Mallu Swarajyam : నల్గొండకు మల్లు స్వరాజ్యం పార్థీవదేహం.. ప్రముఖుల నివాళి

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతిపట్ల.. యావత్‌ సమాజం నివాళులర్పించిది. ఒకతరం వీరోచిత పోరాటగాథ పరిసమాప్తమైందంటూ.. కన్నీటిపర్యంతమయ్యింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో...

Mallu Swarajyam : నల్గొండకు మల్లు స్వరాజ్యం పార్థీవదేహం.. ప్రముఖుల నివాళి

Mallu

Leaders Pay Tribute To Mallu Swarajyam : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతిపట్ల.. యావత్‌ సమాజం నివాళులర్పించిది. ఒకతరం వీరోచిత పోరాటగాథ పరిసమాప్తమైందంటూ.. కన్నీటిపర్యంతమయ్యింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లు స్వరాజ్యం బంజారాహిల్స్‌ కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. 19 రోజుల పాటు.. మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచారు. మల్లు స్వరాజ్యం భౌతికకాయాన్ని ప్రముఖులు, కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్ధం ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో ఉంచారు. ఈ సందర్భంగా ప్రముఖులు, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన వారు ఆమె పార్థీవదేహానికి నివాళులర్పించారు. మల్లు స్వరాజ్యం ఈ తరానికి ఒక స్ఫూర్తి.. ఆమె పోరాటం అందరికి ఆదర్శమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. తుపాకీ పట్టి నిజాంను గడగడలాడించారని, రాబోయే రోజుల్లో ఆమెని మర్చిపోకుండా పుస్తకాలు, సినిమాలు రావాల్సిందన్నారు. ఆ విషయంలో అండదండలు అండిస్తానని, తమ పార్టీ తరుపున ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్లు తెలిపారు. తనకు కంటి ఆపరేషన్ జరగడం వల్ల బయటికి వచ్చే పరిస్థితి లేదన్నారు. మల్లు స్వరాజ్యం భౌతికకాయానికి నివాళులర్పించారు ఎమ్మెల్సీ కవిత. మల్లు స్వరాజ్యం ఈ తరం శకానికి ఒక నాంది ఆమె జీవితం.. నమ్మిన సిద్ధాంతం కోసం పని చేసిన వ్యక్తి.. ఆమె లేరు అన్న విషయం జీర్ణించుకోలేక పోతున్నామన్నారు ఎమ్మెల్సీ కవిత. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నామన్నారు.

Read More : Mallu Swarajyam Passed Away : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత

అద్దంకి దయాకర్ నివాళి అర్పించి మాట్లాడుతూ… తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత మల్లు స్వరాజ్యం చైతన్య దీప్తి లాంటి స్వరాజ్యమని, మనమధ్య లేకపోవడం బాధాకరమన్నారు. వారిని చూస్తూ పెరిగామని, మాలాంటి యువ నాయకులకు వారి రాజకీయ జీవితం ఆదర్శంవంతమన్నారు. ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వాయించారనే విషయాన్ని గుర్తు చేశారాయన. మల్లు స్వరాజ్యం స్ఫూర్తి తెలంగాణలో ఎప్పటికి నిలిచి ఉంటుందని, వారి జీవితం భవిష్యత్ తరాలకు ఆదర్శమన్నారు.
కమ్యూనిస్టు ఉద్యమాలకు తీరని లోటుగా అభివర్ణించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానన్నారు. వారి కుటుంబంలో పుట్టడం తమ అదృష్టమని మల్లు స్వరాజ్యం ముని మనవరాలు, మనవళ్ళు తెలిపారు. వారి స్ఫూర్తితో తాము పనిచేస్తున్నామని, పనిచేస్తూనే ఉంటామన్నారు. వారి అడుగుజాడల్లో నడుస్తామని, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామన్నారు. సమాజ అభ్యున్నతికి తమవంతు కృషి చేస్తున్నట్లు, తమకే కాకుండా ప్రజా సమస్యలపై పోరాడే అందరికి స్వరాజ్యం నానమ్మేనన్నారు. మహిళ సాధికారత కోసమే పోరాడారు…దాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Read More : Mallu Swarajyam Passed Away : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత

నిజాంకు, పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి మల్లు స్వరాజ్యమని, కమ్యూనిస్టు కంచు కంఠం మాయమైందన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ. కమ్యూనిస్టు ఉద్యమానికి చివరిదశ నాయకురాలు మల్లు స్వరాజ్యమని, ఆమె స్పూర్తితో కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఐక్యపరిచి ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు.  మల్లు స్వరాజ్యం ఆశయాలు నెరవేరలేదన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి. దోపిడీ రాజ్యం పోవాలి, కమ్యూనిస్టు రాజ్యం రావాలని, వామపక్ష ఐక్య పోరాటాలతో మల్లు స్వరాజ్యం ఆశయసాధనకు కృషి చేస్తామన్నారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని తీర్చిదిద్దిన వ్యక్తి మల్లు స్వరాజ్యం.. సామాజిక మూలాలను పక్కనపెట్టి ప్రజల తరఫున హక్కుల కోసం పోరాడిన యోధురాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. రాజకీయాలంటే వ్యాపారంగా మారిన తరుణంలో.. ప్రజల కోసం రాజకీయాలు నడిపిన ఆమె స్పూర్తిని కొనసాగించాలన్నారు. ఎంబీ భవన్ నుంచి నల్గొండకి మల్లు స్వరాజ్యం భౌతికకాయాన్ని తరలించారు. నల్లగొండ పార్టీ కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం ఉంచిన అనంతరం భౌతికకాయాన్ని మెడికల్ కాలేజీకి డొనేట్ చేయనున్నారు. మల్లు స్వరాజ్యం భౌతికకాయానికి బి.వి రాఘువులు, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర రావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నివాళులర్పించిన వారిలో ఉన్నారు.