Komatireddy Rajagopal Reddy : ఇండియా కూటమికి ఫండ్ ఇస్తా తనను ప్రధానిని చేయమని కేసీఆర్ ఆఫర్ ఇచ్చారు : కోమటిరెడ్డి రాజగోపాల్
బీఆర్ఎస్ కు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను గద్దె దించటానికి తాను దేనికైనా సిద్ధమన్నారు. ప్రాణం పోయినా పదవి కోసం డబ్బులకు అమ్ముడుపోను అని అన్నారు.

Komatireddy Rajagopal Reddy Comments on CM KCR
Komatireddy Rajagopal Reddy on CM KCR: తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆయా పార్టీల్లో నేతలు వేరే పార్టీల్లోకి మారిపోతున్నారు. దీంతో తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. సీనియర్ నేతలు సైతం జంప్ కావటంతో ఆయా పార్టీలకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఏపార్టీలో ఏ నేత ఎప్పుడు కండువా మార్చేసుకుంటాడోనని ఆందోళన దాదాపు అన్ని పార్టీల్లోనూ ఉంది. ఈ జంపింగ్ లో భాగంగా బీజేపీకి షాకిస్తూ తిరిగి సొంత గూటికి చేరుకున్నారు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో గురువారం రాత్రి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ అభ్యర్దుల రెండో జాబితా కోసం సమావేశంలో మల్లికార్జున ఖర్గే బిజీగా ఉండటంతో రాజగోపాల్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో పార్టీలో చేరారు. ఈరోజు మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా మరోసారి కండువా కప్పించుకోనున్నారు. దీని కోసం ఆయన ఢిల్లీలోనే ఉండిపోయారు. పార్టీ మార్పువెనుక అసలు కారణం ఏమిటని మీడియా ప్రశ్నించగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ కు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను గద్దె దించటానికి తాను దేనికైనా సిద్ధమన్నారు. ఆరోజు కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరినా.. ఈరోజు బీజేపీని వీడి తిరిగి కాంగ్రెస్ లో చేరినా కేసీఆర్ ను గద్దె దింపటానికి మాత్రమే తప్ప పదవుల కోసం కాదని తెలిపారు. ప్రాణం పోయినా పదవి కోసం డబ్బులకు అమ్ముడుపోనని అన్నారు.
Also Read : కాంగ్రెస్ రద్దుల పార్టీ .. అందుకే రైతుబంధు నిలిపివేయాలని ఫిర్యాదు : మంత్రి జగదీష్ రెడ్డి
ఈ సందర్భంగా రాజగోపాల్ మరో సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. సీఎం కేసీఆర్ ఇండియా కూటమికి ఆఫర్ ఇచ్చారని.. తనను ప్రధానికి చేస్తే ఇండియా కూటమికి భారీగా నిధులు ఇస్తానని చెప్పినట్టు వెల్లడించారు. కేసీఆర్ ఆఫర్ ను ఇండియా కూటమి తిరస్కరించిందని తెలిపారు. అవినీతితో కుప్పలుగా పోగేసిన డబ్బుతో ఇండియా కూటమికి కేసీఆర్ ఆఫర్ ఇచ్చినా ఆ కూటమి తిరస్కరించిందంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించటం ఖాయమని ధీమా వ్యక్తంచేసిన రాజగోపాల్.. సర్వేలన్ని ఇదే మాట చెబుతున్నాయని అన్నారు.
కేసీఆర్ గత మునుగోడు ఎన్నికల్లో కోట్లాది రూపాయలు పంచి, అధికార బలాన్ని దుర్వినియోగం చేసి తనను ఓడించారని ఆరోపించారు. కమ్యూనిస్టులతో పొత్తులు పెట్టుకుని కోట్లాది రూపాయలు పంచి తనను ఓడించారంటూ ఆరోపించారు. ఈసారి కాంగ్రెస్ గెలుపుతో కేసీఆర్ గద్దె దిగటం, కల్వకుంట్ల కుటుంబ పాలన అంతం కావటం తథ్యం అంటూ ధీమా వ్యక్తంచేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.