ఎలక్షన్‌ టైమ్‌లో టీఆర్‌ఎస్‌, బీజేపీలో అంతర్గత విబేధాలు

ఎలక్షన్‌ టైమ్‌లో టీఆర్‌ఎస్‌, బీజేపీలో అంతర్గత విబేధాలు

Internal differences in TRS and BJP : ఎన్నిక‌ల వేళ నేతల అంత‌ర్గత విబేధాలు.. టీఆర్‌ఎస్‌, బీజేపీలో కొత్త త‌ల‌నొప్పులు తెస్తున్నాయి. ప్రచారం తక్కువ.. అధిష్టానానికి ఫిర్యాదులు ఎక్కువ అన్నట్టు ఉందీ పరిస్థితి. దీంతో రంగంలోకి దిగారు పార్టీ అగ్ర నేతలు. ఇలానే వదిలేస్తే.. పరిస్థితి చేదాటి పోయే ప్రమాదం ఉందని గ్రహించి.. చక్కదిద్దేందుకు సమాయత్తమయ్యారు. తీరుమారకపోతే చర్యలు తప్పవంటూ అల్టిమేటం జారీ చేశారు.

పట్టభద్రుల ఎన్నికపై ఫోకస్‌ పెట్టారు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై నిర్వహించిన సన్నాహక సమావేశంలో.. పార్టీ క్యాడర్‌పై ఆయన ఫైరయ్యారు. పార్టీ ఆదేశాల ప్రకారం ఎవరైనా నడుచుకోవాలని.. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. శాసనమండలి ఎన్నికలను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నా.. కొందరు నేతలు లైట్‌గా తీసుకుంటున్నారన్నారు కేటీఆర్‌. నేతల వైఖరిలో మార్పు రాకపోతే ప్రత్యామ్నాయం చూడాల్సి వస్తుందన్నారాయన.

శాసనమండలి సన్నాహక సమావేశానికి.. గ్రేటర్ పరిధిలోని 400 మంది నేతలను ఆహ్వానించినా.. 80 మంది వరకు నేతలు గైర్హాజరయ్యారు. దీంతో సమావేశంలోనే కేటీఆర్ సీరియస్‌గా స్పందించారు. అలిగి ప్రచారం చేయకుండా ఉంటే చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు. మీటింగ్‌కు ఎవరు రాలేదో తెలుసని.. మిమ్మల్ని ఎవరూ బతిమలాడరని స్పష్టం చేశారు. పదవుల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న వాళ్లున్నారని.. అవకాశాన్ని బట్టి పదవులొస్తాయని స్పస్టం చేశారాయన. చేయాల్సిన పని చేయమంటే చూస్తూ ఊరుకోబోమని.. మీరు కాదంటే కొత్త నేతలతో పని చేయిస్తామని వార్నింగ్‌ ఇచ్చారు.

ఇక బీజేపీలోనూ ఇదే సీన్‌ రిపీటవుతోంది. సాగర్‌ బీజేపీ నేతల మధ్య అంతర్గత విబేధాలు ఇప్పుడు రాష్ట్ర అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. ఇటీవల జరుగుతున్న ఎన్నికల్లో పార్టీ వరుసగా గెలుపు సాధిస్తుండటంతో.. టికెట్‌ ఆశించే వారి సంఖ్య పెరిగిపోయింది. దీంతో నేతలను స‌మ‌న్వయం చేసుకొని.. గెలుపు అవ‌కాశాలు మెరుగుప‌రుచునే ప‌నిలో ప‌డ్డారు బీజేపీ ముఖ్య నేత‌లు. నేత‌లంతా ఒక‌రిపై ఒక‌రు మాటల దాడి చేసుకునే వ‌ర‌కు ప‌రిస్థితి రావడంతో.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్ న‌ల్లగొండ జిల్లాతో పాటు సాగ‌ర్ నేత‌ల‌తో ప్రత్యేకంగా స‌మావేశమయ్యారు.

పార్టీ నేతలు అనుసరిస్తున్న తీరుపై తీవ్ర అస‌హ‌నం వ్యక్తం చేసిన బండి.. నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వయం లేకపోతే అవ‌కాశాలు దెబ్బతింటాయ‌న్నారు. టికెట్ ఎవ‌రికి ఇచ్చినా క‌లిసి ప‌నిచేసుకోవాలంటూ నేత‌ల‌ను ఆదేశించారు. రాబోయే ఎమ్మెల్సీ, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ తప్పకుండా విజయం సాధిస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఫలితమే ఈ ఎన్నికల్లో కూడా పునరావృతం అవుతుందన్నారు. మ‌రి ఈ సమావేశాల తర్వాతైనా.. ఆయా పార్టీల నేత‌లు క‌లిసి ప‌నిచేస్తూ.. పార్టీల నిలబెట్టిన అభ్యర్థులు గెలిచేందుకు స‌హ‌క‌రిస్తారా..? లేక ఇంతకు ముందులానే పార్టీల ప‌రువును బ‌జారుకీడుస్తారో చూడాలి మరి.