Sai Balaji : కరోనాతో దర్శకుడు సాయి బాలాజీ హఠాన్మరణం..

కరోనా కోరలకు సినీరంగంలో మరో ప్రాణం బలి అయింది. సినీరంగంలో మూడున్నర దశాబ్దాల కాలంగా పనిచేస్తున్న సీనియర్ దర్శక, రచయిత సాయిబాలాజీ సోమవారం హైదరాబాద్‌లో కరోనాతో శ్వాస అందక హఠాత్తుగా కన్నుమూశారు..

Sai Balaji : కరోనాతో దర్శకుడు సాయి బాలాజీ హఠాన్మరణం..

Director Sai Balaji Passes Away Due To Covid 19

Updated On : April 26, 2021 / 7:53 PM IST

Sai Balaji: కరోనా కోరలకు సినీరంగంలో మరో ప్రాణం బలి అయింది. సినీరంగంలో మూడున్నర దశాబ్దాల కాలంగా పనిచేస్తున్న సీనియర్ దర్శక, రచయిత సాయిబాలాజీ సోమవారం ఉదయం 5.10 గంటలకు హైదరాబాద్‌లో కరోనాతో శ్వాస అందక హఠాత్తుగా కన్నుమూశారు. సినీ రంగంలో సాయి బాలాజీగా సుపరిచితులైన ఆయన పూర్తి పేరు నక్కల వరప్రసాద్. చిత్తూరు జిల్లా తిరుపతి దగ్గర అలమేలు మంగాపురం ఆయన స్వస్థలం. శ్రీహరి నటించిన ‘శివాజీ’, ‘ఒరేయ్ తమ్ముడు’, ఉదయకిరణ్ ఆఖరి చిత్రం ‘జై శ్రీరామ్’ లకు ఆయన దర్శకత్వం వహించారు. ఆ సినిమాకు కొన్ని పాటలు కూడా రాశారు.

చిరంజీవి నటించిన ‘బావ గారూ బాగున్నారా!’ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే సాయి బాలాజీవే.. అలాగే, ‘సిరి’, ‘అపరంజి’, ‘హాలాహలం’ లాంటి పలు టీవీ సీరియల్స్‌కు కూడా ఆయన దర్శకత్వం వహించారు. తెలుగు సినీ పరిశ్రమ చెన్నైలో ఉన్నప్పుడే సినీ రంగానికి వచ్చిన సాయి బాలాజీ ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి వద్ద దర్శకత్వ శాఖలో శిష్యరికం చేశారు.

మోహన్ బాబు ‘పెదరాయుడు’, బాలకృష్ణ ‘బంగారు బుల్లోడు’, వెంకటేష్ ‘చంటి’ తదితర అనేక చిత్రాలకు ఆయన పనిచేశారు. ఎమ్మెస్ నారాయణతో ‘పెదరాయుడు’లో పాత్ర వేయించి, తెర మీదకు నటుడిగా తీసుకురావడంలో సాయి బాలాజీ కీలకపాత్ర వహించారు. చాలాకాలం పాటు నటుడు నాగబాబుకు చెందిన అంజనా ప్రొడక్షన్స్ దర్శక, రచనా శాఖలో ఆయన పనిచేశారు.

ముక్కుసూటితనం వెనుక మంచితనం మూర్తీభవించిన సాయి బాలాజీ సినీ రంగంలో నటుడు ప్రకాష్ రాజ్ తో సహా పలువురికి ఇష్టమైన వ్యక్తి. స్నేహితులైన దర్శకులు కృష్ణవంశీ, వై.వి.ఎస్. చౌదరి రూపొందించిన సినిమాలకు కథా విభాగంలో ఆయన కీలకపాత్ర పోషించారు. సినిమా, స్క్రిప్టులపై సాయి బాలాజీ నిష్కర్షగా వ్యక్తం చేసే అభిప్రాయాలను పలువురు దర్శక, నిర్మాతలు గౌరవించేవారు..

ప్రపంచ సినిమాతో పాటు వివిధ భారతీయ భాషా చిత్రాలపై ఆయనకు పట్టు ఎక్కువ. సినీ కథ, కథనాల్లోని తాజా మార్పులను ఎప్పటికప్పుడు గమనించి, నిశితంగా విశ్లేషించడంలో సాయి బాలాజీ దిట్ట. ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం పలు సినిమా స్క్రిప్టులతో పాటు ఇటీవల కొన్ని వెబ్ సిరీస్‌ల రూపకల్పనకు కూడా ఆయన సన్నాహాలు చేసుకుంటూ వచ్చారు. ఇంతలోనే కరోనా మహమ్మారి ఆయనను తీసుకుపోయింది. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన 57 ఏళ్ళ సాయి బాలాజీకి భార్య గౌరి, కుమార్తె స్నేహ పూజిత ఉన్నారు. కుటుంబ సభ్యులందరికీ అనుకోకుండా కరోనా సోకడంతో, వారం రోజుల నుంచి చికిత్స తీసుకున్నారు. మిగతా కుటుంబసభ్యులు ఇద్దరూ ఇంట్లోనే కోలుకున్నప్పటికీ, ఆయన మాత్రం చివరి చూపు అయినా దక్కకుండా ఆకస్మికంగా ప్రాణాలు వదలడం విషాదం. సోమవారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు ముగిశాయి..