T20 World Cup: వరల్డ్ కప్‌లో మరో సంచలనం.. ఒక్క పరుగు తేడాతో పాకిస్తాన్‌పై జింబాబ్వే విజయం

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో మరో సంచలనం నమోదైంది. ఉత్కంఠపోరులో పాకిస్తాన్ పై జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.

T20 World Cup: వరల్డ్ కప్‌లో మరో సంచలనం.. ఒక్క పరుగు తేడాతో పాకిస్తాన్‌పై జింబాబ్వే విజయం

T20 World Cup: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో మరో సంచలనం నమోదైంది. ఉత్కంఠపోరులో పాకిస్తాన్ పై జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పాక్ చేతులెత్తేసింది. 129/8 స్కోరుకు పరిమితమైంది. దీంతో ఒక్క రన్ తేడాతో జింబాబ్వే సంచలన విజయాన్ని నమోదు చేసింది.

స్వల్ప స్కోరును కాపాడుకోవడంలో జింబాబ్వే బౌలర్లు సమష్టిగా రాణించారు. మొత్తం ఏడుగురు బౌలర్లు బౌలింగ్‌ చేయడం గమనార్హం. సికిందర్‌ రజా మ్యాజిక్ చేశాడు. 4 ఓవర్లలో 25 రన్స్ ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. బ్రాడ్‌ ఇవాన్స్ రెండు వికెట్లు పడగొట్టాడు. బ్లెస్సింగ్‌, జాగ్వే చెరో వికెట్ తీశారు. ఆరంభంలోనే పాక్ ఓపెనర్లను ఔట్ చేసిన జింబాబ్వే బౌలర్లు.. మ్యాచ్ పై పట్టు బిగించారు.

కాగా, వరల్డ్ కప్ లో పాకిస్తాన్ కు ఇది వరుసగా రెండో ఓటమి. తొలి మ్యాచ్ లో భారత్ చేతిలో పాక్ ఓటమిపాలైంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఇక పాక్ పై జింబాబ్వే సంచలన విజయంలో కీలకపాత్ర పోషించిన సికిందర్ రజా చరిత్ర సృష్టించాడు. ఒక ఏడాదిలో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా నిలిచాడు. రజా 7 అవార్డులు గెలుచుకోగా, 6 అవార్డులతో కింగ్ విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. క్వాలిఫయింగ్ మ్యాచ్ లతో కలిసి ఒక్క ఈ వరల్డ్ కప్ లోనే రజాకు 3 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు రావడం విశేషం.

Sikandar Raza

పాక్ ను చిత్తు చేసిన జింబాబ్వేపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అనివార్య కారణాల వల్ల గత రెండు ప్రపంచ కప్ లలో ఆడే అవకాశం కోల్పోయిన జింబాబ్వే.. ఈసారి కూడా నేరుగా వరల్డ్ కప్ లో అడుగుపెట్టలేదు. క్వాలిఫయింగ్ మ్యాచులు ఆడి సూపర్ 12కు వచ్చింది. ఇప్పుడు ఏకంగా ఒకప్పటి ప్రపంచ ఛాంపియన్, వరల్డ్ క్లాస్ ప్లేయర్లు ఉన్న పాక్ ను ఓడించింది. జింబాబ్వే పోరాటం స్ఫూర్తిదాయకం అని ప్రశంసిస్తున్నారు.

కాగా, ఈ వరల్డ్ కప్ లో ఇప్పటివరకు 5 సంచలనాలు నమోదయ్యాయి..

* క్వాలిఫయింగ్ మ్యాచుల్లో(అర్హత పోటీల్లో) శ్రీలంకపై నమీబియా విజయం

* క్వాలిఫయింగ్ మ్యాచుల్లో (అర్హత పోటీల్లో) వెస్టిండీస్‌పై స్కాట్లాండ్‌ గెలుపు

* క్వాలిఫయింగ్ మ్యాచుల్లో (అర్హత పోటీల్లో) విండీస్‌పై ఐర్లాండ్‌ విజయం

* సూపర్‌ -12 దశలో ఇంగ్లండ్‌పై ఐర్లాండ్‌ విజయం (డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి)