రియల్ హీరోలు.. మృతదేహంతో 3వేల కిమీ ప్రయాణం చేసిన అంబులెన్స్ డ్రైవర్లు

  • Published By: srihari ,Published On : May 3, 2020 / 07:55 AM IST
రియల్ హీరోలు.. మృతదేహంతో 3వేల కిమీ ప్రయాణం చేసిన అంబులెన్స్ డ్రైవర్లు

ఓవైపు కరోనా భయాలు, మరోవైపు లాక్ డౌన్. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆ ఇద్దరు అంబులెన్స్ డ్రైవర్లు సాహసం చేశారు. ఓ మృతదేహాన్ని స్వస్థలం చేరారు. అతడి కుటుంబసభ్యులకు కడచూపు దక్కేలా చేశారు. ఇందుకోసం ఏకంగా 5 రాష్ట్రాల మీదుగా 84 గంటల పాటు 3వేల కిలోమీటర్లు డెడ్ బాడీతో జర్నీ చేశారు. ఇప్పుడా అంబులెన్స్ డ్రైవర్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రియల్ హీరోస్ అని అంతా కితాబిస్తున్నారు. వారికి సెల్యూట్ చేస్తున్నారు. సన్మానాలతో ముంచెత్తారు.

మిజోరంకు చెందిన యువకుడు చెన్నైలో మృతిచెందగా, యువకుడి మృతదేహాన్ని అతడి ఇంటికి చేర్చారు అంబులెన్స్ డ్రైవర్లు. ఏకదాటిగా 84 గంటల పాటు 3 వేల కిలోమీటర్లు ప్రయాణించి మిజోరంలో యువకుడి మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. చెన్నై అంబులెన్స్ డ్రైవర్లుకు మిజోరం ముఖ్యమంత్రితో పాటు ఆ రాష్ట్ర ప్రజలు సెల్యూట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శభాష్ చెన్నై అంబులెన్స్ డ్రైవర్స్ అంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

5 రాష్ట్రాలు, 84 గంటలు, 3వేల కిమీ..డెడ్ బాడీతో జర్నీ:
జియాంతిరన్, చిన్నతంబి.. అంబులెన్స్ డ్రైవర్లు. చెన్నైకి చెందిన అన్నై కస్తూరి అంబులెన్స్ సర్వీస్ కి పని చేస్తారు. ఈ ఇద్దరే యువకుడి మృతదేహాన్ని చెన్నై నుంచి మిజోరంకి చేర్చారు. మిజోరం ట్రిప్ తమకు ఆనందం కలిగించిందని అంబులెన్స్ డ్రైవర్లు అన్నారు. మిజోరం వాసులు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తమను అభినందించడం జీవితంలో మర్చిపోలేని ఘట్టాలని అన్నారు. ఏప్రిల్ 24న అర్థరాత్రి చెన్నై నుంచి డెడ్ బాడీతో బయలుదేరారు. ఏప్రిల్ 27న ఉదయం 4గంటలకు మిజోరం చేరుకున్నారు. ఈ మొత్తం జర్నీలో కేవలం ఆహారం, ఇంధనం కోసం మాత్రమే వారు అంబులెన్స్ ఆపారు. ఒకరు 8 గంటలు, మరొకరు 8 గంటలు పాటు డ్రైవింగ్ చేశారు.

చెన్నైలో మిజోరం యువకుడు మృతి:
మిజోరంకు చెందిన 28 ఏళ్ల యువకుడు తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కొంత కాలం క్రితం అనారోగ్యానికి గురైన అతడు చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో ఏప్రిల్ 23వ తేదీన మరణించాడు. మిజోరం యువకుడు అంత్యక్రియులు చెయ్యడానికి ఆయన కుటుంబ సభ్యులు చెన్నై రాలేకపోయారు. లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో మిజోరం నుంచి చెన్నై రావడానికి అతని కుటుంబ సభ్యులకు ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. చెన్నైలోనే ఆ యువకుడి అంత్యక్రియులు చెయ్యడానికి అతనికి సంబంధించిన ఒక్క మనిషికూడా లేకపోవడంతో అందరూ అయోమయంలో పడిపోయారు.

పెద్ద సాహసమే చేసిన అంబులెన్స్ డ్రైవర్లు:
చెన్నై నుంచి మిజోరంకు యువకుడి మృతదేహాన్ని తీసుకొచ్చి ఇస్తే ఎంత డబ్బైనా ఇస్తామని, మా బిడ్డను చివరిసారి చూసుకోవడానికి అవకాశం ఇవ్వాలని అతని కుటుంబ సభ్యులు వేడుకున్నారు. అయితే చెన్నై నుంచి మిజోరం వెళ్లడానికి మా వల్ల కాదని అంబులైన్స్ డ్రైవర్లు చేతులు ఎత్తేశారు. ఆ సమయంలో వీరిద్దరూ ముందుకొచ్చారు.

లాక్ డౌన్ సమస్యలు ఎన్ని ఉన్నా ఆ యువకుడి కుటుంబ సభ్యుల కోరిక తీర్చాలని నిర్ణయించుకున్నారు. ఒక అంబులెన్స్ లో మిజోరం వెళ్లడానికి సిద్దం అయ్యారు. మిజోరంలో ఉన్న యువకుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి చెన్నై నుంచి యువకుడి మృతదేహాన్ని తీసుకుని మిజోరం బయలుదేరారు. సుమారు 3 వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేశారు. మార్గం మధ్యలో పశ్చిమ బెంగాల్, సిలిగురి, గౌహతి తదితర ప్రాంతాల్లోని హైవే రహదారుల్లో అంబులైన్స్ డ్రైవర్లకు మిజోరం రాష్ట్రానికి చెందిన ప్రజలు ఆహారం, కావాలసిన అవసరాలు తీర్చారు.

సెల్యూట్ చేసిన మిజోరం ప్రజలు, సీఎం:
అంబులెన్స్ మిజోరంలో ప్రవేశించగానే ఆ రాష్ట్ర ప్రజలు చప్పట్లు కొట్టి అంబులెన్స్ డ్రైవర్లకు సెల్యూట్ చేసి స్వాగతం పలికారు. లాక్ డౌన్ కష్టాలను లెక్క చెయ్యకుండా మా రాష్ట్రానికి చెందిన యువకుడి మృతదేహాన్ని తీసుకువచ్చిన మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నామని అన్నారు. విషయం తెలుసుకున్న మిజోరం ముఖ్యమంత్రి జోరామ్ థంగా సైతం చెన్నై అంబులెన్స్ డ్రైవర్లు చేసిన సహాయానికి స్వయంగా సెల్యూట్ చేసి కృతజ్ఞతలు తెలిపారు

అంబులెన్స్ డ్రైవర్లకు ప్రభుత్వం సన్మానం:
చెన్నై అంబులెన్స్ డ్రైవర్లను మిజోరం ప్రభుత్వం సన్మానించింది. వారికి మిజోరం సాంప్రదాయ దుస్తులు అందించింది. ఒక్కొక్కరికి రూ. 2 వేలు నగదు బహుమానం ఇచ్చింది. చెన్నై అంబులెన్స్ డ్రైవర్లకు మిజోరం ప్రభుత్వం, అక్కడి ప్రజలు కృతజ్ఞతలు చెప్పిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. యువకుడి కుటుంబ సభ్యులు సైతం చెన్నై అంబులెన్స్ డ్రైవర్లు చేసిన సాయానికి వాళ్ల కాళ్లు పట్టుకుని కృతజ్ఞతలు చెప్పారు.