Kotha Prabhakar Reddy : త్వరగా కోలుకోవడం కష్టం.. కొత్త ప్రభాకర్ రెడ్డి కత్తి పోటు గాయం తీవ్రతపై డాక్టర్ల స్పందన

కొత్త ప్రభాకర్ రెడ్డి పూర్తి కోలుకుంటున్నారో లేదో 4 రోజుల తర్వాత చెప్పగలమని డాక్టర్ విజయ్ కుమార్ స్పష్టం చేశారు. 4 రోజుల తర్వాత ఆయనను వార్డుకి షిఫ్ట్ చేస్తామన్నారు. Kotha Prabhakar Reddy

Kotha Prabhakar Reddy : త్వరగా కోలుకోవడం కష్టం.. కొత్త ప్రభాకర్ రెడ్డి కత్తి పోటు గాయం తీవ్రతపై డాక్టర్ల స్పందన

Kotha Prabhakar Reddy Health Bulletin

Updated On : October 30, 2023 / 10:53 PM IST

Kotha Prabhakar Reddy Health Bulletin : బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి యశోదా ఆసుపత్రి సికింద్రాబాద్ హెడ్ డాక్టర్ విజయ్ కుమార్ స్పందించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి కత్తిగాటుతో ఆసుపత్రికి వచ్చారని, గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమికంగా కుట్లు వేసి ఆయనను ఆసుపత్రికి తరలించారని డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. డాక్టర్ ప్రసాద్ బాబు, వినీత్ వైద్యుల టీం ఆయనకు చికిత్స అందించారని వెల్లడించారు.

కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంటెస్టైన్ కి గాయం ఉందని, 3 గంటలు శస్త్ర చికిత్స చేశామని వివరించారు. లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స చేయడం కష్టం అని గుర్తించామన్నారు. రెండు పేగులు కలిపి 4 చోట్ల గాయమైందన్నారు. చిన్న పేగులో 15 సెంటీమీటర్ వరకు తొలగించామన్నారు. ఈ తరహా శస్త్రచికిత్స జరిగినప్పుడు రోగి త్వరగా కోలుకోవడం కష్టం అని చెప్పారు. ఎప్పటికప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం గురించి తెలియజేస్తామన్నారు.

మెడికో లీగల్ కేస్ కాబట్టి అన్ని శాంపిల్స్ సేకరించి ఉంచామన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి పూర్తి కోలుకుంటున్నారో లేదో 4 రోజుల తర్వాత చెప్పగలమని డాక్టర్ విజయ్ కుమార్ స్పష్టం చేశారు. 4 రోజుల తర్వాత ఆయనను వార్డుకి షిఫ్ట్ చేస్తామన్నారు. ప్రభాకర్ రెడ్డికి హైపర్ టెన్షన్ ఉందని తెలిపారు.

”కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం 4 రోజులు క్రిటికల్ కండీషనే. ఎమర్జెన్సీ వార్డులో ఆయనకు చికిత్స అందిస్తున్నాం. సరైన సమయానికి ఆసుపత్రికి రావడం వల్లే ఆయనకు ప్రాణాపాయం తప్పింది. మూడున్నర గంటల పాటు ఆపరేషన్ జరిగింది. 100 మంది సిబ్బంది వైద్యం అందించాము.  క్లిష్టతరమైన లాప్రాటమీ సర్జరీ చేశాం. క్లిష్టతరమైన ఆపరేషన్ చేశాం. 4 గాయాలు ఉండటం వల్లే చిన్నపేగుని కత్తిరించాల్సి వచ్చింది. 4 రోజుల పాటు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందించాలి. సర్జికల్ స్పెషలిస్టులు ఆయనను కంటికి రెప్పలా చూసుకోవాలి. అప్పుడే నెక్ట్స్ లెవల్ ఆఫ్ ఇన్ ఫెక్షన్ కు వెళ్లకుండా కొత్త ప్రభాకర్ రెడ్డి కోలుకునే అవకాశాలు ఉన్నాయి.

కత్తికి ఉన్న తుప్పు, పాయిజన్ లాంటి లక్షణాలు రాబోయే నాలుగు రోజుల్లో కనిపిస్తాయి. అందుకే, ఆపరేషన్ చేశాము. పేషెంట్ కు బాగైపోయింది అని చెప్పడానికి లేదు. ఆయనను బాగా అబ్జర్వ్ చేయాలి. 4 నుంచి 5 రోజుల పాటు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచాలి. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని తేలితే అప్పుడు వార్డుకి షిఫ్ట్ చేస్తాం. త్వరితగతిన ప్రభాకర్ రెడ్డిని ఆసుపత్రికి తీసుకొచ్చారు. లోపల ఇంకా ఇన్ఫెక్షన్ ప్రబల లేదు. హోల్స్ పడిన చిన్నపేగుని రిమూవ్ చేసి జాయింట్ వేయగలిగాము.

ఆయనను ఆసుపత్రికి తీసుకురావడం ఆలస్యమై ఉంటే జాయింట్ వేయలేని పరిస్థితి ఉండేది. రక్తస్రావాన్ని కూడా ఆపగలిగాము. రాబోయే 3-4 నాలుగు పేషెంట్ కండీషన్ ని క్రిటికల్ గా నే భావిస్తాము. 8 నుంచి 10 రోజుల వరకు ఆయన ఆసుపత్రిలో ఉండే ఆస్కారం ఉంది. చాలా మంది డాక్టర్లు శ్రమించారు. 50 నుంచి 100 మంది టీమ్ గా ఏర్పడి త్వరితగతిన చికిత్స అందేలా కృషి చేశారు అని” సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి డాక్టర్ల బృందం తెలిపింది.