Exercise : వ్యాయామ సమయంలో గుండెపోటులకు కారణం?

ముఖ్యంగా వారాంతాల్లో జిమ్‌లకు వెళ్లేవారు ఎట్టి పరిస్థితుల్లోనైనా వ్యాయామం చేయాలనే ఉద్దేశంతో పట్టుబట్టి చేస్తుంటారు. ఇది శరీరం, అవయవాల మీద విపరీత ప్రభావం చూపిస్తుంది.

Exercise : వ్యాయామ సమయంలో గుండెపోటులకు కారణం?

Exersise

Exercise : ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక వ్యాయామం తప్పనిసరి. చెమటు పట్టేంత వరకు వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తుంటారు. ప్రస్తుతం మారిన జీవన శైలితో ప్రజలు వ్యాయామానికి దూరమయ్యారు. ఫలితంగా చిన్నవయస్సులోనే జబ్బుల బారిన పడుతున్నారు. ప్రస్తుత పరిస్ధితుల్లో వ్యాయామ ప్రాధాన్యత బాగా పెరిగింది. ప్రస్తుత జీవన శైలికి వ్యాయామాలు చేయటం అలవాటుగా చేసుకోవటం మంచిదన్న అభిప్రాయం వైద్యనిపుణుల నుండి వ్యక్తమౌతుంది. నిత్య వ్యాయామాల కారణంగా గుండె, మెదడు, ఊపిరితిత్తులు, జీర్ణకోశ, గ్రంధులు కండరాలు, ఎముకలు, అన్ని బలోపేతమౌతాయి.

వ్యాయామాల విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి. వ్యాయామాలను చిన్నగా మొదలు పెట్టి నెమ్మదిగా అంచెలంచెలుగా పెంచుకుంటూ వెళ్ళాలి. చాలా మంది అలా కాకుండా తాము పెట్టుకున్న లక్ష్యాన్ని వెంటనే చేరి పోవాలన్న ఆతృతతో వ్యాయామాలు ప్రారంభించన రోజునే అతిగా చేస్తూ కోరి కష్టాలు కొని తెచ్చుకుంటుంటారు. ఇలా చేయటం వల్ల శరీరం ఒత్తిడికి లోనై చివరికి గుండెపై భారం పడి సమస్యలు తలెత్తుతాయి.

వ్యాయామ సమయంలో గుండెపోట్లు రావటం అనేది అప్పుటి శారీరక పరిస్థితి, ఆరోగ్యం, ఇతరత్రా సమస్యలను బట్టి ఆధారపడి ఉంటుంది. కొందరు అంతకుముందు రోజు మద్యం ఎక్కువగా తాగి ఉండొచ్చు. విపరీతమైన ఒత్తిడికి గురై ఉండొచ్చు. రాత్రిపూట సరిగా నిద్రపోయి ఉండకపోవచ్చు. దీంతో మర్నాడు శరీరం వ్యాయామానికి సహకరించకపోవచ్చు. అయినా కూడా వీటిని పట్టించుకోకుండా ఎప్పటి మాదిరిగానే వ్యాయామాలకు ఉపక్రమించొచ్చు.

ముఖ్యంగా వారాంతాల్లో జిమ్‌లకు వెళ్లేవారు ఎట్టి పరిస్థితుల్లోనైనా వ్యాయామం చేయాలనే ఉద్దేశంతో పట్టుబట్టి చేస్తుంటారు. ఇది శరీరం, అవయవాల మీద విపరీత ప్రభావం చూపిస్తుంది. పైగా కొందరికి అప్పటికే తెలియకుండా గుండె సమస్యలు, అధిక రక్తపోటు, మధుమేహం వంటివి ఉండి ఉండొచ్చు. పుట్టుకతో వచ్చే కొన్ని గుండె సమస్యలున్నా పైకి ఎలాంటి లక్షణాలూ కనిపించవు. అసలు అలాంటి సమస్య ఉన్న సంగతైనా తెలియదు. అధిక రక్తపోటు, మధుమేహంలోనూ తప్పనిసరిగా లక్షణాలు కనిపించాల్సిన అవసరం లేదు. వీటిని గుర్తించటానికి ముందుగా పరీక్షలు చేసుకునేవారు చాలా తక్కువగా ఉండటం వంటి కారణాల వల్ల వ్యాయామాలు చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా గుండెలోని విద్యుత్‌ వ్యవస్థ విపరీతంగా ప్రభావితమై హఠాత్తుగా గుండె ఆగిపోవచ్చు. శ్వాస వేగం గణనీయంగా పెరిగి, ఆయాసంతో చివరికి శ్వాస తీసుకోలేని పరిస్థితి తలెత్తొచ్చు. గుండె పోటుకు గురై కుప్పకూలిపోతుండటం జరుగుతుంది. రక్తనాళాల్లో పీడనం బాగా పెరిగి పక్షవాతానికి దారితీయొచ్చు.

వ్యాయామంతో ఇలాంటి సమస్యలు తలెత్తటం చాలా చాలా అరుదు. అయినా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవటం ఎవరికైనా మంచిదే. మనమేమీ పోటీలకు వెళ్లటం లేదనే సంగతి గుర్తుంచుకోవాలి. శరీరాన్ని విపరీతమైన ఒత్తిడికి గురిచేసి క్షణాల్లో లక్ష్యాలను చేరుకోవటం అసాధ్యమని తెలుసుకోవాలి. గుండెపోటుకు వ్యాయామం ప్రత్యక్ష కారణం కాదు. ఇది హఠాత్తుగా సంభవించేదీ కాదు. శరీరం సహకరించకపోతున్నా కూడా బలవంతగా, అతిగా భారీ కసరత్తులు చేయటమే ముప్పు తెచ్చిపెడుతుంది. శరీరం కొన్ని హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటుంది. వీటిని గుర్తించి, జాగ్రత్త పడటం ఎంతైనా అవసరం. నోరు ఎండిపోవటం, శరీరం కాస్త చల్లగా అవటం, తల తేలిపోతున్నట్టు అనిపించటం, తీవ్రమైన ఆయాసం, గుండె దడ, బలహీనంగా ఉన్న శరీర భాగాలు వణకటం, వికారం వంటి లక్షణాలు కనిపిస్తే వ్యాయామం నిలిపివేసి కొద్ది సేపు విశ్రాంతి తీసుకోవటం అనంతరం వైద్యుని సంప్రదించి తగిన చికిత్స పొందటం మేలు.