CM Jagan : గాజువాకలో ఎన్డీయే గెలిస్తే జరిగేది ఇదే- సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి రాష్ట్రానికి ఇచ్చే గ్యారెంటీ ఏంటి? చంద్రబాబు అత్యంత అవినీతిపరుడని మోదీనే అన్నారు.

CM Jagan : గాజువాకలో ఎన్డీయే గెలిస్తే జరిగేది ఇదే- సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

CM Jagan : ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు సీఎం జగన్. ప్రతిపక్షాలు టార్గెట్ గా చెలరేగిపోతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై నిప్పులు చెరుగుతున్నారు. చంద్రబాబు లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గాజువాకలో ఎన్నికల ప్రచార సభలో జగన్ మాట్లాడారు. కూటమికి ఓటు వేస్తే.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఓటేసినట్లే అని సీఎం జగన్ అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకపోవడానికి కారణం మీ బిడ్డ జగనే అని చెప్పారు.

”గాజువాకలో ఎన్డీఏ గెలిచిందంటే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపడం సాధ్యం కాదు. ఎన్నికల్లో మీరు ఇచ్చే నిర్ణయాన్నే ఎన్నికల రెఫరెండంగా తీసుకుంటారు. రైల్వే జోన్‌కు మనం భూములిచ్చినా తీసుకోకుండా రాద్ధాంతం చేస్తున్నారు. మనది ఆర్ధికంగా నిలబడగలిగే రైల్వే జోన్‌. రెండు బిల్డింగ్ లు కట్టి మమ అన్పించడం వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. ఈరోజు మన మీద వీళ్లంతా దొంగ ప్రేమ చూపిస్తున్నారని గుర్తించండి. రాష్ట్ర అవసరాలను తాకట్టు పెడుతూ వారివన్నీ అబద్ధాలు, మోసాలు” అని జగన్ అన్నారు.

”గత ఎన్నికలకు ముందు చంద్రబాబుపై మోదీ విమర్శలు చేశారు. చంద్రబాబు అత్యంత అవినీతిపరుడని మోదీనే అన్నారు. పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నాడని మోదీనే చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి రాష్ట్రానికి ఇచ్చే గ్యారెంటీ ఏంటి? ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా? ప్రత్యేక హోదాను కూడా చంద్రబాబు అమ్మేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోమని హామీ ఇస్తారా? మళ్లీ ఇదే ముగ్గురు.. మళ్లీ ఇదే మ్యానిఫెస్టో డ్రామా ఆడుతున్నారు. గతంలో చంద్రబాబు మ్యానిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చారు. ఒక్కటైనా నేరవేర్చారా? పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తామన్నారు. చేశారా? ఆడబిడ్డ పుడితే రూ.25వేలు ఇస్తామన్నారు. ఇచ్చారా? ఇంటింటికీ ఉద్యోగం.. లేదంటే రూ.2వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.. ఇచ్చారా?

సూపర్ సిక్స్ అంటున్నారు.. మీరు నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం ఇస్తామంటారు. మీరు నమ్ముతారా? ఇంటింటికీ బెంజ్ కారు కొనిస్తాం అంటున్నారు..నమ్ముతారా? అందరూ ఆలోచన చేయండి. ఇలాంటి మోసాలు చేసే వ్యక్తులతో మనం యుద్ధం చేస్తున్నాం. వాలంటీర్లు మళ్లీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు వాళ్ల చదువులు, బడులు బాగు పడాలన్నా, మన వ్యవసాయం-ఆసుపత్రులు మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే రెండు బటన్లు ఫ్యాను గుర్తు మీదే నొక్కాలి. 175కి 175 అసెంబ్లీ, 25కి 25 ఎంపీ స్థానాలు గెలిపించాలి” అని సీఎం జగన్ కోరారు.

”జూన్ 4న విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తా. రాష్ట్రంలో 6 సీ పోర్టులు ఉంటే.. మరో 4 సీ పోర్టులు కడుతున్నాం. రాష్ట్రానికి లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. అక్క చెల్లెమ్మళ్లకు 31లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చాం. జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి. ఇంటింటి అభివృద్ధి జరుగుతుంది. చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు.. మళ్లీ మోసపోవడమే” అని హెచ్చరించారు జగన్.

Also Read : చంద్రబాబు పేరెత్తడానికే అసహ్యంగా ఉంది.. మోదీ ప్రధాని పదవికి విలువ లేకుండా చేస్తున్నారు : మంత్రి బొత్స