Uttarpradesh : యోగి 7 రికార్డులు..పూర్తి వివరాలు

ఎవరికీ సాధ్యంకాని ఎన్నో రికార్డులనూ బద్దలు కొట్టింది. అక్కడ మోదీ, ఇక్కడ యోగీ అంటూ డబుల్ ఇంజన్ గ్రోత్‌ చూపిస్తామంటూ ఎన్నికలకు వెళ్లిన సీఎం యోగీ ఆదిత్యనాథ్‌.. అనుకున్నది..

Uttarpradesh : యోగి 7 రికార్డులు..పూర్తి వివరాలు

Yogi Adithynath

Yogi Adityanath Seven Recrods : ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది బీజేపీ. అంతేకాదు.. ఎవరికీ సాధ్యంకాని ఎన్నో రికార్డులనూ బద్దలు కొట్టింది. అక్కడ మోదీ, ఇక్కడ యోగీ అంటూ డబుల్ ఇంజన్ గ్రోత్‌ చూపిస్తామంటూ ఎన్నికలకు వెళ్లిన సీఎం యోగీ ఆదిత్యనాథ్‌.. అనుకున్నది సాధించారు.. ఈ క్రమంలోనే ఏడు రికార్డులను అందుకున్నారు. ఆ రికార్డులు ఏంటో పరిశీలిద్దాం

70 ఏళ్లలో 21 మంది సీఎంలు : –
1. భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌.. మే 20, 1952న అవతరించింది. 70 ఏళ్లలో యూపీ మొత్తం 21 మంది ముఖ్యమంత్రులను చూసింది. వీళ్లలో ఐదేళ్ల పూర్తికాలం పాలించి రెండోసారి విజయం సాధించిన తొలి సీఎం యోగి ఆదిత్యనాథ్‌. ఇంతవరకూ ఏ సీఎంకు ఈ ఘనత దక్కలేదు. యూపీలో ఐదేళ్లు పాలించిన వాళ్లే చాలా తక్కువ. కానీ యోగి మాత్రం ఐదేళ్ల పాలనను పూర్తి చేసుకోవడమే కాదు.. మళ్లీ అధికారంలోకి కూడా వచ్చి రాష్ట్రంపై తనకున్న పట్టేంటో చాటి చెప్పారు.

ఐదేళ్లు పాలించిన సీఎం యోగి : –
2. ఇక.. సీఎంగా ఎన్నికలకు వెళ్లి మళ్లీ అధికారం అందుకున్న వారిలో యోగీ ఆదిత్యనాథ్‌ ఐదో వ్యక్తి. యోగి కన్నా ముందు… 1957లో సంపూర్ణానంద, 1962లో చంద్రభానుగుప్త, 1974లో హెచ్‌ఎన్‌ బహుగుణ, 1985లో ఎన్‌డి తివారీ సీఎంగా ఎన్నికలకు వెళ్లి రెండోసారి అధికారంలోకి వచ్చారు. అయితే.. వారెవరూ కూడా అంతకు ముందు యోగీలా ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించలేదు.

37 ఏళ్ల తర్వాత తిరిగి అధికారం నిలబెట్టుకున్న సీఎం :-
3. 37 ఏళ్ల తర్వాత తిరిగి అధికారం నిలబెట్టుకొన్న ముఖ్యమంత్రిగా యోగి నిలిచారు. కాంగ్రెస్‌కు చెందిన ఎన్‌.డి.తివారి అవిభాజ్య యూపీలో 1985లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి అధికారం నిలబెట్టుకొన్నారు. ఇపుడు మళ్లీ యోగి ఆదిత్యనాథ్‌కే అలాంటి అవకాశం వచ్చింది. ప్రతీసారి ఎన్నికల్లో అధికారాన్ని మార్చుతూ వచ్చిన యూపీ ఓటర్లు.. ఈ సారి మాత్రం అధికార పార్టీకే మళ్లీ పట్టం కట్టారు.

70 ఏళ్లలో 21 మంది సీఎంలు : –
4. బీజేపీ నుంచి యూపీని ఇప్పటి వరకు నలుగురు ముఖ్యమంత్రులు పాలించారు. వీరిలో తొలిసారి యోగి ఆదిత్యనాథ్‌ మాత్రమే తిరిగి అధికారాన్ని కాపాడుకొన్నారు. యోగి కంటే ముందు కల్యాణ్‌సింగ్, రామ్‌ప్రకాశ్‌ గుప్తా, రాజ్‌నాథ్‌ సింగ్‌లు యూపీ ముఖ్య మంత్రులుగా పని చేశారు. కానీ, అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయారు. వారికంటే మెరుగైన రికార్డును యోగి తన పేరిట లిఖించుకున్నారు.

15 ఏళ్లుగా ఎమ్మెల్సీలే ముఖ్యమంత్రులు : –
5. గత 15 ఏళ్లలో యూపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న తొలి ఎమ్మెల్యేగా యోగి ఆదిత్యనాథ్‌ రికార్డ్‌ సొంతం చేసుకోనున్నారు. యూపీకి గత 15 ఏళ్లుగా ఎమ్మెల్సీలే ముఖ్యమంత్రులు అవుతున్నారు. 2007లో మాయావతి, 2012వో అఖిలేశ్‌ యాదవ్‌ కూడా ఎమ్మెల్సీలుగానే సీఎం పదవి చేపట్టి రాష్ట్రాన్ని పాలించారు. 2017లో యోగి కూడా ఎమ్మెల్సీగానే ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అప్పటివరకు ఆయన లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. 1999లో బీజేపీ సీఎంగా ఉన్న రామ్‌ప్రకాశ్‌ గుప్తా కూడా ఎమ్మెల్సీగానే ఉన్నారు.

70 ఏళ్లలో 21 మంది ముఖ్యమంత్రులు : –
6. 70 ఏళ్లలో యూపీ మొత్తం 21 మంది ముఖ్యమంత్రులను చూసింది. ఇక్కడ ముగ్గురు మాత్రమే ఐదేళ్ల పూర్తికాలం పాలించారు. వీరిలో యోగి మూడో వ్యక్తి. అంతకుముందు 2007-12 వరకు బీఎస్పీ చీఫ్‌ మాయావతి, 2012-17 వరకు ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ పూర్తికాలం పాలించిన ముఖ్యమంత్రిగా ఉన్నారు.

నోయిడా మూఢనమ్మకాన్ని ఛేదించిన తొలి సీఎం : –
7. నోయిడా మూఢనమ్మకాన్ని ఛేదించిన తొలి సీఎం యోగి ఆదిత్యనాథ్‌. యూపీలో నోయిడా పెద్ద పారిశ్రామిక నగరం. ఢిల్లీ నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌కు అనుబంధ నగరంగా ఉన్న నోయిడా… యూపీలోని గౌతమ్‌ బుద్ధ నగర్‌ పరిధిలోకి వస్తుంది. ఈ నగరాన్ని సందర్శించిన ముఖ్యమంత్రులు తర్వాతి ఎన్నికల్లో గెలవలేదని ఓ ప్రచారం ఉంది. 1980లో వీరభద్ర సింగ్‌, ఎన్‌డీ తివారీలు ఈ నగరాన్ని సందర్శించాక పదవులు కోల్పోయారు. అఖిలేశ్‌ యాదవ్‌ కూడా తన పదవీకాలంలో నోయిడాలో పర్యటించలేదు. 2013లో నోయిడాలో జరిగిన ఆసియన్ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరు కాలేదు. 2011లో మాయావతి నోయిడాలో దళిత స్మారక స్టాల్‌ ప్రారంభానికి హాజరు కాలేదు. ములాయంసింగ్‌ యాదవ్, కళ్యాణ్‌సింగ్, రాజ్‌నాథ్‌సింగ్‌ కూడా నోయిడాలో పర్యటించలేదు. కానీ, యోగి ఆదిత్యనాథ్, ప్రధాని మోదీ 2018లో నోయిడాలో పర్యటించి మెట్రోలైన్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజా ఎన్నికల్లో యోగి గెలవడం ద్వారా నోయిడా పర్యటన ఓ మూఢనమ్మకమేనని నిరూపించారు. ఇలా ఒకే ఒక్క ఎన్నికల ఫలితాలతో ఏడు రికార్డులను అందుకున్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌..