స్వస్తిక్‌ గుర్తుపై ఎన్నికల సంఘం క్లారిటీ

  • Published By: bheemraj ,Published On : December 4, 2020 / 12:39 PM IST
స్వస్తిక్‌ గుర్తుపై ఎన్నికల సంఘం క్లారిటీ

Electoral Commission Clarity Swastik symbol : స్వస్తిక్‌ గుర్తుపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. స్పష్టమైన మెజారిటీ ఉన్న డివిజన్ల ఫలితాలు మాత్రమే వెల్లడించాలని ఆదేశించింది. ఫలితంపై ప్రభావం చూపే సంఖ్యలో ఇంక్‌ మార్క్‌ ఓట్లుంటే ఫలితాల వెల్లడి ఆపాలని ఆదేశించింది. సోమవారం వరకు ఫలితాల్ని నిలిపివేయాలని ఆర్వోలకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. స్వస్తిక్ గుర్తును మాత్రమే ఓటుగా పరిగణించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల కాపీ ఎన్నికల సంఘానికి చేరడంతో…ఈసీ తాజా ఉత్తర్వులిచ్చింది.



అంతకుముందు తెలంగాణ ఎన్నికల కమిషన్‌కు హైకోర్టు షాకిచ్చింది. స్వస్తిక్ గుర్తును మాత్రమే ఓటుగా పరిగణించాలని తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. బ్యాలెట్ పేపర్‌పై పెన్నుతో మార్క్ చేసినా..ఓటుగా పరిగణించాలని రాత్రి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను తోసిపుచ్చింది. బీజేపీ హౌస్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఈ ఆదేశాలిచ్చింది. హైకోర్టు ఆదేశాలపై బీజేపీ హర్షం వ్యక్తం చేసింది.



బ్యాలెట్‌ పేపర్‌పై స్వస్తిక్ గుర్తే కాకుండా… ఏ మార్కర్‌ పెన్నుతో టిక్కు పెట్టినా ఆ ఓటును పరిగణనలోకి తీసుకోవాలని రాత్రి పదిగంటల సమయంలో ఈసీ సర్క్యులర్ జారీచేసింది. ఈ సర్క్యులర్ వెలువడిన మరుక్షణమే….తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటింగ్ అధికారులకు మాత్రమే తెలిసేలా జారీచేసిన ఈ సర్క్యులర్ వెనక ఆంతర్యం ఏమిటని, ప్రగతి భవన్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఇది విడుదలయిందని ఆరోపించారు.



కౌంటింగ్‌ను అడ్డుకోకుండానే..ఈ సర్క్యులర్‌కు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్తామని ప్రకటించారు. చెప్పినట్టుగానే హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం… ఈసీ ఉత్తర్వులను తోసిపుచ్చింది.