ప్రాణంగా చూసుకున్న ఎద్దుకు అంత్యక్రియలు..గుండెలవిసేలా ఏడ్చిన రైతన్న

ప్రాణంగా చూసుకున్న ఎద్దుకు అంత్యక్రియలు..గుండెలవిసేలా ఏడ్చిన రైతన్న

Updated On : February 18, 2021 / 11:53 AM IST

farmer funeral process to ox :  రైతుకు చేదోడు వాదోడుగా నిలిచే బసవన్నల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రైతన్నలకు వ్యవసాయంలో అండగా నిలిచేవి ఎద్దులే. పొలంగట్టుకు విత్తనాలు చేర్చనుంచి పంట పండి తిరిగి ధాన్యం ఇంటికి చేర్చేవరకూ ఎద్దుల ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది. అటువంటి ఎద్దు ఆ రైతన్న ఎదుటే ప్రాణాలు విడిస్తే కుటుంబ సభ్యుల్ని కోల్పోయినంతగా కుమిలిపోతాడా రైతు. అదే జరిగింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ లో..

ప్రాణంగా పెంచుకున్న ఎద్దు చనిపోవడంతో తల్లడిల్లిన ఆ రైతు కుంటుంబం ఆ ఎద్దుకు సొంత వ్యక్తికి జరిపినట్లుగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఎద్దుపై తమకున్న మమకారాన్ని చూపించారు. నిర్మల్‌ జిల్లా భైంసా మండలం వానల్‌పాడ్‌ గ్రామానికి చెందిన రాంకుమార్‌కు రెండు ఎద్దులు ఉన్నాయి. గత 21 ఏళ్లుగా రాంకుమార్ కుటుంబాన్ని సేవలు చేస్తున్నాయి ఆ రెండు ఎద్దులు. వాటిని కుటుంబ సభ్యులలాగే చూసుకునేవారు రాంకుమార్ కుటుంబం.

ఎంతో ప్రేమగా పెంచుకున్న జంటలో ఓ ఎద్దు బుధవారం (ఫిబ్రవరి 17)అనారోగ్యంతో ప్రాణాలు విడిచింది. దీంతో దాంతో ఎంతో అనుబంధం పెంచుకున్న రాంకుమార్ కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకుని కుమిలిపోయారు.వారికి అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వాయిద్యాలతో ఆ ఎద్దుకు అంతిమ యాత్ర నిర్వహించి తన పొలంలోనే ఖననం చేశారు.

స్థానికులంతా ఎద్దు అంత్యక్రియల కార్యక్రమానికి సహకరించారు. ఎద్దును కోల్పోయిన రైతు రాంకుమార్‌ మాట్లాడుతూ.. 21 ఏళ్ల క్రితం పౌర్ణమి రోజున జన్మించిన ఈ ఎద్దును బసవన్న అని పిలిచేవారమని..అది చనిపోవటం మాకుటుంబానికి తీరని వేదన అని కన్నీటితో తెలిపాడు.