Data Move Tool : మీ ఫేస్‌బుక్ ఫొటోలు, వీడియోలన్నీ ఇక గూగుల్లో 

  • Published By: sreehari ,Published On : December 4, 2019 / 08:30 AM IST
Data Move Tool : మీ ఫేస్‌బుక్ ఫొటోలు, వీడియోలన్నీ ఇక గూగుల్లో 

సోషల్ ప్లాట్ ఫాంపై డేటా ప్రైవసీ పెద్ద సమస్యగా మారింది. యూజర్ల డేటాకు ప్రైవసీ లేదని, వారికి తెలియకుండానే వ్యక్తిగత వివరాలను బహిర్గతం అవుతున్నట్టు ఎన్నో వివర్శలు వస్తూనే ఉన్నాయి. ఫేస్ బుక్ యూజర్లు తమ అకౌంట్లో పోస్టు చేసిన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలకు తప్పక సెక్యూరిటీతో పాటు ప్రైవసీ ఉండాలని కోరుకుంటారు. అందుకే.. తమ యూజర్ల డేటా ప్రైవసీ కోసం ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కొత్త టూల్ ప్రవేశపెట్టింది.

అదే.. గూగుల్ ఫొటోస్ టూల్. డేటా ట్రాన్స్ ఫర్ ప్రాజెక్టులో భాగంగా ఫేస్ బుక్ ఈ కొత్త టూల్ లాంచ్ చేసింది. దీని ద్వారా ఫేస్ బుక్ యూజర్లు తమ అకౌంట్లో Upload చేసిన ఫొటోలు, వీడియోలను Google Photosలోకి ఈజీగా ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. దీన్నే డేటా పోర్టబులిటీ అని కూడా అంటారు. ఈ సర్వీసు ముందుగా ఐర్లాండ్‌లో ప్రారంభం కానుంది. ఆ తర్వాత 2020లో ప్రపంచవ్యాప్తంగా సర్వీసును అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఫేస్ బుక్ కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

డేటా పోర్టబిలిటీ సాధ్యమేనా? :
భవిష్యత్తులో ‘డేటా పోర్టబులిటీ’తో ఇతర సర్వీసులను కూడా ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపింది. ఫేస్ బుక్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఓపెన్ రైట్స్ గ్రూపు (ORG) క్యాంపెయిన్ స్వాగతించింది. కానీ, దీనిపై టెక్ దిగ్గజాలన్నీ పూర్తి స్థాయిలో సర్వీసును విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడింది. ‘ఫేస్ బుక్ సహా ఇతర టెక్ కంపెనీలకు ఎంతో ముఖ్యమైనది. యూజర్లను డేటా ట్రాన్స్ ఫర్ చేసుకునేలా అనుమతించడం ఆమోదించదగిన విషయం’ అని ORG డైరెక్టర్ జిమ్ కిల్లాక్ చెప్పారు.

ప్రపంచ దిగ్గజాలకు ఈ తరహా డేటా పోర్టబిలిటీ సాధ్యపడే విషయం కాదన్నారు. ఒకవేళ ప్రస్తుత పోటీని ప్రోత్సహించే దిశగా సాగితే ఇదెంతో సమస్యాత్మకమైనదిగా మారే అవకాశం ఉందని చెప్పారు. ఇందులో ప్రైవసీపరంగా సమస్యలు కూడా సంభవిస్తాయని ఆయన చెబుతున్నారు. థర్డ్ పార్టీలకు తమ డేటాను ట్రాన్స్ ఫర్ చేయడం ద్వారా యూజర్లకు ప్రైవసీ సంబంధిత ముప్పు వాటిల్లే అవకాశం ఉందని చెప్పారు.

సెక్యూరిటీ రిస్క్ ఎక్కువే :
ఈ విషయంలో డేటా చోరీకి గురికాకుండా ఉండేలా కంపెనీలు, రెగ్యులేటర్లు ఎప్పటికప్పుడూ పర్యవేక్షించాలని, భద్రతపరమైన పరిష్కార మార్గాలతో సిద్ధంగా ఉండాలని చెప్పారు. గూగుల్ ఫొటో టూల్ లాంచ్ చేసినట్టు ఫేస్ బుక్ బ్లాగులో ప్రకటించింది.

ఈ టూల్ రూపొందించడానికి ఏడాది సమయం పట్టిందని, ఇందులో భద్రతపరమైన సమస్యలు కూడా లేకపోలేదని స్పష్టం చేసింది. ఆన్ లైన్ సర్వీసుల మధ్య డేటా ట్రాన్స్ ఫర్ చేసుకునేలా ప్రతిఒక్కరికి ఓపెన్ సోర్స్ ప్లాట్ ఫాం తీసుకురావడమే లక్ష్యంగా ఈ టూల్ తీసుకురావడం జరిగింది.

టెక్ దిగ్గజాలు ఆపిల్, సెర్చ్ ఇంజిన్ గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ భాగస్వామ్యంతో ఈ డేటా ట్రాన్స్ ఫర్ ప్రాజెక్టును ప్రారంభించాయి. ఫేస్ బుక్ 2010 నుంచి యూజర్ల డేటాను డౌన్ లోడ్ చేసుకునేందుకు అనుమతి ఇస్తోంది. 2018లో రాధిక సంఘానీ అనే జర్నలిస్టు తన ఫేస్ బుక్ అకౌంట్ నుంచి 12ఏళ్ల నాటి డేటా (324MB డేటా ఫైల్)ను డౌన్ లోడ్ చేశారు. ఈ ఫైల్ డౌన్ లోడ్ చేయడానికి 40 నిమిషాల సమయం పట్టిందని ఆమె చెప్పారు.

డేటా రిస్క్ ఇలా తగ్గించుకోవచ్చు  :
* బయటి సర్వీసుకు డేటాను బదిలీ చేసే ఏ మెకానిజంలోనైనా రిస్క్ ఉంటుంది.
* ఇలాంటి రిస్క్ లు తగ్గించడానికి కొన్ని చర్యలు తీసుకుంటున్నాం.
* అదనంగా అథెంటికేషన్ ఉండేలా సెట్ చేయాల్సిన అవసరం ఉంది.
* అకౌంట్ యూజర్ మాత్రమే తన డేటాను ట్రాన్స్ ఫర్ చేసేలా ఉండాలి.