ప్యాకేజీ 2.0 : 9 రంగాలకు ఉద్దీపన చర్యలు.. వ్యవసాయానికి ప్రత్యేక ప్యాకేజీ : నిర్మల

  • Published By: srihari ,Published On : May 14, 2020 / 11:08 AM IST
ప్యాకేజీ 2.0 : 9 రంగాలకు ఉద్దీపన చర్యలు.. వ్యవసాయానికి ప్రత్యేక ప్యాకేజీ : నిర్మల

‘ఆత్మ నిర్భర్ భారత్’లో రెండో ప్యాకేజీని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మలా 9 రంగాలకు ఉద్దీపన చర్యలను ప్రకటించారు. చిన్న, సన్నకారు రైతులు, వలస కూలీలు, చిరు వ్యాపారులను ఆదుకునేందుకు 9 రకాల ఫార్ములాను నిర్మల ప్రకటించారు. వ్యవసాయానికి ఊతంగా ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు నిర్మల. వలస కూలీలు, వీధి వ్యాపారాలు, చిన్న రైతులను ఆదుకునేలా రెండో ప్యాకేజీ ఉంటుందని ఆమె తెలిపారు. కొత్తగా 25 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులను అందించామని చెప్పారు. కొత్త కిసాన్ క్రెడిట్ కార్డుదారులకు రూ.25వేల కోట్ల రుణాలను మంజూరు చేయనున్నట్టు తెలిపారు. 3 కోట్ల మంది రైతులకు రాయితీపై రుణాలు అందించామని చెప్పారు. క్రాప్ లోన్ దారులకు వడ్డీ రాయితీ గడువు మే 31 వరకు పొడిగించినట్టు చెప్పారు. ఇప్పటివరకూ రైతులకు రూ.4 లక్షల కోట్లు రుణాలు అందాయన్నారు. దాదాపు రూ.11వేల కోట్లు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ద్వారా అందించామని తెలిపారు. 

రెండో ప్యాకేజీలో మొత్తం 9 అంశాలను చేర్చగా.. రైతులను ఆదుకునేందుకు ఈ ప్యాకేజీలో రెండు అంశాలను చేర్చినట్టు నిర్మల స్పష్టం చేశారు. మిగిలిన ప్యాకేజీల్లో రైతులకు సంబంధించి మరిన్ని అంశాలు వస్తాయన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు రాష్ట్రాలకు రూ.6,700 కోట్ల వర్కింగ్ కేపిటల్ అసిస్టెన్స్ అందిస్తామన్నారు. మార్చిలో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.4,200 కోట్లు రుణాలిచ్చామన్నారు. పట్టణ ప్రాంతాల్లో పేదలు, వలస కార్మికులను ఆదుకునేందుకు రూ.11వేల కోట్లు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ద్వారా అందించినట్టు నిర్మల పేర్కొన్నారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 30 మధ్య 63 లక్షల మంది రైతులకు రూ.86,600 కోట్ల రుణాలు ఇచ్చినట్టు తెలిపారు. రూ.25వేల కోట్ల నాబోర్డు రుణాలను రీఫైనాన్స్ చేశామన్నారు. సొంతూళ్లలో వలస కార్మికులకు ఎలాంటి ఉపాధి ఉండకపోవచ్చునని అన్నారు. 

వలస కార్మికులను ఆదుకునేందుకు 14.62 కోట్ల పనిదినాలను గ్రామీణ ఉపాధి హామీ కింద కల్పిస్తున్నామని చెప్పారు. వలస కార్మికులకు గ్రామీణ ఉపాధి హమీ కింద పనులు కల్పించాలని రాష్ట్రాలని కోరుతున్నామని చెప్పారు. వలస కార్మికులతో మొక్కల పెంపకం, హార్టి కల్చర్, షెడ్ల నిర్మాణం పనులు చేయించుకోవచ్చునని తెలిపారు. కనీస వేతన హక్కును కార్మికులందరికి కల్పిస్తామని నిర్మల హమీ ఇచ్చారు. 

దేశమంతా ఒకే కనీస వేతనం ఉండేలా చూస్తామన్నారు. వార్షిక ఆరోగ్య పరీక్షలు కార్మికులందరికి తప్పనిసరి చేస్తున్నామన్నారు. వలస కూలీల పునరావాసం కోసం రూ.11వేల కోట్లు ఇచ్చామన్నారు. కరోనా సమయంలో 7,200 స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సంఘాల ద్వారా 1.20 లక్షల లీటర్ల శానిటైజర్ ఉత్పత్తి జరిగిందని నిర్మల తెలిపారు. ఈ సంఘాల 3 కోట్ల మాస్క్ లు తయారు చేశాయని వెల్లడించారు. 

Read Here>> నిర్మలా సీతారామన్ స్పీచ్ హైలెట్స్