Maharaju Song: రాజువయ్యా.. మహరాజువయ్యా.. ఇదో రకం సంతాపం!

సాహిత్యం చాలా గొప్పది. మనిషిలోని భావాలను పట్టి పట్టి తట్టిలేపే శక్తి సాహిత్యానికి ఉంటుంది. అందుకే యుగాల నాటి నుండి నేటి తరాల వరకూ.. ఉద్యమాలకు ఈ సాహిత్యమే ఊపిరి. ఒక్క ఉద్యమాలే..

Maharaju Song: రాజువయ్యా.. మహరాజువయ్యా.. ఇదో రకం సంతాపం!

Maharaju Song

Maharaju Song: సాహిత్యం చాలా గొప్పది. మనిషిలోని భావాలను పట్టి పట్టి తట్టిలేపే శక్తి సాహిత్యానికి ఉంటుంది. అందుకే యుగాల నాటి నుండి నేటి తరాల వరకూ.. ఉద్యమాలకు ఈ సాహిత్యమే ఊపిరి. ఒక్క ఉద్యమాలే కాదు.. ఆనందం.. దుఃఖం.. సానుభూతి, సంతాపం ఇలా మనిషి ఒక్కో భావాన్ని ఒక్కో సందర్భంతో ముడిపెట్టి వ్యక్తపరిచే సత్తా కూడా ఈ సాహిత్యానికే ఉంటుంది. సినిమా పాటల నుండి సాహిత్యాన్ని ఎవరూ విడదీయలేనిది. ఈ మధ్య కాలంలో సినీ కవులకు సాహిత్యం దూరమవుతుందనే విమర్శలు ఎన్ని ఉన్నా సాహిత్యం లేనిదే గేయం పుట్టుక ఉండదు.

అలా ఒకనాడు మహారాజు అనే సినిమా కోసం పుట్టిన పాట రాజువయ్యా మహరాజువయ్యా. శోభన్ బాబు, సుహాసినీలపై మహారాజు అనే సినిమా కోసం తెరకెక్కిన ఈ పాటను వేటూరి సుందరరామ్మూర్తి రచించారు. నిజానికి ఈ సినిమాలో భర్తకి అండగా ఉన్నానని చెప్పేందుకు ప్రయత్నించే భార్య.. భర్తలోని మంచితనాన్ని, త్యాగగుణాన్ని గుర్తు చేసి తాను వ్యక్తిత్వంలో మహారాజు అని కీర్తిస్తూనే.. బాధ నుండి దూరం చేసే ప్రయత్నిస్తుంది. ఇందులో శోభన్ బాబు, సుహాసినీలు నటించారు అనే కన్నా జీవించారనే చెప్పుకోవాలి.

కాగా.. ఆనాడు అలా తెరకెక్కిన ఆ పాట ముప్పై ఏళ్ల తర్వాత ఈ మధ్య కాలంలో మళ్ళీ బాగా వినిపిస్తూ ప్రాచుర్యంలోకి వచ్చింది. సమాజం మీద తనదైన ముద్ర వేసి అసువులు బాసిన వ్యక్తులు దూరమైన సందర్భంలో ఈ పాటను సంతాప చిహ్నం కూడా ఉపయోగిస్తున్నారు. గతంలో దివంగత రాజశేఖర రెడ్డి మరణించిన సందర్భంలో ఈ పాటను తెలుగు మీడియా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా ఉపయోగించడంతో ఈ పాట మళ్ళీ జనప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పటికీ ప్రముఖుల సంతాప సందర్భాలలో ఇదే పాట వినిపిస్తూనే ఉంటుంది.

భగవద్గీత లాంటి హిందువుల పవిత్ర గ్రంధం నుండి కూడా ‘పుట్టిన వాడు గిట్టక మానడు’ అనే ఒకటి రెండు శ్లోకాలను పార్ధీవ దేహాల వద్ద వినిపించడం మనం చూస్తూనే ఉంటాం. నిజానికి భగవద్గీత సారాంశం ఎనలేనిది.. అందులో ఒక్క శ్లోకాన్ని ఇలా వినిపించడంపై కూడా అప్పుడప్పుడు విమర్శలు వినిపిస్తూనే ఉంటాయి. ఇక ఈ రాజువయ్యా.. మహరాజువయ్యా.. పాటలో కూడా ఇలా సంతాపాన్ని తెలియజేసే సందర్భంలో ఎక్కడ వరకూ అవసరమో అక్కడ వరకే ఉపయోగించుకుంటున్నారు.

కైలాస శిఖరాన కొలువైన స్వామి
నీ కంట పొంగేనా గంగమ్మ తల్లీ
మనసున్న మంచోల్లె మారాజులు
మమతంటు లేనోల్లె నిరుపేదలు
ప్రేమే నీ రూపం త్యాగం నీ ధర్మం
ఎవరేమి అనుకుంటే నీకేమిలే
రాజువయ్యా మహరాజువయ్యా
రాజువయ్యా మహరాజువయ్యా

కన్నీట తడిసినా కాలాలు మారవు
మనసారా నవ్వుకో పసిపాపల్లే
ప్రేమకన్నా నిధులు లేవు
నీకన్న ఎవరయ్యా మారాజులు
నిన్నేవరూ ఎమన్నా నీ దాసులు
జరిగినవి జరిగేవి కలలే అనుకో
జరిగినవి జరిగేవి కలలే అనుకో

రాజువయ్యా మహరాజువయ్యా
రాజువయ్యా మహరాజువయ్యా

త్యాగాల జీవితం తనవారికంకితం
మిగిలింది నీ నేను నా నువ్వేలే
దేవుండంటి భర్త వుంటే
నాకన్నా ఎవరయ్యా మారాణులు
మనకున్నా బంధాలే మాగాణులు
ప్రతి జన్మకు నీ సతినై పుడితే చాలు
ప్రతి జన్మకు నీ సతినై పుడితే చాలు

రాజువయ్యా మహరాజువయ్యా
రాజువయ్యా మహరాజువయ్యా

ఇందులో పల్లవి నుండి చరణంలో తొలి భాగం వరకూ భర్త వ్యక్తిత్వాన్ని మహారాజుగా భార్య కీర్తిస్తే.. రెండో చరణంలో భార్య.. భర్తకు ఏ సమయంలోనైనా తోడుగా ఉంటానని చెప్పేలా ఉంటుంది. దీంతో సంతాప సందర్భాల్లో కీర్తించే తొలి చరణం వరకే ఈ పాటను ఉపయోగించడంతో పాట కూడా అక్కడి వరకే జనాల నోళ్ళలో నానుతుంది.