KTR: ఆ కేసులో కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది?

స్థానిక ఎన్నికలు రాబోతున్న వేళ.. ఫిరాయింపు ఎమ్మెల్యేల్లోని ఒకరిద్దరి నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు వస్తాయన్న ఊహాగానాలు నడుస్తున్న టైమ్‌లో..కేటీఆర్ అరెస్ట్‌ అయితే ఎఫెక్ట్ ఎలా ఉండబోతోందని ఆరా తీస్తున్నారట కారు పార్టీ లీడర్లు.

KTR: ఆ కేసులో కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది?

Updated On : November 20, 2025 / 9:51 PM IST

KTR: ప్రెస్టీజియస్ ఈవెంట్. ఇంటర్నేషనల్ కాంపిటీషన్. తెలుగు స్టేట్స్‌లో అంతగా పరిచయం లేని మోటర్‌ స్పోర్ట్‌ ఛాంపియన్‌ షిప్. అదే.. ఫార్ములా ఈ కార్‌ రేస్ కేసు. ఇన్నాళ్లు ఆరోపణలు, విమర్శలకు కేరాఫ్‌గా నడిచిన ఈ కారు రేస్‌ కేసులో అసలు ఎపిసోడ్‌ ఇప్పుడే స్టార్ట్ అయింది. కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్‌ అనుమతి..ఛార్జ్‌ షీట్‌ వేసేందుకు ఏసీబీ సిద్ధమవుతుండటంతో వాట్ నెక్స్ట్‌. ఇప్పుడిదే క్షణక్షణం టెన్షన్ టెన్షన్‌గా మారింది. ఎప్పుడేం జరుగుతుందోనన్న ఉత్కంఠ రేపుతోంది. కేటీఆర్‌ అరెస్ట్‌ ఖాయమా? కేటీఆర్‌ అరెస్ట్ అయితే బీఆర్ఎస్‌ గేమ్‌ ప్లాన్ ఎలా ఉండబోతోంది?

ఆందోళనలో బీఆర్ఎస్ క్యాడర్..

తెలంగాణ పొలిటికల్ సినారియో మారిపోతూ వస్తోంది. డైలీ ఎపిసోడ్‌గా కొనసాగుతోన్న ఫార్ములా ఈ కారు రేస్‌ మరోసారి హీట్‌ క్రియేట్‌ చేస్తోంది. బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో.. ఏం జరగబోతోందన్న ఉత్కంఠ కొనసాగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి క్లిష్ట పరిస్థితులను ఫేస్ చేస్తోంది బీఆర్ఎస్. జూబ్లీహిల్స్ ఓటమి మరిచిపోకముందే ఫార్ములా ఈ కార్ రేస్ కాసు వ్యవహారం బీఆర్ఎస్‌ క్యాడర్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ కేసులో బీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ శాఖమంత్రిగా పని చేసిన కేటీఆర్ చుట్టూ అలిగేషన్స్ చక్కర్లు కొడుతున్నాయి.

ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్‌ను ఏ1 గా ఆరోపిస్తోంది ఏసీబీ. అయితే ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్ అనుమతి తప్పనిసరి కావడంతో తెలంగాణ ప్రభుత్వం గవర్నర్‌కు లేఖ రాసింది. న్యాయ సలహా తీసుకున్న తర్వాత ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్‌ను విచారించేందుకు ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు గవర్నర్. వెనువెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేటీఆర్ విచారణకు సంబంధించి ఏసీబీకి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కేటీఆర్‌ను రెండుసార్లు విచారించింది ఏసీబీ. విచారణలో భాగంగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వాడిన ఫోన్, ల్యాప్ టాప్‌ను ఇవ్వాలని ఏసీబీ నోటీసులు జారీ చేయగా..వాటిని వాడటం లేదని కేటీఆర్ సమాధానం ఇచ్చారు.

ఇక ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్‌ రెడ్డిని విచారించిన ఏసీబీ కీలక ఆధారాలు సేకరించినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్‌ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ కార్ రేస్ కేసుపై ఏసీబీ ఛార్జ్‌షీట్ వేసేందుకు రెడీ అవుతోంది. అంతకు ముందే కేటీఆర్‌ను మరోసారి విచారించనున్నట్లు తెలుస్తోంది. ఇంకోసారి విచారణకు పిలిచి కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారన్న చర్చ జరుగుతోంది. కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు కూడా ఇదే అంచనాతో ఉండి..అందుకు మానసికంగా సిద్ధమైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కేటీఆర్ అరెస్ట్ అయితే.. పార్టీకి డ్యామేజ్‌ చేస్తుందా..? ఇమేజ్ వస్తుందా?

కేటీఆర్ అరెస్ట్ అయి జైలుకెళ్తే పార్టీ పరిస్థితి ఏంటని నేతలు, క్యాడర్‌లో ఆందోళన నెలకొందట. ఇప్పటికే ఏడాదికి పైగా సస్పెన్స్ థ్రిల్లర్‌గా కొనసాగుతోన్న ఫార్ములా ఈ కారు రేస్‌ కాసు..ఓ లొట్ట పీస్‌ కేసు అని కేటీఆర్ ఇప్పటికే పలుసార్లు తేల్చి చెప్పారు. అందులో తన తప్పేమి లేదని..మనీ లేదు..ల్యాండరింగ్‌ లేదు.. డబ్బులు నేరుగా ఈవెంట్‌ ఆర్గనైజర్స్‌కు వెళ్లాయని..అందులో అవినీతి ఎక్కడిదని ప్రశ్నిస్తూ వస్తున్నారు. పైగా ఏడాది నుంచి పబ్లిక్‌లో చర్చనీయాంశంగా ఉంది ఫార్ములా ఈ కారు రేస్ కేసు. దీంతో ఈ వ్యవహారంతో కేటీఆర్ అరెస్ట్ అయితే..పార్టీకి డ్యామేజ్‌ చేస్తుందా..? ఇమేజ్ వస్తుందా అనేది పార్టీలో చర్చకు దారితీస్తోంది.

స్థానిక ఎన్నికలు రాబోతున్న వేళ.. ఫిరాయింపు ఎమ్మెల్యేల్లోని ఒకరిద్దరి నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు వస్తాయన్న ఊహాగానాలు నడుస్తున్న టైమ్‌లో..కేటీఆర్ అరెస్ట్‌ అయితే ఎఫెక్ట్ ఎలా ఉండబోతోందని ఆరా తీస్తున్నారట కారు పార్టీ లీడర్లు. కేటీఆర్ అరెస్ట్ అయితే కక్ష సాధింపుగా భావించి ప్రజలు బీఆర్ఎస్ వెంట నడుస్తారా? లేదా అన్న డౌట్‌లో గులాబీ నేతలు ఉన్నారట. ఈ క్రమంలోనే కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే గులాబీ బాస్‌ బయటికి వస్తారన్న టాక్ కూడా బయలుదేరింది. సేమ్‌ టైమ్ పార్టీ నేతలను, కార్యకర్తలను హరీశ్‌రావు ముందుండి నడిపిస్తారని కూడా అంటున్నారు.

ఈ కారు రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ అయితే ఏం చేయాలనేదానిపై మేథోమదనం చేస్తోందట బీఆర్ఎస్ అధినాయకత్వం. ఒకవేళ కేటీఆర్‌ జైలుకు వెళ్లాల్సి వస్తే..త్వరగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయడంతో పాటు..క్యాడర్, లీడర్లలో నిరుత్సాహం ఏర్పడకుండా వ్యూహరచన చేస్తున్నారట. ఫార్ములా ఈ కారు రేస్‌ కేసులో ఏం జరగబోతోందో? కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోందో.? వేచి చూడాలి.

Also Read: నేషనల్‌ పాలిటిక్స్‌లో లోకేశ్ కు పెరుగుతున్న ఇంపార్టెన్స్.. దేనికి సంకేతం? ఎందుకీ ఎలివేషన్?