సైనైడ్ సీరియల్ కిల్లర్ జోసెఫ్ ఆత్మహత్యాయత్నం

సైనైడ్ సీరియల్ కిల్లర్ జోసెఫ్ ఆత్మహత్యాయత్నం

కేరళలోని ఫ్యామిలీ కిల్లర్.. 14ఏళ్ల పాటు కుటుంబంలోని ఒకొక్కరిని హతమారుస్తూ వచ్చిన జాలీ జోసెఫ్ ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. కొజికొడె జైలులో ఉంటున్న ఆమె ఎడమచేతిని మణికట్టును కోసుకుని సూసైడ్‌కు ప్రయత్నించింది. గమనించిన వెంటనే పోలీసు సిబ్బంది ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించడంతో ఆరోగ్యం అదుపులోకి వచ్చింది. 

తెల్లవారుజామున 4గంటల సమయంలో చేతినరం కట్ చేసుకునేందుకు పదునైన వస్తువుతో ఆమె ప్రయత్నించింది. తోటి ఖైదీలు చూసి సమాచారం అందించారు. ‘ఇటువంటి ఘటనలు జరిగిన తర్వాత ఆమెను సాధారణ కస్టడీలో ఉంచలేం. ముందుగానే ఆమెపై ఓ కన్నేసి ఉంచమని ఇతర ఖైదీలకు చెప్పాం. గత రాత్రి ఎవరికీ కనపడకుండా కవర్ చేసుకుంది. ఇతర ఖైదీలకు ఆమె బెడ్ వద్ద రక్తపు మరకలు ఉండడంతో మమ్మల్ని అలర్ట్ చేశారు’ అని పోలీసు అధికారి వెల్లడించారు. 

ఆమె ప్రయత్నించినట్లు నరం పూర్తిగా తెగిపోలేదు. కొంత భాగం వరకే గాయమైంది. విషమ పరిస్థితి నుంచి బయటపడింది. కోలుకున్న వెంటనే తిరిగి జైలుకు తరలిస్తాం. కొద్ది రోజులుగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మహత్య చేసుకునే విధంగా ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. రెగ్యూలర్ కౌన్సిలింగ్ ఇస్తున్నాం. నిన్న కూడా కొంతసేపు కౌన్సిలింగ్ ఇచ్చాం’ అని అధికారులు తెలిపారు. 

కూడతాయ్ గ్రామానికి చెందిన జోసెఫ్ గతేడాది అక్టోబరులో భర్తతో సహా ఆరుగురు కుటుంబ సభ్యులను చంపిన కేసులో అరెస్టు అయింది. ఆహారంలో సెనైడ్ కలపడం చంపేయడం.. పద్నాలుగేళ్లుగా ఆమె ఉపయోగించిన టెక్నిక్ ఇది. కుటుంబానికి సంబంధించిన ఆస్తిలో వాటా కొట్టేయడానికి.. తనకు ఇష్టమైన వేరే వ్యక్తిని పెళ్లిచేసుకోవడానికి ఇలా చేసినట్లు సమాచారం. కోర్టులో ఈ కేసుపై ఇంకా విచారణ కొనసాగుతుంది.