రానున్న 6 నెలలు పరీక్షల కాలమే, బండి సంజయ్ పాస్ అవుతారా?

  • Published By: naveen ,Published On : September 29, 2020 / 10:49 AM IST
రానున్న 6 నెలలు పరీక్షల కాలమే, బండి సంజయ్ పాస్ అవుతారా?

Telangana bjp chief bandi sanjay: బండి సంజయ్ అంటే.. ఏడాది క్రితం వరకు ఓ సాధారణ బీజేపీ కార్యకర్త. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఓ ఎమ్మెల్యే క్యాండిడేట్. కానీ, ఏడాది తిరిగే సరికి పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. కరీంనగర్ ప్రజల ఆశీర్వాదంతో ఎంపీగా ఎన్నిక కాగా.. అధిష్టానం ఆశీస్సులతో రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి వరకు జిల్లా రాజకీయాల్లో నిమగ్నమైన సంజయ్.. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించాల్సి వస్తోంది. గతంలో ఆయన పోటీ చేసే చోట మాత్రమే దృష్టి పెడితే చాలు.. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆయనే బాధ్యత వహించాల్సి వస్తుంది.

రాబోయే ఆరు నెలలు సంయజ్‌కు పరీక్షల కాలమే:
రాజకీయ నాయకులకు పరీక్షలంటే ఎన్నికలే. రాబోయే ఆరు నెలలు సంయజ్‌కు పరీక్షల కాలమేనంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలు మొదలుకొని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట కార్పొరేషన్ ఎలక్షన్స్‌ వరసగా జరగబోతున్నాయి. ఇక, అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్‌గా చెప్పుకొనే జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉండనే ఉన్నాయి. ఈ ఎన్నికలన్నీ సంజయ్‌కు పరీక్షగా నిలవబోతున్నాయని అంటున్నారు.

ఎంతోమంది సీనియర్లను కాదని సంజయ్‌కు అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది అధిష్టానం. ఆయనపై పార్టీ అధిష్టానం పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కాకూడదంటే.. ఈ ఎన్నికల్లో ఆయన సత్తా చాటాలి. ఇందుకోసం సంజయ్ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారట.

దుబ్బాక ఉప ఎన్నికల్లో చావో రేవో:
దుబ్బాక ఉప ఎన్నికల్లో చావో రేవో తేల్చుకునేందుకు కమలం పార్టీ పావులు కదుపుతోంది. వచ్చే 15 రోజుల్లో ఉపఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రచారాన్ని ముమ్మరం చేసింది ఆ పార్టీ. హైదరాబాద్‌లో పాగా వేసేందుకు సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి నూతన వ్యూహంతో ముందుకు సాగాలని సంజయ్‌ ప్రయత్నిస్తున్నారట.

ముంబై, కోల్‌కత్తా తరహాలో హైదరాబాద్‌ను నాలుగు జిల్లాలుగా విభజించారు. మరోపక్క, వరంగల్ కార్పొరేషన్‌పై ప్రత్యక దృష్టి సారించి, అక్కడి సమస్యలపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే వరంగల్‌లో వరదలు వచ్చినప్పుడు బండి సంజయ్ అక్కడికి వెళ్లి, ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారట. పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా సత్తా చాటేందుకు కమలనాథులు సిద్ధమవుతున్నారు.

అధిష్టానం ఉంచిన నమ్మకాన్ని ఎంత వరకు నిలబెట్టుకుంటారు?
అధిష్టానం సంజయ్‌పై ఉంచిన నమ్మకాన్ని ఎంత వరకు నిలబెట్టుకుంటారనే చర్చ ఇప్పుడు పార్టీలో జరుగుతోంది. ఆయన చూపించే దూకుడు పార్టీకి ప్లస్‌ అవుతుందా? పార్టీ కేడర్‌లో జోష్‌ పెరుగుతుందా అని కార్యకర్తలు ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారట. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సంజయ్‌ ఎత్తుగడలు ఫలిస్తాయో లేదో అన్నది తేలాలంటే రాబోయే ఆరు నెలల్లో జరగనున్న ఈ ఎన్నికలు పూర్తయ్యే వరకూ వేచి చూడాల్సిందే.