బీజేపీ అవమానిస్తోంది.. పీవీ కుమార్తెకు జనసేన సపోర్ట్: పవన్ కళ్యాణ్

బీజేపీ అవమానిస్తోంది.. పీవీ కుమార్తెకు జనసేన సపోర్ట్: పవన్ కళ్యాణ్

Jenasena

నేను నా 25 సంవత్సరాల జీవితాన్ని జనసేన పార్టీ కోసం అంకితం చేయడానికి నిర్ణయించుకుని రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ గడ్డపై జనసేన జన్మించింది. ఉభయరాష్ట్రాల్లో జనసేన పార్టీ ప్రజల పక్షాన నిలబడింది. నేను పాలకులను, ప్రజలను వేరుగా చూస్తాను, రాజకీయం రెండు కులాల మధ్య నలిగిపోతోంది అని పవన్ కళ్యాణ్ అన్నారు.

ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పీవీ నరసింహారావు గారి కుమార్తె శ్రీమతి సురభి వాణి దేవి గారికి మద్దతు ఇస్తాం అని తెలంగాణ జనసేన శ్రేణులు తెలిపారు, నేను వారికి అంగీకారం తెలిపాను, శ్రీమతి వాణి దేవి గారు గెలవాలని కోరుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు జనసేన పార్టీని చులకనగా మాట్లాడుతున్నారు. పీవీ గారి కుమార్తె సురభి వాణి గారికి మద్దతు ఇవ్వాలి అని తెలంగాణ జనసైనికులే సూచించారు… దానినే పాటించమని చెప్పాను అన్నారు.

ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందని, బలంగా పోరాడుదాం.. శక్తి మేరకు కృషి చేద్దాం అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. మనల్ని గౌరవించని వారికి అండగా నిలబడాల్సిన అవసరం లేదు, తెలంగాణ జనసేన శ్రేణుల గౌరవం నాకు ముఖ్యం అని పవన్ కళ్యాణ్ అన్నారు. నల్లమల యురేనియం మైనింగ్ సమస్య ఉంటే మా అభ్యర్ధన గౌరవించారు అని పవన్ కళ్యాణ్ అన్నారు.

శ్రీ పీవీ నరసింహరావు గారు దళితులకు అండగా నిలబడినందుకు ముఖ్యమంత్రిగా పదవి కోల్పోయేలా చేస్తే, ఆయన దేశానికి ప్రధానిగా పనిచేసి, అనేక సంస్కరణలు తీసుకొచ్చిన మహనీయుడు అని కొనియాడారు పవన్ కళ్యాణ్. తనకు ఆంధ్రా జన్మనిస్తే, తెలంగాణ పునర్జన్మ ఇచ్చిందని, తెలంగాణలో కూడా జనసేన పార్టీని పూర్తిస్థాయిలో నిర్మాణం చేసి ప్రజల్లోకి తీసుకుని వెళతాం అని పవన్ కళ్యాణ్ అన్నారు.

మార్పు ఒక్క రోజులో రాదు అని తెలుసు కాబట్టే నేను 25 సంవత్సరాలు అని మాట్లాడుతాను, ప్రజలు మనల్ని నమ్మడానికి సమయం పడుతుంది, మనం నిలబడితేనే గెలవగలం, మార్పు తీసుకురాగలం.. ఆంధ్రప్రదేశ్ లో ఒక పార్టీ కుటుంబ సభ్యులు వారికి అన్యాయం జరిగిందని తెలంగాణలో పార్టీ పెడుతున్నారు, బీజేపీ కూడా రెండు రాష్ట్రాల్లో ఉంది, జనసైనికులు తెలంగాణలో ఉండాలి అని కోరుకుంటున్నారు అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.