Bhadradri : రాములోరి పెళ్లి.. కల్యాణానికి భారీగా ఏర్పాట్లు

భక్తుల కోసం ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్మకం చేపడుతున్నారు. ఒక్కో టిక్కెట్‌ ధరను 150 రూపాయల నుంచి 7వేల 5వందల వరకు టిక్కెట్లు ధరను నిర్ణయించి.. అమ్మకాలు చేపడుతున్నారు.

Bhadradri : రాములోరి పెళ్లి.. కల్యాణానికి భారీగా ఏర్పాట్లు

Ramudu

Sriramanavami In Bhadradri : దక్షిణ అయోద్యగా పేరుగాంచిన భద్రాద్రి రామయ్య కల్యాణాన్ని భక్తులు తిలకించేందుకు .. దేవస్థానం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. గత రెండేళ్లుగా ప్రపంచాన్ని వణికించిన కరోనా ఎఫెక్ట్‌తో .. భద్రాచలం దేవస్థానం భక్తుల్లేక బోసిపోయింది. అయితే ఈసారి శ్రీరామనవమి, పట్టాభిషేక మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామి కల్యాణానికి వేలాదిగా భక్తులు తరలివస్తారని అధికారులు భావిస్తున్నారు. దీంతో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఏడాది చైత్ర మాస శుక్లపక్ష నవమిని .. శ్రీరామనవమిగా జరుపుకుంటారు. అనాదిగా భద్రాచలం దేవస్థానంలో ..స్వామివారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈఏడాది ఏప్రిల్ 10న సీతారామచంద్ర స్వామి కల్యాణం, 11న పట్టాభిషేకం నిర్వహించనున్నారు.

Read More : Bhadrachalam Temple: భద్రాద్రి రామయ్య దర్శనానికి పోటెత్తిన భక్తులు

స్వామి కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు దేశ విదేశాల నుంచి భారీగా తరలి రానుండటంతో.. వారి కోసం మిథిలా స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నారు.. ఆలయ అధికారులు. షామియానాలు, చలువ పందిళ్లుతో పాటు భక్తులకు ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు కూలర్లు ఏర్పాటుచేస్తున్నారు. ఇక స్నానఘట్టాల్లో మహిళలు ఇబ్బందులు పడకుండా.. డ్రస్సింగ్ రూములను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే భద్రాచలాన్ని వాల్ రైటింగ్స్‌తో పాటు హోర్డింగ్‌లు, ప్లెక్సీలు ఏర్పాటుచేశారు. భద్రాచలంతో పాటు కూనవరం రోడ్డు, చర్ల రోడ్డు, బ్రిడ్జి సెంటర్‌లో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. ఈసారి ఆలయానికి ఆదాయం సమకూర్చుకునే ప్రయత్నం కూడా అధికారులు చేపట్టారు. భక్తులకు ఆన్‌లైన్ సేవలతో పాటు రూముల కేటాయింపు సైతం అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Read More : భద్రాద్రి రామయ్య కల్యాణానికి ఘనంగా ఏర్పాట్లు

భక్తుల కోసం ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్మకం చేపడుతున్నారు. ఒక్కో టిక్కెట్‌ ధరను 150 రూపాయల నుంచి 7వేల 5వందల వరకు టిక్కెట్లు ధరను నిర్ణయించి.. అమ్మకాలు చేపడుతున్నారు. ఇక రెండేళ్ల తరువాత రాములోరి కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులతో భద్రాద్రి పోటెత్తనుంది. దీంతో భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా అదనపు బస్సులను నడపనుంది. అటు రామయ్య కల్యాణ మహోత్సవంలో భాగంగా ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టువస్ర్తాలు, తలాంబ్రాలను దేవాదేయాశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమర్పించనున్నారు. అయితే ఈసారి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఇప్పటికే అధికారులు కల్యాణ శుభలేఖలను అర్చకులు, దేవాలయ సిబ్బంది మంత్రులతో పాటు అధికారులకు సమర్పించారు. రామయ్య పట్టాభిషేకంలో గవర్నర్ తమిళ సై పాల్గొననున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేస్తున్నారు.