Shivsena vs Shivsena: ఉద్ధవ్ థాకరేకు మరో షాక్.. షిండే క్యాంపులోకి 2 ఎంపీలు, 5 ఎమ్మెల్యేలు

2 MPs, 5 MLAs from Uddhav Thackeray-led Shiv Sena faction to join Eknath Shinde camp today
Shivsena vs Shivsena: తరుచూ ఏదో ఘటనతో మహారాష్ట్ర పొలిటికల్ డ్రామా అలా కొనసాగుతూనే ఉంది. వాస్తవానికి 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం మొదలైన రాజకీయ హైడ్రామా ఎన్నెన్నో మలుపులు తీసుకుంటూ నేటికీ దేశంలో చర్చనీయాంశంగానే ఉంటోంది. ఇకపోతే, తాజాగా ఉద్ధవ్ థాకరే వర్గానికి చెందిన ఇద్దరు ఎంపీలు, ఐదుగురు ఎమ్మెల్యేలు.. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గంలో చేరనున్నట్లు తెలుస్తోంది. బుధవారం నిర్వహించిన దసరా ర్యాలీలోనే షిండే సమక్షంలో క్యాంపు మారనున్నట్లు శివసేన (షిండే వర్గం) ఎంపీ క్రుపాల్ తుమానె తెలిపారు.
షిండే వర్గంలో ప్రస్తుతం 40 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎంపీలు ఉన్నారు. ఇక ఉద్ధవ్ శిబిరంలో కేవలం 15 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎంపీలు ఉన్నారు. తాజాగా వచ్చిన వార్త ప్రకారం.. ఉద్ధవ్ వర్గంలోని ఇద్దరు ఎంపీలు, ఐదుగురు ఎమ్మెల్యేలు కనుక షిండే క్యాంపులోకి దూకితే.. ఉద్ధవ్ బలం మరింత తగ్గిపోతుంది. షిండే వర్గం బలం 45 మంది ఎమ్మెల్యేలు, 14 మంది ఎంపీలకు చేరుతుంది.
ఇదిలా ఉంటే.. 56 ఏళ్ల శివసేన చరిత్రలో ఈ ఏడాది రెండు గ్రూపులుగా దసరా ర్యాలీ నిర్వహిస్తున్నాయి. 1966 నుంచి శివసేన దసరా ర్యాలీ నిర్వహిస్తోంది. అది కూడా ప్రత్యేకంగా శివాజీ పార్కులోనే. అయితే ఈసారి పార్టీ రెండుగా చీలడంతో శివాజీ పార్కులో దసరా ర్యాలీ కోసం ఉద్ధవ్, షిండే వర్గాలు పోటీ పడ్డాయి. అయితే కోర్టు జోక్యంతో ఉద్ధవ్ వర్గానికి అకవాశం లభించింది. ఇక శివాజీ పార్కు ఉద్ధవ్ వర్గానికి దక్కడంతో షిండే వర్గం బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని ఎంఎంఆర్డీఏ మైదానంలో దసరా ర్యాలీ నిర్వహిస్తోంది.