ఆక్సిజన్ పొదుపు కోసం..మారుతీ సుజుకీ ఫ్లాంట్లు మూసివేత

ఆక్సిజన్ పొదుపు కోసం..మారుతీ సుజుకీ ఫ్లాంట్లు మూసివేత

Maruti Suzuki To Shut Down Haryana Plants To Make Oxygen Available

Updated On : April 28, 2021 / 6:59 PM IST

Maruti Suzuki to shut down Haryana plants to make oxygen available దేశంలో క‌రోనా రెండో దశ విజృంభణ నేపథ్యంలో హాస్పిటల్స్ అన్నీ క‌రోనా రోగుల‌తో కిట‌కిట‌లాడుతున్నాయి. దీంతో హాస్పిటల్స్ లో బెడ్‌ల‌తోపాటు ఆక్సిజ‌న్‌కు కూడా తీవ్ర కొర‌త ఏర్ప‌డింది. ఈ కార‌ణంగా ప‌లు ఆస్ప‌త్రుల్లో క‌రోనా బాధితులు ఊపిరాడ‌కచనిపోతున్న విషయం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో ఆక్సిజ‌న్ పొదుపు కోసం దిగ్గజ కార్ల త‌యారీ కంపెనీ మారుతీ సుజుకీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.హాస్పిటల్స్ లో వైద్య అవసరాలకు స‌రిప‌డా ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచ‌టం కోసం హర్యానాలోని తమ‌ కర్మాగారాలు అన్నింటినీ మూసివేస్తున్నట్లు మారుతీ సుజుకీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి మారుతి సుజుకీ కంపెనీ ప్ర‌తి రెండేండ్ల‌కు ఒక‌సారి మెయింటెనెన్స్ షట్‌డౌన్ విధిస్తుంటుంది. ఆ మేర‌కు వ‌చ్చే జూన్ నెల‌లో మెయింటెనెన్స్ ష‌ట్‌డౌన్ విధించాల‌ని కంపెనీ నిర్ణ‌యించింది. అయితే ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌ర‌ణ, ఆక్సిజ‌న్ కొర‌త కార‌ణంగా త‌మ మెయింటెనెన్స్ ష‌ట్‌డౌన్‌ను మే- 1 నుంచి 9వ తేదీ వ‌ర‌కు అమ‌లు చేయాల‌ని మారుతీ సుజుకీ నిర్ణ‌యించింది.

9 రోజుల‌పాటు త‌న క‌ర్మాగారాల్లో మాన్యుఫాక్చ‌రింగ్‌ను నిలిపివేయ‌డంవ‌ల్ల ఆక్సిజ‌న్ వినియోగం ఉండ‌ద‌ని, దానివ‌ల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎంద‌రో క‌రోనా రోగుల‌కు మేలు జ‌రుగుతుంద‌ని మారుతీ సుజుకీ తెలిపింది. గుజ‌రాత్‌లోని సుజుకి మోటార్ కంపెనీ కూడా ఇదే నిర్ణయం తీసుకుందని మారుతీ సుజుకీ సంస్థ తెలిపింది. ప్ర‌జ‌ల‌ ప్రాణాలను కాపాడటం కోసం క‌ర్మాగారాల్లోని ఆక్సిజన్‌ను ఆస్ప‌త్రుల‌కు మళ్లించడంలో ప్రభుత్వానికి మద్దతుగా తాము ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపింది.