Sasikala: దినకరన్‌ను పక్కకుపెట్టిన శశికళ

ఏఎంఎంకే నేతలు.. డీఎంకే, అన్నాడీఎంకేల్లోకి వలసలు వెళ్లడాన్ని శశికళ తీవ్రంగా పరిగణించారు. అలర్ట్ అయిన ఆమె.. ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి టీటీవీ దినకరన్‌ను పక్కకుపెట్టారు. బంధువులలో నుంచి ప్రత్యామ్నాయ నేతను సిద్ధం చేస్తున్నారు.

Sasikala: దినకరన్‌ను పక్కకుపెట్టిన శశికళ

Sasikala

Updated On : July 24, 2021 / 11:12 AM IST

Sasikala: ఏఎంఎంకే నేతలు.. డీఎంకే, అన్నాడీఎంకేల్లోకి వలసలు వెళ్లడాన్ని శశికళ తీవ్రంగా పరిగణించారు. అలర్ట్ అయిన ఆమె.. ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి టీటీవీ దినకరన్‌ను పక్కకుపెట్టారు. బంధువులలో నుంచి ప్రత్యామ్నాయ నేతను సిద్ధం చేస్తున్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత మృతి అనంతరం శశికళ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మారి మొత్తం తన చేతుల్లోకి తీసుకున్నారు.

జయలలిత మరణం సమయంలో సీఎంగా పనిచేసిన పన్నీర్‌సెల్వం చేత బలవంత రాజీనామాతో శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. సీఎంగా పదవీ ప్రమాణం చేసేందుకు గవర్నర్‌ ఆమోదం పొందేందుకు సమాయత్తం అవుతున్న తరుణంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు పాలయ్యారు. తనకు బదులు ఎడపాడి పళనిస్వామిని సీఎంగా చేసి పార్టీ బాధ్యతలు టీటీవీ దినకరన్‌కు అప్పగించారు.

ఆ తర్వాత శశికళను పార్టీ నుంచి బహిష్కరించడంతో అగ్గి రాజుకున్నట్లు అయింది. 37 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను దినకరన్‌ తనవైపునకు తిప్పుకుని.. అన్నాడీఎంకేకు పోటీగా దినకరన్‌ ఏఎంఎంకేను స్థాపించారు. వీరిలో 18 మంది మాత్రమే దినకరన్‌ను అనుసరించి పార్టీ ఫిరాయింపు చట్టం కింద పదవిని కోల్పోయారు.

పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేయవద్దు, ఉప ఎన్నికల్లో మాత్రమే పోటీచేయండని జైలు నుంచి శశికళ ఆదేశించారు. ఆమె ఆదేశాలను ధిక్కరించి తమిళనాడు, పాండిచ్చేరీల్లో పార్లమెంటు ఎన్నికల బరిలో దిగి మొత్తం 40 స్థానాల్లో ఏఎంఎంకే అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. ఆ తరువాత వచ్చిన ఉప ఎన్నికల్లోనూ ఘోరపరాజయం పొందారు. దీనిపై శశికళ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.

గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం అవే దుష్పలితాలు పునరావృతం కావడంతో ఏఎంఎంకే శ్రేణులు పార్టీని వీడి అధికార డీఎంకే, ప్రధాన ప్రతిపక్ష అన్నాడీఎంకేలో చేరుతూ.. ఏఎంఎంకే ఖాళీ అయ్యేదశకు చేరుకుంది. దినకరన్‌ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లనే పార్టీ పతనం దిశగా పయనిస్తోందని శశికళకు ఫిర్యాదు చేయడంతో ఈ యాక్షన్ తీసుకున్నారు.

ఇటీవల దినకరన్‌తో ఫోన్‌ ద్వారా సంభాషించిన శశికళ.. ‘పార్టీని చూసుకుంటా. కొంతకాలం బాధ్యతల నుంచి తప్పుకో’మని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆదేశాలను పాటిస్తూ.. పార్టీ కార్యకలాపాలకు అన్న కుమారుడు, భర్త సోదరుడిని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అలా దినకరన్‌ రాజకీయ ప్రకటనలు చేయడం, చెన్నై రాయపేటలోని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, కార్యాలయానికి రావడం మానేశారు.