నాంది పలికింది ఎవరు? :వీధుల్లో వినాయకుడి ఉత్సవాలకు అసలు కారణం తెలుసా?

  • Published By: veegamteam ,Published On : August 30, 2019 / 07:36 AM IST
నాంది పలికింది ఎవరు? :వీధుల్లో వినాయకుడి ఉత్సవాలకు అసలు కారణం తెలుసా?

వినాయక చవితి పండుగను పురస్కరించుకుని వినాయకుడి విగ్రహాలను వీధుల్లో ప్రతిష్టించే వేడుకలు జరుపుకునే చరిత్ర ఎలా ప్రారంభమైందో తెలుసా? ఇంట్లో చేసుకునే వినాయకుడి పండుగను వీధి వీధినా నిర్వహించే సంప్రదాయానికి భారతదేశ స్వాతంత్ర్య సమరానికి సంబంధం ఉందనే సంగతి మీకు తెలుసా? బ్రిటీష్ వారి బానిసత్వంలో మగ్గిపోతున్న భారతదేశానికి స్వాతంత్ర్య పోరాటానికి వినాయకుడి వేడుకలకు గల సంబంధమేమిటి? దీనికి వీధుల్లో విగ్రహాల ఏర్పాటు సంప్రదాయానికి గల కారణాలు.. అది ఎలా మొదలైంది? ఈ సంప్రదాయానికి లోకమాన్య బాల గంగాధర్ తిలక్ పిలుపు ఎలా కారణమైందో.. తెలుసుకుందాం.. ఇది తెలుసుకుంటే పండుగ ఉండేది. వినాయకుడి విగ్రహ ఎత్తుల్లో కాదు ప్రజల్లో సామరస్యంలో అనే విషయం తెలుస్తుంది. 

గణనాయకుడి పండుగ వచ్చేసింది. వీధి వీధినా గణనాయకుడు కొలువుతీరనున్నాడు. మండపాల ఏర్పాట్లు, విగ్రహాల కొనుగోళ్లు చేస్తూ ప్రజలంతా హడావిడి చేస్తున్నారు. అయితే.. దేశ స్వతంత్య్రకాంక్షను రగిలించడంకోసం, యువతను ఏకం చేసేందుకు 1894లో మహారాష్ట్ర పుణె కేంద్రంగా సర్వ జనైఖ్య గణేశ్ ఉత్సవాలకు నాయకులు పిలుపునిచ్చారు. గణపతి ఉత్సవాలను సామాజిక వేదికలుగా చేసి సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించారు. బాలగంగాధర్ తిలక్ పిలుపుతో హైదరాబాద్‌లో కూడా వినాయకుడి వేడుకలు జరిపారు ఆనాటి  ప్రజలు. ఈ వేడుకల్లో కుల మతాలకు అతీతంగా ప్రతిఒక్కరూపాల్గొన్నారు.

హైదరాబాద్‌ సిటీ పాతబస్తీ శాలిబండ దగ్గరున్న భారత గుణవర్థక్‌ సంస్థను 1895లో ఉగాది రోజున స్థాపించారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న మహారాష్ట్రీయులు బాలచంద్ర దీక్షిత, వక్రతుండ దీక్షిత, నారాయణరావు పిల్‌ఖానె, లక్ష్మణరావు సదావర్తె, దాదాచారి కాలెమిత్ర బృందం సారథ్యంలో మరాఠా సంస్థ ప్రారంభమైంది. ఈ సంస్థ.. తిలక్ స్పూర్తితో గుణవర్థక్‌ సంస్థ ప్రాంగణంలో వీధుల్లో వినాయకచవితి వేడుకలను ప్రారంభించింది.

విగ్రహాలను నెలకొల్పి..సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. కుంటలు, చెరువుల్లోని నల్లమట్టిని తెచ్చి చిన్న చిన్న గణపతి ప్రతిమను చేసి..చేయించి.. ఆ విగ్రహాలను ప్రతిష్టించి.. 9 రోజుల పాటు పూజలు నిర్వహించేవారు. సాయంత్రం వేళల్లో.. సమైక్య స్పూర్తిని నింపే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. నాటి పాలకుల ఆధిపత్యాన్ని ఎదురిస్తూనే.. ప్రభువులు కూడా సమ్మతించేలా గణపతి నవరాత్రులు జరగడం గొప్ప విశేషం. అలా మొదలైయ్యాయి వీధి వీధినా వినాయక ఉత్సవాలు. అలా మొదలైన వినాయక ఉత్సవాలు.. భారత గుణవర్థిని సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికీ కొనసాగిస్తున్నారు కమిటీ సర్వ జనైఖ్య గణేశ్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు.