INDvsBAN: 68 పరుగుల ఆధిక్యంలో భారత్

INDvsBAN: 68 పరుగుల ఆధిక్యంలో భారత్

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతోన్న తొలి ఇన్నింగ్స్ మొదటి రోజు భారత్‌దే ఆధిపత్యంగా నిలిచింది. అన్ని విభాగాల్లో రాణించిన భారత్ భేష్ అనిపించుకుంది. బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను భారత్ గడగడలాడించింది. ఇషాంత్ శర్మ (5/22)తో విజృంభించాడు. ఫలితంగా 30.3 ఓవర్లలో 106 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (59 నాటౌట్), నయావాల్‌ పుజారా (55) హాఫ్ సెంచరీకి మించిన స్కోరు చేసి నిలిచారు. తొలి రోజు ఆట పూర్తయ్యే సరికి 174/3 స్కోరుతో బంగ్లాకు 68 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. 

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా జట్టును ఇషాంత్‌ శర్మ(5/22) దెబ్బతీశాడు. కీలక బ్యాట్స్‌మెన్ ముష్ఫికర్‌, హహ్మదుల్లా (6) ఎక్కువ సేపు క్రీజులో నిలవకపోవడంతో బంగ్లా 38 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాలో పడింది. తర్వాత లిటన్‌ దాస్‌ (24), నయీమ్‌ హసన్‌ (19) కాసేపు నిలబడడంతో బంగ్లా 106 పరుగులకు కుప్పకూలింది. భారత బౌలర్లలో ఉమేశ్‌ యాదవ్‌ (3/29), షమీ (2/36)లతో సత్తా చాటారు.   

ఇద్దరు సబ్‌స్టిట్యూట్లు:
బంగ్లాదేశ్ ప్లేయర్లు ఇద్దరు సబ్‌స్టిట్యూట్లుగా బరిలోకి దిగారు. లిటన్‌ దాస్‌ స్థానంలో మెహదీ హసన్, నయీమ్‌ స్థానంలో తైజుల్‌ ఇస్లామ్‌ ఆడారు. లంచ్‌ బ్రేక్‌కు ముందు షమి బౌలింగ్‌ వేస్తుండగా లిటన్‌దాస్ తలకు బలమైన గాయం తగిలింది. రిటైర్‌హర్ట్‌గా వెనుదిరగడంతో అతడి స్థానంలో నయీమ్‌తో కలిసి మెహదీ హసన్‌ బ్యాటింగ్‌కు వచ్చాడు. షమి వేసిన మరో బౌన్సర్‌కు నయీమ్‌ గాయపడ్డాడు. 

బ్యాటింగ్ కు దిగిన భారత జట్టులో మయాంక్‌ అగర్వాల్‌ (14) ఆరంభంలోనే తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. అల్‌ అమిన్‌ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి మెహదీ హసన్‌‌కు క్యాచ్ ఇచ్చాడు. 26 పరుగులకే భారత్ తొలి వికెట్‌ కోల్పోగా రెండో వికెట్‌గా రోహిత్‌ శర్మ(21)పడింది. ఇబాదత్‌ హుస్సేన్‌ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన రోహిత్‌ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 43 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది భారత్.

ఆ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన పుజారాతో కలిసి కోహ్లీ బంగ్లా బౌలర్లను ఎదుర్కొన్నాడు. వీరిద్దరి భాగస్వామ్యంలో 94 పరుగులు వచ్చి చేరాయి. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన రహానె (23)తో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 174 పరుగులు చేసింది.