్రయత్నం చేశారు విజయసాయిరెడ్డి.

గంటాపై బాంబు పేల్చిన విజయసాయి:
మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావుపై మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది వైసీపీ. గంటా కూడా వైసీపీకి ఆకర్షితులు అవుతున్నారని, పార్టీలో చేరే విషయంలో గతంలో గంటా కొన్ని ప్రతిపాదనలు పంపించారని, బాంబు పేల్చారు విజయసాయిరెడ్డి. దీంతో కాశీ విశ్వనాథ్ తర్వాత ఇంకా ఎంతమంది టీడీపీని వీడుతారో అనే చర్చ జరుగుతోంది. కొంతకాలంగా టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మాజీ గంటా శ్రీనివాస్ రావు ప్రధాన శిష్యుడు కాశీ విశ్వనాథ్ టీడీపీని వీడి వైసీపీలో చేరారు.

ఎంపీ విజయసాయిరెడ్డి కండువా కప్పి కాశీని పార్టీలోకి వెల్ కమ్ చెప్పారు. విశాఖ మున్సిపల్ ఎన్నికల వేళ నగర పరిధిలో మూడు నియోజకవర్గాల్లో పట్టు ఉన్న కాశీ..పార్టీని వీడటం టీడీపీకి భారీ షాక్ అనే చెప్పాలి. ఇది చాలదన్నట్టు ఇప్పుడు గంటా కూడా వైసీపీకి ఆకర్షితులు అవుతున్నారంటూ విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్ కాక రేపుతున్నాయి.