Sonu Sood: చిక్కుల్లో సోనూసూద్.. కేసు నమోదు.. కారు సీజ్!

పంజాబ్‌లో ప్రముఖ నటుడు సోనూసూద్ చిక్కుల్లో పడ్డారు. సోనూసూద్ వాహనాన్ని ఎన్నికల సంఘం జప్తు చేసింది.

Sonu Sood: చిక్కుల్లో సోనూసూద్.. కేసు నమోదు.. కారు సీజ్!

Sonu Sood (1)

Sonu Sood: పంజాబ్‌లో ప్రముఖ నటుడు సోనూసూద్ చిక్కుల్లో పడ్డారు. సోనూసూద్ వాహనాన్ని ఎన్నికల సంఘం జప్తు చేసింది. మోగా పోలీస్ స్టేషన్‌లో జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాలను ఉల్లంఘించినందుకు సోనూపై 188IPC కింద కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియామావళికి సంబంధించి పంజాబ్‌లోని మోగా అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు ఈ కేసు నమోదైంది.

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మోగా నియోజకవర్గం నుంచి సోనూ సూద్‌ సోదరి మాళవిక సూద్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలింగ్‌ కేంద్రాలను సందర్శించకుండా అధికారులు సోనూను అడ్డుకున్నారు. అంతేకాదు.. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ ప్రారంభానికి 48 గంటల ముందు బయటి వ్యక్తులు రాష్ట్రంలో ఉండకూడదు.

ఎన్నికల నియమావళికి సంబంధించి జిల్లా అదనపు మేజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించడంతో సోనూపై కేసు పెట్టినట్లుగా మోగా పోలీసులు వెల్లడించారు. ఎన్నికల కమిషన్ చర్య తర్వాత, సోనూసూద్ అదేరోజు సాయంత్రం సినిమా షూటింగ్ నిమిత్తం దక్షిణాఫ్రికాకు వెళ్లారు.

మోగా నుండి కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేస్తున్న సోదరి మాళవికా సూద్ కోసం సోనూసూద్ ప్రచారం చేస్తున్నట్లు సమాచారం అందిందని, ఎన్నికల విధుల్లో పోస్ట్ చేయబడిన పోలీసు అధికారి హర్‌ప్రీత్ సింగ్ చెప్పారు. సోనూసూద్ లాండెకేలోని పోలింగ్ బూత్ బయట ఎండీవర్ కారులో ఉన్నాడు.

ముంబైకి చెందిన కొందరు వ్యక్తులు కూడా అతనితో ఉన్నారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకే సోనూ వెళ్లినట్లుగా పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ ఆరోపణలను సోనూసూద్ ఖండించారు. పోలీసులు మాత్రం కారును సీజ్ చేశారు.