కేంద్ర విద్యుత్ చట్టంలో లోపాలున్నాయి, మీటర్లకే వెయ్యి కోట్లు కావాలి, ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు

  • Published By: naveen ,Published On : September 15, 2020 / 02:06 PM IST
కేంద్ర విద్యుత్ చట్టంలో లోపాలున్నాయి, మీటర్లకే వెయ్యి కోట్లు కావాలి, ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు

కేంద్ర నూతన విద్యుత్ చట్టంపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో మాట్లాడిన సీఎం కేసీఆర్, కేంద్ర విద్యుత్ చట్టంలో అనేక లోపాలు ఉన్నాయని చెప్పారు. కేంద్రం ఇచ్చే ప్రైవేట్ విద్యుత్ ను కచ్చితంగా కొనుగోలు చేయాలని రాష్ట్రాలపై రుద్దుతున్నారని మండిపడ్డారు. కేంద్రం చెప్పినట్టు చేస్తే ప్రతి బోరు బావికి కరెంటు మీటర్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. మీటర్ రీడింగ్ తీసి బిల్లులు వసూలు చేయాల్సి ఉంటుందన్నారు. అలా చేయాలంటే విద్యుత్ మీటర్లకే దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కేసీఆర్ చెప్పారు.

విద్యుత్ ను సరిగా ఉపయోగించుకోవడం లేదని కేసీఆర్ అన్నారు. కేంద్రం తెచ్చిన ముసాయిదా చాలా ప్రమాదకరంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం విధానాల వల్ల ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడుతున్నాయని కేసీఆర్ వాపోయారు. ఎట్టి పరిస్థితుల్లో కొత్త విద్యుత్ చట్టాన్ని అంగీకరించేది లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. కేంద్రం తెచ్చిన విద్యుత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశారు..


వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలా? ఇదెక్కడి న్యాయం అని కేసీఆర్ కేంద్రాన్ని నిలదీశారు. కొత్త విద్యుత్ చట్టంపై బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. కేంద్రం చెప్పేదొకటి, చేసేదొకటి అని కేసీఆర్ మండిపడ్డారు. పవర్ ప్రాజెక్టులు మూతపడుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఒక్క మెగావాట్ కూడా ప్రైవేట్ కు ఇవ్వడం లేదని కేసీఆర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాల హక్కులను కాలరాస్తూనే ఉన్నాయని అన్నారు. రాష్ట్రాల స్వయంప్రత్తిపత్తిని కాలరాస్తున్నారని సీరియస్ అయ్యారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, కరెంటు బిల్లుల ప్రభావం ప్రజలపై పడనీయం అని కేసీఆర్ హామీ ఇచ్చారు.

కరెంటుని వినియోగించుకోవడంలోనే కాదు నీటిని వినియోగించుకోవడంలోనూ కేంద్ర ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని కేసీఆర్ చెప్పారు. దేశంలో 70వేల టీఎంసీల నీరు ఉన్నా.. చెన్నై నగరం తాగునీటి సమస్య ఎదుర్కోంటోందని వాపోయారు. చెన్నై వంటి నగరం బకెట్ నీటి కోసం ఎందుకు ఎదురు చూస్తోందని ప్రశ్నించారు. దేశం మొత్తం 40వేల టీఎంసీలు వాడినా, ఇంకా 30వేల టీఎంసీల నీరు ఉటుందన్నారు. అయినా నీటి సమస్యలు ఎందుకు వస్తున్నాయని అడిగారు. నీటి వనరులు ఉన్నా కేంద్ర ప్రభుత్వాలు సరిగా సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు కేసీఆర్.