Fat : మనం తిన్న ఆహారం కొవ్వుగా ఎలా మరుతుందంటే?

మన అవసరాలను బట్టే కణాలు శక్తిని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. మనం తేలిక పాటి పనులు చేస్తున్నప్పుడు తక్కువ శక్తి సరిపోతుంది కాబట్టి అప్పుడు తక్కువ శక్తినే ఉత్పత్తి చేస్తాయి.

Fat : మనం తిన్న ఆహారం కొవ్వుగా ఎలా మరుతుందంటే?

Digestive

Fat : మన శరీరమనేది ఒక వాహనం లాంటిది. ఇది పని చేయాలంటే ప్రతిరోజూ శక్తి కావాలి. ఆ శక్తిని వాడుకుంటూ మన శరీరం మనం అనుకున్న పనులను చేయడానికి సహకరిస్తూ ఉంటుంది. శరీరంలోని అవయవాలన్నీ పనిచేయడానికి శక్తి అనేది ప్రతి నిత్యం అవసరం. స్వయంగా శక్తిని ఉత్పత్తి చేసుకునే సదుపాయము శరీరానికే ఉంది. ఆ శక్తిని ఉత్పత్తి చేయడానికి కావలసిన ఆహారాన్ని తింటే అది పొట్టలోనికి చేరుతుంది. అక్కడ నుండి చిన్న ప్రేగులలోనికి చేరుతుంది. ఈ రెండు చోట్ల మెత్తగా గుజ్జు గుజ్జుగా జీర్ణం అయ్యి, ఆ తరువాత రసంలాగా మారుతుంది. ఆ రససారమే మన శక్తికి మూల ఇంధనం.

రససారము ప్రేగుల గోడల నుండి మెల్లగా రక్తంలోనికి చేరుతుంది. రక్తంలో కలిసిన ఆ రససారము మెల్లగా రక్తనాళాల ద్వారా ప్రయాణిస్తుంది. మన శరీరంలో ఉండే రక్తనాళాలన్నింటినీ దండలాగా గ్రుచ్చితే, అవి సుమారు 60 వేల మైళ్ళ పొడవుంటాయని అంచనా వేశారు. మనం తిన్న ఆహారసారం ప్రతి నిత్యం ఈ 60 వేల మైళ్ళ పొడవుండే రక్తనాళాల ద్వారా ప్రయాణిస్తుంది.

మనం తిన్నది పొట్టలోకి వెళ్ళినా, రక్తంలోకి చేరినా మనకు శక్తి రాదు. ఆహారం ద్వారా శక్తిని ఉత్పత్తి చేసే కేంద్రాలు కణాలు. కణాలనే జనరేటర్స్ అని పిలుస్తారు. మనం తిన్న అహారసారం చివరకు చేరే గమ్యస్థానం కణాలే. ఆ కణం అనేది కంటితో చూడలేని చిన్న రూపం. అంత సూక్మాతిసూక్ష్మమైన కణాలే మనం బ్రతకడానికి, పనిచేయడానికి మూలకారణంగా చెప్పవచ్చు.

మనం తిన్న ఆహారసారం రక్తనాళాల ద్వారా ప్రయాణించి చివరకు కణాల లోపలకు చేరుతుంది. కణాలు ఆ సారాన్ని గ్లూకోజ్ లేదా చక్కెర పదార్థాలు లోపల మండించి వేడిని ఉత్పత్తి చేస్తాయి. అలా కణాలలో ఉత్పత్తి అయిన వేడి లేదా శక్తి శరీరమంతా ప్రయాణిస్తూ మనం పని చేయటానికి అందుతూ ఉంటుంది. మనం నిద్రపోయినా కణాలు నిద్రపోకుండా 24 గంటలూ పని చేస్తూ వేడిని ఉత్పత్తి చేస్తూనే ఉంటాయి.

మన అవసరాలను బట్టే కణాలు శక్తిని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. మనం తేలిక పాటి పనులు చేస్తున్నప్పుడు తక్కువ శక్తి సరిపోతుంది కాబట్టి అప్పుడు తక్కువ శక్తినే ఉత్పత్తి చేస్తాయి. బాగా బరువు పనులు చేస్తుంటే చకచకా ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయగలవు. ఒక వేళ నిద్రలో ఉన్నామనుకోండీ, అవసరం బాగా తక్కువ గాబట్టి మరీ కొద్దిపాటి శక్తినే ఉత్పత్తి చేస్తూ విశ్రాంతిగా ఉంటాయి. మన కణాలు ఉత్పత్తి చేసే శక్తిని కూడా శరీరంలో స్టోర్ చేయడం కుదరదు. కాబట్టి, మన కణాలు కూడా మన అవసరాలను బట్టి అప్పటికప్పుడు శక్తిని విడుదల చేస్తూ, మనం పనిచేసుకునేటట్లు సహకరిస్తూ ఉంటాయి.

ఉత్పత్తి అయిన శక్తిని దాచుకునే సదుపాయం శరీరంలో లేనప్పటికీ, శక్తిని ఉత్పత్తి చేయడానికి కావలసిన మూల ఇంధనాన్నిమాత్రం దాచుకునే సదుపాయం చాలా ఉంది. మనం తిన్న ఆహారసారాన్ని శరీరం మూడు రూపాలుగా కణాలు వాడుకునేట్లు అందిస్తూ ఉంటుంది. మనం తిన్న రెండు మూడు గంటలకు ప్రేగులు కూడా పని మొదలు పెట్టి పొట్టకు భారాన్ని తగ్గిస్తూ అరిగించడం ప్రారంభిస్తాయి. మనం తిన్న ఆహారసారం ప్రేగుల నుండి అంచెలంచెలుగా 2 నుండి 5-6 గంటలలో రక్తంలోకి చేరుతూ ఉంటుంది. మనం తిన్న ఆహారసారం చక్కెర పదార్థాలు లేదా గ్లూకోజ్ రక్తంలో చేరిన తరువాత 120 నుండి 160 మి.గ్రా. లెవల్ కు మించి నిల్వయుండకూడదు. కాబట్టి, ఈ లెవల్ వరకు రక్తంలోకి ఆహారసారం చేరుతూ మిగతాది మొత్తం వేరే ఎక్కడైనా నిల్వ యుండాల్సిందే. ఆహారసారం నిల్వయుండే ప్రదేశాలు మొత్తం మూడు. అవి, రక్తంలో, లివరులో, కొవ్వు కణాలలో ఉంటుంది.

మనం తిన్న ఆహారసారం లివరులో నిల్వయుండే కెపాసిటీకి మించి లోపలకు వెళుతుంది. అప్పుడు లివరు చెడిపోని రూపమైన కొవ్వుగా మార్చి, దానిని కొవ్వు కణాలలో భద్రంగా దాస్తుంది. అవసరానికి మించి తిన్నదంతా మన లోపల ఇలా కొవ్వుగా మారి నిల్వ చేయబడుతూ ఉంటుంది. ఎక్కువ తిన్నప్పుడు శరీరం దానిని దాస్తుంది. ఎప్పుడైనా తినడం కుదరకపోయినా, ఆ నిల్వలను కరిగించి దాని ద్వారా మనకు శక్తిని అందిస్తుంది.