Anand Kumar: విద్యార్థుల ఆత్మహత్యలు విపరీతంగా పెరుగుతున్న వేళ.. సూపర్-30 ఆనంద్ కీలక సూచనలు

‘ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకు నేను ఓ విజ్ఞప్తి చేస్తున్నాను. విద్యను ఆదాయ వనరుగా మార్చవద్దు ’ అన్నారు.

Anand Kumar: విద్యార్థుల ఆత్మహత్యలు విపరీతంగా పెరుగుతున్న వేళ.. సూపర్-30 ఆనంద్ కీలక సూచనలు

Anand Kumar

Anand Kumar – Kota coaching: పోటీ పరీక్షల కోచింగ్ కేంద్రాలకు పేరుగాంచిన రాజస్థాన్‌(Rajasthan)లోని కోటాలో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో దీనిపై సూపర్ 30 కోచింగ్ సెంటర్ వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ స్పందించారు. ఆదివారం ఒకే రోజు ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం తనను కలచివేసిందని చెప్పారు.

ట్విట్టర్‌లో ఆనంద్ కుమార్ స్పందిస్తూ… ‘రాజస్థాన్ లోని కోటాలో ఆదివారం నాలుగు గంటల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న వార్త నా హృదయాన్ని కదిలించింది. కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకు నేను ఓ విజ్ఞప్తి చేస్తున్నాను. విద్యను ఆదాయ వనరుగా మార్చవద్దు.

విద్యార్థులను మీ పిల్లలుగా భావించండి. విద్యార్థులకు నేను చెప్పేది ఒక్కటే. ఏదో ఒక టెస్టులో వచ్చిన ఫలితాలు మీలోని ప్రతిభకు కొలమానం కాదు. జీవితంలో విజయం సాధించాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. ఒకే ఒక్క మార్గం ఉంటుందని అనుకోవద్దు. ఇదే సమయంలో, తల్లిదండ్రులు తాము సాధించలేకపోయిన కలలను సాకారం చేస్తారన్న భావంతో పిల్లలను చూడొద్దు ’ అని చెప్పారు.

కాగా, కోటాలో చోటుచేసుకుంటున్న ఆత్మహత్యలపై దీనిపై అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండాపోతోంది. కోచింగ్ సెంటర్లు, హాస్టళ్ల వద్ద విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల సంఖ్య 23కి చేరింది.