Children Exercise : చిన్నపిల్లలో వ్యాయామం…ఆరోగ్యానికి శ్రేయస్కరమే!..
చిన్నప్పుడు బాగా ఆటలాడేవారు పెద్దయిన తర్వాత కూడా చురుకుగా ఉంటారు. స్థూలకాయం వల్ల వచ్చే డయాబెటిస్, హైబీపీ వంటి వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.

Kids Shooting On Football Station
Children Exercise : వ్యాయామం అనేది ఆరోగ్య పరిరక్షణ కోసం చాలా అవసరం. శరీరములో శక్తి వినియోగించుకొని కేలరీలను ఖర్చు చేసే పని ఏదైనా సరే వ్యాయామమే. ఇది ఎక్కువగా కండరాలను, రక్త ప్రసరణ వ్యవస్థను ధృఢపరచడానికి, క్రీడలలో మంచి ప్రావీణ్యత సాధించడానికి ఉపయోగిస్తారు. దైనందిక వ్యాయామం వలన మన శరీరపు వ్యాధినిరోధక శక్తి వృద్ధిచెందుతుంది, గుండెకు సంబంధించిన వ్యాధులు, స్థూలకాయం, మధుమేహం వంటి వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది. కొన్ని రకాల మానసిక వ్యాధుల నివారణ కు తోడ్పడుతుంది.
రోగాలు దరిచేరకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిది. ముఖ్యంగా చిన్నపిల్లలో వ్యాయామం అనేది చాలా ముఖ్యమైనది. చిన్న వయస్సులో వ్యాయామం పట్ల అవగాహన కలిగించటం ఎంతైనా అవసరం. తద్వారా నిత్య వ్యాయామాలతో భవిష్యత్తులో ఎదురయ్యే అరోగపరమైన సవాళ్ళనుండి వారు సునాయాసంగా బయటపడేందుకు అవకాశం ఉంటుంది. ఈ విషయంలో తల్లిదండ్రులు బాధ్యత తీసుకుని వారిని రోజువారి వ్యాయామాలవైపు దృష్టి సారించేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే. అయితే 7-8 ఏళ్ల పిల్లలు ఎక్కువ సమయం వ్యాయామం చేస్తే వారి ఎముకల పరిమాణం,సాంద్రత బాగా పెరుగుతున్నట్టు స్వీడన్ జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. గతంలో పిల్లలు అధికంగా వ్యాయామం చేస్తే ఎముకలు విరిగే ప్రమాదముందని భావించేవారు. కానీ ఇది నిజం కాదని నాలుగేళ్లుగా చేసిన ఈ అధ్యయనంలో తేలింది.
ఇందులో భాగంగా ఒక స్కూలులోని విద్యార్థులకు వారానికి 200 నిమిషాల పాటు పరుగెత్తటం, గెంతటం, తాడుతో పైకి ఎగబాకటం, బాల్ గేమ్స్ వంటివి ఆడటం చేయాలని సూచించారు. అలాగే మరికొన్ని స్కూళ్లల్లో చదివేవారికి వారానికి 60 నిమిషాల పాటు సాధారణ వ్యాయామం చేయమని చెప్పారు.
నాలుగేళ్ల అనంతరం పరిశీలించగా.. ఎక్కువ సమయం వ్యాయామం చేసినవారిలో వెన్నెముక, మెడ తదితర భాగాల్లో ఎముక పరిమాణం పెరిగినట్టు గుర్తించారు. ఇది మున్ముందు అంటే ఎముక సాంద్రత అధికంగా పెరిగే 25-30 ఏళ్ల వయసులో వారికి చాలా ఉపయోగపడుతుందని స్వీడన్‌లోని లుంద్ విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు అంటున్నారు. అందుకే చిన్నతనంలోనే పిల్లలకు వ్యాయామం చేయటాన్ని తప్పకుండా అలవాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
పోటీ చదువులు, నగర జీవనంతో పిల్లలకు మైదానంలో ఆటలకు అవకాశం లేకుండా పోయింది. దాంతో టీవీలూ, కంప్యూటర్లతోనే వారు కాలక్షేపం చేస్తున్నారు. ఆరుబయట ఆటలతో పిల్లలు వ్యాయామం చేసినట్లవుతుంది. శరీరానికి కావాల్సిన విటమిన్-డి లభిస్తుంది. అంతేకాదు, పిల్లలు బయట ఆడుకుంటే కంటి సమస్యలు తక్కువగా ఉంటాయట. వారంలో కనీసం ఎనిమిది గంటలూ అంతకన్నా ఎక్కువ సమయం బయట ఆడితే కంటి జబ్బులు దాదాపు దరిచేరవంటున్నారు వైద్యులు. టీవీలూ కంప్యూటర్లు చూసేటప్పటికంటే బయట ఎక్కువ ప్రాంతాన్ని చూడటానికి కంటి నరాల మధ్య మరింత సమన్వయం అవసరం. అదేవారి కంటిచూపు మెరుగు పడటానికి ఉపయోగపడుతుందట.
చిన్న వయస్సులో వ్యాయామం, ఆటల వల్ల ఆరోగ్యంగా ఉండటం సాధ్యమవుతుంది. చిన్నారులు ఆడుకునేటప్పుడు వారిని ఆటల నుంచి నివారించడం చాలామంది పెద్దలు చేసే పొరపాటు. ఆటల వల్ల పిల్లలు చదువులను నిర్లక్ష్యం చేస్తారని, ఆటల వల్ల పిల్లలు దుందుడుకుగా మారిపోతారని చాలామంది పెద్దలు అనుకుంటూ ఉంటారు. అవన్నీ అపోహలు మాత్రమే. నిజానికి ఆటల వల్లనే పిల్లలు మరింత చురుకుగా తయారవుతారు. కాసేపు ఆటలాడుకుని, విశ్రాంతి తీసుకున్న తర్వాత చదువుకున్నట్లయితే మంచి ఫలితాలను సాధించగలుగుతారు. తోటిపిల్లలతో కలసి ఆడుకోవడం వల్ల నలుగురితో ఎలా మెసలుకోవాలో తెలుసుకోగలుగుతారు. సామాజిక నైపుణ్యాలను మెరుగుపరచుకోగలుగుతారు. అన్నిటి కంటే ముఖ్యంగా శారీరకంగా దృఢంగా ఎదుగుతారు. క్రీడల వల్ల ఆరోగ్యానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయి.
చిన్నప్పుడు బాగా ఆటలాడేవారు పెద్దయిన తర్వాత కూడా చురుకుగా ఉంటారు. స్థూలకాయం వల్ల వచ్చే డయాబెటిస్, హైబీపీ వంటి వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. శరీరానికే కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా దోహదపడతాయి. ఆందోళన, దిగులు, కుంగుబాటు వంటి మానసిక సమస్యలను అధిగమించడానికి వ్యాయామం, క్రీడలు ఎంతగానో దోహదపడతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి గణనీయంగా మెరుగుపడుతుంది. ఫలితంగా రుతువులు మారినప్పుడల్లా వచ్చే జలుబు, దగ్గు, చిన్నా చితకా ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. క్రీడల్లో పాల్గొనే వారికి బాగా చెమట పట్టి, శరీరంలోని మాలిన్యాలు త్వరగా బయటకు పోతాయి. వేగంగా పరుగులు తీయడం, ఆటలాడటం వల్ల శరీరం ఉష్ణోగ్రత స్వల్పంగా పెరిగి, త్వరగా బ్యాక్టీరియా సోకకుండా ఉంటుంది.