Maneka on Iskon: ఇస్కాన్ పై సంచలన ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ మేనకా గాంధీ.. స్పందించిన ఇస్కాన్

గొడ్డు మాంసం ప్రధాన ఆహారంగా ఉన్న ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఆవుల సంరక్షణకు ఇస్కాన్‌ మార్గదర్శకత్వం వహించిందని ఇస్కాన్‌ భాగస్వామ్యం చేసిన ఒక ప్రకటన పేర్కొంది. ఇస్కాన్‌కు ప్రపంచవ్యాప్తంగా వందలకొద్దీ దేవాలయాలు, లక్షలాది మంది భక్తులు ఉన్నారు.

Maneka on Iskon: ఇస్కాన్ పై సంచలన ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ మేనకా గాంధీ.. స్పందించిన ఇస్కాన్

Updated On : September 27, 2023 / 4:31 PM IST

Maneka on Iskon: ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్(ఇస్కాన్)పై భారతీయ జనతా పార్టీ నేత, ఎంపీ మేనకా గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఆవులను షెడ్ల నుంచి కసాయిలకు ఇస్కాన్ విక్రయిస్తోందని, ఇస్కాన్ దేశంలోనే మోసకారి సంస్థ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. అయితే మేనకా చేసిన ఆరోపణలపై ఇస్కాన్ సంస్థ స్పందించింది. ఆమె చేసిన ఆరోపణలు ‘అర్ధం లేనివి, అసంబద్ధమైనవి’ అని ఇస్కాన్‌ పేర్కొంది.

జంతు సంరక్షణ సమస్యలపై కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ సామాజిక మాధ్యమాల్లో నిరంతరం మాట్లాడుతుంటారు. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా విడుదల చేసిన వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో ఇస్కాన్ దేశంలోనే అతిపెద్ద మోసకారి సంస్థని ఆమె అన్నారు. ఆవు ఆశ్రయాల నిర్వహణ పేరుతో విస్తారమైన భూములతో సహా ప్రభుత్వం నుంచి ప్రయోజనాలను పొందుతున్నారని, అలాగే ఆవులను షెడ్ల నుంచి నేరుగా కసాయిలకు అమ్ముతున్నారని అన్నారు.

మేనకా గాంధీ పూర్తి ప్రకటన ఏమిటి?
‘‘నేను ఆంధ్రప్రదేశ్‌లోని ఇస్కాన్‌కు చెందిన అనంతపురం గౌశాలకు వెళ్లాను. డెయిరీ మొత్తంలో పాలిచ్చే ఆవు ఒక్కటి కూడా లేదు. అలాగే అక్కడ ఒక్క దూడ కూడా లేదు. అంటే అన్నీ అమ్మకానికి పోతున్నాయి. ఇస్కాన్ తన ఆవులన్నింటినీ కసాయిలకు విక్రయిస్తుంది. తాము చేసినంత సేవ ఎవరూ చేయరని ఇస్కాన్ నుంచి వాదనలు వస్తున్నాయి. వారు వీధుల్లో ‘హరే రామ్ హరే కృష్ణ’ పాడతారు. అప్పుడు తమ జీవితమంతా పాలపైనే ఆధారపడి ఉంటుంది. కానీ వాస్తవంలో జరిగేదేంటి? బహుశా, వారిలా ఎవరూ పశువులను కసాయిలకు అమ్మి ఉండరు’’ అని మేనకా అన్నారు.

ఇస్కాన్ సమాధానం..
ఆరోపణలను తోసిపుచ్చిన ఇస్కాన్ జాతీయ ప్రతినిధి యుధిష్ఠిర్ గోవింద దాస్ స్పందిస్తూ..‘‘భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆవులు, ఎద్దుల సంరక్షణ వంటి విషయాల్లో ఇస్కాన్ సంస్థ ప్రపంచంలోనే అగ్రభాగాన ఉంది. ఆవులను, ఎద్దులను జీవితాంతం సంరక్షిస్తాము మేము. కసాయిలకు అమ్మడం అన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం’’ అని అన్నారు.


గొడ్డు మాంసం ప్రధాన ఆహారంగా ఉన్న ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఆవుల సంరక్షణకు ఇస్కాన్‌ మార్గదర్శకత్వం వహించిందని ఇస్కాన్‌ భాగస్వామ్యం చేసిన ఒక ప్రకటన పేర్కొంది. ఆయా ప్రాంతాల్లో కూడా ఇస్కాన్‌ పనిచేస్తోందని, మేనకా గాంధీ సుప్రసిద్ధ జంతు హక్కుల కార్యకర్తని అయితే ఇస్కాన్ సైతం ఆమెలాంటి వారికి శ్రేయోభిలాషని, కానీ ఈ ప్రకటనలు తమను ఆశ్చర్యానికి గురిచేశాయని వారు పేర్కొన్నారు.

ఇస్కాన్ అంటే ఏమిటి?
ఇస్కాన్‌కు ప్రపంచవ్యాప్తంగా వందలకొద్దీ దేవాలయాలు, లక్షలాది మంది భక్తులు ఉన్నారు. కొన్ని నెలల క్రితం, ఇస్కాన్‌కు చెందిన ఒక సన్యాసి స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంసలను విమర్శించినప్పుడు వారి పాపులారిటీ వెలుగులోకి వచ్చింది.