చైనా వస్తువులలాగే కరోనా వ్యాక్సిన్ కూడా నాసిరకమే, పాకిస్తాన్ బయటపెట్టిన నిజం

చైనా వస్తువులలాగే కరోనా వ్యాక్సిన్ కూడా నాసిరకమే, పాకిస్తాన్ బయటపెట్టిన నిజం

Chinas Sinopharm vaccine not effective: కరోనా వైరస్ పుట్టిన చైనా దేశంలో, వైరస్ విరుగుడు కోసం తీసుకొచ్చిన వ్యాక్సిన్ కూడా సురక్షితం కాదా? 60ఏళ్లు పైబడిన వారిపై వ్యాక్సిన్ పని చెయ్యడం లేదా? సైనోఫామ్(SINOPHARM) వ్యాక్సిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ తప్పవా? డ్రాగన్ కంట్రీ చైనా వ్యాక్సిన్ పై దాని మిత్రదేశం పాకిస్తాన్ వ్యక్తం చేసిన అనుమానాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

మామూలుగానే చైనా ప్రొడక్ట్స్ లో నాణ్యత కనిపించదు. అయితే ధర తక్కువ కావడంతో ఎక్కువమంది చైనా వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. చైనా ప్రొడక్ట్స్ లో ధరే కాదు క్వాలిటీ కూడా తక్కువే అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చైనా వస్తువులన్నీ దాదాపు అంతే. ఒక్క ముక్కలో చెప్పాలంటే నాసిరకం.

ఇప్పుడు చైనా వస్తువులే కాదు చైనా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కూడా నాసిరకమే అనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రపంచానికి కరోనా వైరస్ అంటించిన చైనా ఇప్పుడు వ్యాక్సిన్ విషయంలోనూ వాస్తవాలు వెల్లడించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చైనాకి కాస్త దూరంగా ఉన్న అమెరికానో లేక భారత్ ఇలాంటి విమర్శలు చేస్తే వ్యాక్సిన్ వార్ అనుకోవచ్చు. కానీ డ్రాగన్ కంట్రీకి అత్యంత మిత్ర దేశం అయిన పాకిస్తానే.. చైనా వ్యాక్సిన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 60ఏళ్లు పైబడిన వారిపై చైనా వ్యాక్సిన్ సినోఫార్మ్ సమర్థవంతంగా పని చేయడం లేదని తెలిపింది.

పాకిస్తాన్ లో 5లక్షల 50వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, సుమారు 11వేల మంది కరోనాతో చనిపోయారు. ఇప్పటివరకు పాకిస్తాన్ ఎలాంటి సొంత వ్యాక్సిన్ తీసుకురాలేదు. డ్రాగన్ కంట్రీకి సన్నిహిత దేశం కావడంతో.. పాక్ కి 5లక్షల సినోఫార్మ్ టీకాలను విరాళంగా ఇచ్చింది చైనా. సోమవారం(ఫిబ్రవరి 1,2021) వాటిని పాకిస్తాన్ కు చేరవేసింది. బుధవారం(ఫిబ్రవరి 3,2021) నుంచి మొదటగా ఫ్రంట్ లైన్ ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇస్తున్నారు.

కాగా, చైనా వ్యాక్సిన్ పై పాకిస్తాన్ నిపుణుల కమిటీ అనుమానం వ్యక్తం చేసింది. నిపుణుల కమిటీ ప్రాథమిక డేటాను విశ్లేషించింది. ఆ తర్వాత 18 నుంచి 60ఏళ్ల వయసు వారికి మాత్రమే టీకా వేయాలని సిఫార్సు చేసింది. 60ఏళ్లు పైబడిన వారికి టీకా వేయొద్దని కమిటీ సూచించింది. ప్రధానమంత్రి ప్రత్యేక సలహాదారు స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు. టీకా సామర్థ్యంపై మరింత డేటా అందుబాటులోకి వచ్చాక తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

పాక్ ఒక్కటే కాదు బ్రెజిల్ లాంటి మరికొన్ని దేశాలు కూడా చైనా టీకాను నమ్మలేదు. గతంలో చైనా టీకా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనదని చైనీస్ డాక్టర్ తావ్ లీనా బాంబు పేల్చారు. సినోఫార్మ్ కంపెనీ నుంచి వచ్చిన కరోనా వ్యాక్సిన్ లో 73 సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని, సినోఫార్మ్ టీకా సురక్షితం కాదని సోషల్ మీడియా వేదికగా ప్రపంచానికి తెలపడం అప్పట్లో సంచలనంగా మారింది.

మరోవైపు చైనా కంపెనీలు ప్రస్తుతం 16 టీకాలపై ప్రయోగాలు జరుపుతున్నాయి. వాటిలో సినోఫార్మ్ ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్ కి చైనా ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. ఈ టీకాతో పాటు రష్యాకి చెందిన స్పుత్నిక్-వి, ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ది చేసిన కొవిషీల్డ్ టీకాలకు పాక్ లో అనుమతి లభించింది.