Nellore Kurrallu : పవన్ కళ్యాణ్ రేంజ్‌లో ‘వకీల్ సాబ్’ ఫైట్.. అదరగొట్టిన సింహపురి చిన్నోళ్లు..

వాళ్లే నెల్లూరు కుర్రాళ్లు.. మరోసారి తమ సత్తా చూపించారు.. భారీ సెట్టింగులు, గ్రాఫిక్స్ లేకుండానే సినిమాల్లోని ఫైట్స్‌ను మొబైల్‌తో ఉన్నది ఉన్నట్టు చిత్రీకరిస్తూ తమ టాలెంట్‌ను నిరూపించుకొంటున్నారు..

Nellore Kurrallu : పవన్ కళ్యాణ్ రేంజ్‌లో ‘వకీల్ సాబ్’ ఫైట్.. అదరగొట్టిన సింహపురి చిన్నోళ్లు..

Vakeel Saab Fight By Nellore Kurrallu

Nellore Kurrallu: ఆ కుర్రాళ్లు ఒక ఫైట్‌ సీక్వెన్స్‌ వీడియో చేశారంటే.. ఒరిజినల్‌కు ఏమాత్రం తీసిపోదు.. చూసేవాళ్లకు కిరాక్‌ పుట్టిస్తారు. వారి స్టైల్‌.. వారి టెక్నిక్‌.. ఔరా అనిపిస్తుంది. ఇంతకీ వాళ్లెవరో మీరు ఈ పాటికి గెస్‌ చేసే ఉంటారు.. ఎస్‌.. వాళ్లే నెల్లూరు కుర్రాళ్లు.. మరోసారి తమ సత్తా చూపించారు.. భారీ సెట్టింగులు, గ్రాఫిక్స్ లేకుండానే సినిమాల్లోని ఫైట్స్‌ను మొబైల్‌తో ఉన్నది ఉన్నట్టు చిత్రీకరిస్తూ తమ టాలెంట్‌ను నిరూపించుకొంటున్నారు..
ఈ కుర్రాళ్లు తాజాగా పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్ ‘వకీల్‌ సాబ్’ సినిమాలోని ఫైట్స్‌ను ఎలాంటి డూప్ లేకుండా షూట్ చేసి శభాష్ అనిపించుకుంటున్నారు. నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నారు.

నెల్లూరులోని భగత్ సింగ్ కాలనీకి చెందిన కిరణ్ అండ్ టీమ్ మరోసారి తమ టాలెంట్ చూపించారు. గతంలో మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని ఫైట్‌ను ఎలాంటి భారీ సెట్టింగులు, క్రేన్లు, గ్రాఫిక్స్ లేకుండా ఒక కెమెరా ఫోన్‌తో సినిమాలో ఉన్నట్టుగానే చిత్రీకరించి ఆ సినిమా యూనిట్‌నే అబ్బురపరిచారు. ఆ వీడియో వైరల్ కావడంతో టీంను ప్రశంసలతో ముంచెత్తారు. సినిమా డైరెక్టర్లు కూడా కొందరు ఈ టీంను అభినందించారు.

తాజాగా మరోసారి ఈ సింహపురి చిన్నోళ్లు పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాలోని ఫైట్స్ చిత్రీకరించి అదరగొట్టేశారు. కెమెరా ఫోన్, చిన్నపాటి సామాగ్రితో ‘వకీల్ సాబ్’ సినిమాలోని రెండు ఫైట్స్‌ను కలిపి ఒకే వీడియాలో పొందుపరిచారు. కేవలం నాలుగు రోజుల్లోనే షూటింగ్, ఎడిటింగ్ కంప్లీట్ చేశారు. 7 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలతోనే ఈ వీడియోను అద్భుతంగా సృష్టించారు డైరెక్టర్ కిరణ్. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ వీడియోను తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

‘వకీల్ సాబ్’ ఫైట్ వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు కిరణ్ అండ్ టీం. చాలా హ్యాపీ గా ఉందని, అనేక ఫోన్ కాల్స్ వస్తున్నాయని కిరణ్ బృందం అంటోంది. ఇదే ట్యాలెంట్‌తో త్వరలో ఒక లో బడ్జెట్ సినిమా కూడా చేయబోతున్నాడు డైరెక్టర్ కిరణ్. కిరణ్ చదువుకున్నది తొమ్మిదో తరగతి వరకే. తండ్రి అనారోగ్యంతో కన్నుమూశారు. తల్లి చేపలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. సినిమాలపై ఉన్న ఆసక్తే కిరణ్‌లోని టాలెంట్‌ను బయటకు తీస్తోంది..

ఈ టీమ్‌లోని సభ్యుల౦తా విద్యా ర్థులే. వీళ్లలో స్కూల్ విద్యార్థులున్నారు. కాలేజీ విద్యార్థులూ ఉన్నారు. ఆ కుటుంబాల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అయినా తల్లిదండ్రులు తమ పిల్లలను నటనలో ప్రోత్సహించడం విశేషం. ఎక్కడా వారికీ అభ్యంతరం చెప్పడం లేదు. ‘వకీల్ సాబ్’ సినిమా వీడియోలో యాక్ట్ చేసిన తమ పిల్లల నటనను చూసి మురిసిపోతున్నారు. తమ పిల్లలకు ఎవరైనా అన్ని విధాలా సపోర్ట్ ఇస్తే మరింత పైకి ఎదుగుతారని, వాళ్లల్లో ఉన్న పూర్తిస్థాయి టాలెంట్ బయటికొస్తుందని వారి తల్లిదండ్రులు అంటున్నారు..