హిందువులకు మాత్రమే అమ్మాలి, టీటీడీ ఆస్తులపై హైకోర్టు కీలక ఆదేశాలు

హిందువులకు మాత్రమే అమ్మాలి, టీటీడీ ఆస్తులపై హైకోర్టు కీలక ఆదేశాలు

highcourt key orders for ttd on assets: టీటీడీ ఆస్తులకు సంబంధించి ఆన్ లైన్ లో పొందుపరిచిన వివరాలను అఫిడవిట్ రూపంలో ఐదు రోజుల్లోగా సమర్పించాలని టీటీడీని హైకోర్టు ఆదేశించింది. అలాగే టీటీడీ ఆస్తుల పరిరక్షణకు కమిటీ తీసుకున్న చర్యలపై అఫిడవిట్ రూపంలో తెలపాలంది. టీటీడీ ఆస్తులను కాపాడాలంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. టీటీడీ ఆస్తులు అమ్మకూడదని.. భూములు, బంగారం, నగదు వివరాలు పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని పిటిషనర్ కోరారు. ఆస్తులను ఒకవేళ విక్రయించాల్సి వస్తే, పబ్లిక్ ఆక్షన్ ద్వారా జరపాలని విజ్ఞప్తి చేశారు. టీటీడీ ఆస్తులను ఇతర మతస్తులకు విక్రయించకూడదని, హిందువులకు మాత్రమే అమ్మేలా టీటీడీకి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టుని కోరారు పిటిషనర్.

టీటీడీ వెబ్ సైట్ లో ఆస్తుల వివరాలు పొందుపరిచామని టీటీడీ సంస్థ తరుఫు న్యాయవాది కోర్టుకి వివరించారు. ఆస్తుల పరిరక్షణ, నిర్వహణ కోసం రిటైర్డ్ చీఫ్ జస్టిస్ తో ఓ కమిటీ వేశామని టీటీడీ తరుఫు న్యాయవాది చెప్పారు. కాగా, 5 రోజుల లోపు కమిటీ సభ్యుల వివరాలు అందజేయాలని హైకోర్టు ఆదేశించింది.

టీటీడీకి చెందిన ఆస్తులకు సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. టీటీడీకి ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులున్నాయనే విషయమై శ్వేతపత్రం విడుదల చేయాలని కొన్ని సంస్థలు, సంఘాలు, పార్టీలు గతంలో డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. టీటీడీకి చెందిన ఆస్తులపై అఫిడవిట్ రూపంలో వివరాలను అందించాలని ఆదేశించింది. ఈ విషయమై టీటీడీ ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి. తదుపరి విచారణను మార్చి 2వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.