DGCI నోటీసులు …వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేసిన సీరం ఇన్స్టిట్యూట్!

  • Published By: venkaiahnaidu ,Published On : September 10, 2020 / 04:30 PM IST
DGCI నోటీసులు …వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేసిన సీరం ఇన్స్టిట్యూట్!

భారత్ ‌లో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్న పుణెలోని సీరం ఇన్సిస్టిట్యూట్ ఆఫ్‌ ఇండియాకు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. ఇతర దేశాల్లో ఆస్ట్రాజెనికా పరీక్షలను నిలిపివేసినప్పటికీ, భారత్‌లో కొనసాగడంపై డీసీజీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది.




ఆస్ట్రాజెనికా క్లినికల్‌ ట్రయల్స్‌ నిలిపివేత సహా అందుకు గల కారణాలను సమర్పించకపోవడాన్ని డీసీజీఐ తప్పుబట్టింది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులో సీరంను ఆదేశించింది. ప్రజా భద్రత దృష్ట్యా సీరంకు ఇచ్చిన వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ అనుమతుల్ని ఎందుకు రద్దు చేయకూడదో సమాధానం చెప్పాలని ప్రశ్నించింది.

ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్​కు సంబంధించి బ్రిటన్​లో తలెత్తిన లోపాలేవీ భారత్​లో చోటుచేసుకోలేదని.. అందుకే క్లినికల్ ట్రయల్స్ కొనసాగిస్తామని సీరం ప్రకటించిన కొద్దిసేపటికే డీసీజీఐ నోటీసులు పంపింది




తాజా పరిణామాల నేపథ్యంలో భద్రతా సమస్యల దృష్ట్యా తదుపరి ఉత్తర్వులకు వరకు పరీక్షలను నిలిపి వేయాల్సిందిగా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా సీరంను ఆదేశించింది. తాజా షోకాజ్ నోటీసుపై స్పందించిన సీరం ఇనిస్టిట్యూట్ .. డీసీజీఐ జారీ చేసిన ఆదేశాలను అనుసరిస్తామని తెలిపింది. వారి సూచనలు, ప్రామాణిక ప్రోటోకాల్‌కు కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. దీంతో దేశంలోని 17 చోట్ల నిర్వహిస్తున్న 2,3వ దశ ట్రయల్స్ నిలిచిపోయాయి.



https://10tv.in/covid-19-pandemic-not-last-world-must-be-prepared-for-the-next-who-chief/
ఆస్ట్రాజెనెకా సంస్థతో కలిసి ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్‌ ట్రయల్ బ్రిటన్ లో నిలిపివేసిన విషయం తెలిసిందే. భారత్ సహా పలు దేశాలలో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌ ని ప్రయోగిస్తుండగా… బ్రిటన్‌ లో ఆస్ట్రాజెనెకా టీకాను తీసుకున్న ఓ వాలంటీర్ తీవ్ర అస్వస్థతకు గురవుతున్నాడని గుర్తించడంతో ట్రయల్స్ ని నిలిపివేస్తున్నట్లు ఆస్ట్రాజెనెకా ప్రకటించింది.