ఇండస్ట్రీలో మరో విషాదం, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కన్నుమూత

సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ భీమ్‌సింగ్ కన్నన్‌ (69) కన్నుమూశారు.

  • Published By: naveen ,Published On : June 14, 2020 / 03:27 AM IST
ఇండస్ట్రీలో మరో విషాదం, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కన్నుమూత

సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ భీమ్‌సింగ్ కన్నన్‌ (69) కన్నుమూశారు.

సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ భీమ్‌సింగ్ కన్నన్‌ (69) కన్నుమూశారు. శనివారం(జూన్ 13,2020) మధ్యాహ్నం చెన్నైలో ఆయన తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన హృదయ సంబంధ సమస్యతో బాధపడుతున్నారు. తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాలకు కెమెరామన్ గా ఆయన పని చేశారు. ప్రసిద్ధ తమిళ దర్శకుడు భారతీరాజాతో కలిసి దాదాపు 40 చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. 

కన్నన్‌ను భారతీరాజా కళ్లు అని పిలుస్తారు:
కన్నన్‌ను ‘భారతీరాజా విన్ కన్ గళ్‌’ (భారతీరాజా కళ్లు) అని పిలిచేవారు. వీరిద్దరు కలిసి చివరిసారిగా ‘బొమ్మలాట్టమ్‌’ అనే చిత్రానికి పనిచేశారు. తెలుగులో పగడాల పడవ, కొత్త జీవితాలు, సీతాకోక చిలుక, ఆరాధన వంటి చిత్రాలకు కన్నన్‌ సినిమాటోగ్రఫీ అందించారు. సృజనాత్మకత కలబోసిన కెమెరా పనితనంతో ప్రతిభాశీలిగా కన్నన్ గుర్తింపు పొందారు. కన్నన్‌ మృతిపట్ల దక్షిణాది సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

సినీ పరిశ్రమలో అనేక విషాదాలు:
”సినీ ఇండస్ట్రీలో తాజాగా అనేక విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. బాలీవుడ్‌లో అనేకమంది ప్రముఖులు మరణించారు. 2020 సంవత్సరం ఏ మాత్రం బాలేదు. మరో గొప్ప వ్యక్తి, ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కన్నన్‌ను కోల్పోయాం. ‘కెప్టెన్‌ మగళ్‌’ సినిమా కోసం ఆయనతో కలిసి పనిచేశా. భారతీరాజా సర్ పర్మనెంట్‌ కెమెరామెన్‌ ఆయన. కన్నన్ కుటుంబ సభ్యులకు నా సానుభూతి. మిమ్మల్ని చాలా మిస్‌ అవుతున్నాం కన్నన్‌ సర్‌’ అని ఖుష్బూ ట్వీట్‌ చేశారు. తమిళం, మలయాళంలో 50కి పైగా సినిమాలకు ఆయన కెమెరామన్ గా పని చేశారు. కన్నన్ కు భార్య కాంచన, ఇద్దరు కూతుళ్లు(మధుమతి, జనని) ఉన్నారు. ఆదివారం(జూన్ 14,2020) చెన్నైలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు. కణ్ణన్‌ ప్రముఖ తమిళ నిర్మాత, రచయిత, దర్శకుడు భీమ్‌సింగ్‌ కుమారుడు. ప్రముఖ డైరెక్టర్ లెనిన్‌కు సోదరుడు.

సినీ పరిశ్రమకు తీరని లోటు:
కన్నన్ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అని దర్శకుడు భారతీరాజా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులు కన్నన్ లెన్స్ ద్వారా తమిళ సంస్కృతిని అనుభూతి పొందారని చెప్పారు. షూటింగ్ సమయంలో నేను నా కెమెరా తీసుకెళ్లేవాడిని కాదు. కన్నన్, ఆయన కళ్లే నా కెమెరా అని భారతీరాజా అన్నారు. దర్శకుడిగా తనకు దక్కిన క్రెడిట్ కు కారణం కన్నన్ ప్రతిభ అని భారతీరాజా తెలిపారు.