Supreme fine on Telugu States: తెలుగు రాష్ట్రాలకు రూ.లక్ష ఫైన్ విధించిన సుప్రీం

రాష్ట్రాల్లో ఉండే న్యాయమూర్తులు, కోర్టు ప్రాంగణాల భద్రత కోసం తీసుకున్న చర్యలపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయలేదనే కారణంతో ఈ పెనాల్టీ ఖరారు చేసింది.

Supreme fine on Telugu States: తెలుగు రాష్ట్రాలకు రూ.లక్ష ఫైన్ విధించిన సుప్రీం

Supreme Fine On Telugu States

Supreme fine on Telugu States: తెలుగు రాష్ట్రాలకు సుప్రీం కోర్టు రూ.1లక్ష జరిమానా విధించింది. రాష్ట్రాల్లో ఉండే న్యాయమూర్తులు, కోర్టు ప్రాంగణాల భద్రత కోసం తీసుకున్న చర్యలపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయలేదనే కారణంతో ఈ పెనాల్టీ ఖరారు చేసింది. ఆ మొత్తాన్ని వెంటనే సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ సంక్షేమ నిధికి చెల్లించాలని తెలిపింది. పైగా ఈ అంశాలకు సంబంధించి పది రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయనిపక్షంలో రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను పిలిపించాల్సి వస్తుందంటూ హెచ్చరించింది.

జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ జిల్లా అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి ఉత్తమ్‌ ఆనంద్‌ హత్య జరిగిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా న్యాయమూర్తులు, కోర్టుల రక్షణ కోసం సీఐఎస్‌ఎఫ్‌ తరహాలో ప్రత్యేక భద్రత బలగాన్ని ఏర్పాటుచేయాలని కోరుతూ కరుణాకర్‌ మహాళిక్‌ అనే వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది.

కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ న్యాయమూర్తులు, కోర్టుల భద్రతకు సంబంధించి కేంద్ర హోంశాఖ ఇప్పటికే ఆదేశాలు జారీచేసిందని, వాటిని రాష్ట్రాలు అనుసరిస్తున్న తీరుపై స్థాయి నివేదికను కోరవచ్చని చెప్పారు.

జస్టిస్‌ ఎన్‌.వి. రమణ స్పందిస్తూ ‘కోర్టులు, న్యాయమూర్తులకు ప్రత్యేక భద్రత విభాగాన్ని ఏర్పాటుచేయడానికి సిద్ధంగా ఉన్నారా’ అంటూ ప్రశ్నించారు.

అంతిమంగా మీరు ఏం చెబితే అది చేస్తామని మెహతా బదులిచ్చారు. ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ‘ఇవన్నీ పరిపాలన పరమైన అంశాలు. ఫలానాది చేయమని సలహా ఇవ్వలేం. రాష్ట్రాలతో మాట్లాడి న్యాయమూర్తుల భద్రతపై దేశవ్యాప్తంగా ఒకే విధానం గురించి నిర్ణయం తీసుకోవచ్చు’ అని సూచించారు.

మెహతా బదులిస్తూ ‘న్యాయమూర్తుల భద్రతకోసం దేశవ్యాప్తంగా ప్రత్యేక దళం ఏర్పాటు సాధ్యం కాదు. భద్రత ఏర్పాట్లు స్థానిక పరిస్థితులకు తగ్గట్టు ఉండాలి’ అని వివరించారు. ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, గోవా, కేరళ, మహారాష్ట్ర, మిజోరం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లు కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలుచేయలేదని జస్టిస్‌ ఎన్‌.వి. రమణ చెప్పారు.

అఫిడవిట్లు దాఖలుచేయని రాష్ట్రాలు ఎప్పటిలోపు ఆ పని చేస్తాయని జస్టిస్‌ ఎన్‌.వి. రమణ అడిగినప్పుడు కేరళ, గోవా న్యాయవాదులు మాత్రమే హాజరై తమకు మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. అందుకు ప్రధాన న్యాయమూర్తి అంగీకరించలేదు. ఇంతవరకూ కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలుచేయని రాష్ట్రాలపై రూ.లక్ష జరిమానా విధిస్తున్నట్లు చెప్పారు. అలా చేయని పక్షంలో ఆ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను పిలిపించాల్సి ఉంటుందని హెచ్చరించారు.