Vijayashanti: కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకోవడంలో బీజేపీ విఫలం.. రగిలిపోతున్న విజయశాంతి!

కేసీఆర్ కుటుంబంపై అనేక ఆరోపణలు చేసిన బీజేపీ జాతీయ నాయకత్వం చర్యలు తీసుకోవడంలో మాత్రం విఫలమవుతోందని అంతర్గత సమావేశాల్లో రగిలిపోతున్నారు విజయశాంతి.

Vijayashanti: కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకోవడంలో బీజేపీ విఫలం.. రగిలిపోతున్న విజయశాంతి!

vijayashanti unhappy on bjp high command

Vijayashanti dissatisfaction : ఆమె నిరసన కార్యక్రమాల కమిటీ చైర్‌పర్సన్‌.. పార్టీ తరఫున నిరసన కార్యక్రమాలకు నేతృత్వం వహించడం ఆ మహిళా నేత డ్యూటీ.. ఐతే ఆ నేత ఎలా అర్థం చేసుకున్నారో కానీ.. పార్టీపైనే నిరసనలకు దిగుతున్నారు. సీనియర్‌ నేతగా ఇతర నాయకులకు సర్దిచెప్పాల్సిన లీడర్‌ స్వయంగా సెటైర్లు వేస్తున్నారు. రకరకాల ట్వీట్లుతో పార్టీకి చికాకు పెడుతున్నారు. బీజేపీకి కంట్లో నలుసులా ఇబ్బంది పెడుతున్న ఆ మహిళా నేత విజయశాంతి.. తెలంగాణ బీజేపీ నిరసనల కమిటీ చైర్మన్‌ విజయశాంతి రూటే సెపరేటా..?

తెలంగాణ ఫైర్ బ్రాండ్ విజయశాంతి గత కొంతకాలంగా బీజేపీ తీరుపై అసంతృప్తిగా కనిపిస్తున్నారు. బీజేపీలో తనకు సముచిత స్థానం ఇవ్వలేదని, తన శక్తి సామర్థ్యాలను కమలదళం సరైన విధంగా వినియోగించుకోవడం లేదని గత కొంతకాలంగా గుర్రుగా ఉన్నారు విజయశాంతి. తనను ఏ బహిరంగ సభలకు ఆహ్వానించడం లేదని.. ఆహ్వానించినా మాట్లాడనివ్వడం లేదనేది విజయశాంతి ప్రధాన ఆరోపణ. దీనికితోడు కేసీఆర్ కుటుంబంపై అనేక ఆరోపణలు చేసిన బీజేపీ జాతీయ నాయకత్వం చర్యలు తీసుకోవడంలో మాత్రం విఫలమవుతోందని అంతర్గత సమావేశాల్లో రగిలిపోతున్నారు విజయశాంతి. ఇటీవల కొంతమంది బీజేపీ నేతలు నిర్వహించిన రహస్య సమావేశాల్లో కీరోల్‌ పోషించారు విజయశాంతి. ఒక దశలో రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, వివేక్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితర నేతలు పార్టీ వీడతారన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత పార్టీ పెద్దలు రంగంలోకి దిగి సీనియర్లు అందరికీ నచ్చజెప్పడంతో కాస్త శాంతించారు. విజయశాంతి మాత్రం ఇంకా నిరసనలు వ్యక్తం చేస్తూ అగ్గి రాజేస్తూనే ఉన్నారు.

ఈ నెలలో రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ వద్దే తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు కొందరు బీజేపీ నేతలు. రహస్యంగా భేటీ అవుతూ రాష్ట్ర నాయకత్వంపై ఫిర్యాదు చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఐతే ఈ విషయం తెలియడంతో రంగంలోకి దిగిన జాతీయ నేతలు పార్టీలో అసంతృప్తిగా ఉన్న రాష్ట్ర నేతలను బుజ్జగించారు. అందరికీ తగిన గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే వివేక్ , కొండా విశ్వేశ్వర్ రెడ్డిలకు మేనిఫెస్టో కమిటీలో స్థానం కల్పించగా.. రాజగోపాల్ రెడ్డికి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ బాధ్యతలను అప్పగించారు.

Also Read: సిగ్గుండాలి.. పార్టీని దెబ్బతీసేందుకే రాజీనామా- పొన్నాల లక్ష్మయ్యపై రేవంత్ రెడ్డి ఫైర్

వీరితోపాటు అసమ్మతి రాగం వినిపిస్తున్న విజయశాంతికి నిరసనల కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. వారివారికి కల్పించిన బాధ్యతల్లో సంతృప్తి చెందిన నేతలు తమ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. విజయశాంతి మాత్రం పార్టీపైనే నిరసనలకు దిగుతుండటం హాట్‌టాపిక్‌ అవుతోంది. ఇటీవల ఆమె సోషల్ మీడియా పోస్ట్‌ల్లో సైతం మార్పు కనిపిస్తోంది. తాను బీజేపీలో ఉన్నానని చెప్పడానికి సంకేతంగా హరహర మహాదేవ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. తాజాగా విజయశాంతి చేస్తున్న పోస్టింగ్‌ల్లో ఆ పదం ఎక్కడా కనిపించడం లేదు.

Also Read: కేసీఆర్, హరీశ్‌, కేటీఆర్ లక్ష్యంగా.. బీజేపీ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!

అదేవిధంగా రాష్ట్ర పర్యటనలకు వస్తున్న జాతీయ నేత కార్యక్రమాలలో విజయశాంతి కనిపించడం లేదు. ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 1, 3 తేదీల్లో రెండు సార్లు రాష్ట్రానికి వచ్చిన విజయశాంతి జాడే లేకుండాపోయారు. బీజేపీ స్టేట్ కౌన్సిల్ సమావేశానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వచ్చిన సందర్భంగా రాజగోపాల్ రెడ్డితో కలిసి వచ్చి కొద్ది సేపు భేటీ అయి వెళ్లిపోయారు విజయశాంతి. రెండు రోజుల క్రితం హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలోనూ విజయ శాంతి ఎక్కడా కనిపించలేదు.

Also Read: కాంగ్రెస్‌కు ఎన్‌ఆర్‌ఐ కష్టం.. ఝాన్సీరెడ్డికి ఆదిలోనే అడ్డంకులు

దీనికితోడు పార్టీ నిర్వహించే ఎన్నికల సన్నాహక సమావేశాలకు డుమ్మాకొడుతున్నారు విజయశాంతి. దీంతో ఆమె పార్టీలో ఉన్నట్టా లేనట్టా అనే చర్చ నడుస్తోంది. దీనికితోడు విజయశాంతి సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు ఆ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తున్నాయి. కేసీఆర్ ఓటమి తథ్యం అంటూ పోస్టులు పెడుతున్న విజయశాంతి బీజేపీకి మద్దతుగా ఎక్కడా మాట్లాడటం కానీ సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు కానీ చేయకపోవడం చర్చనీయాంశమవుతోంది. విజయశాంతి వ్యవహారశైలిని గమనిస్తున్న పరిశీలకులు.. బీజేపీ ఆమెకు తగిన పదవే ఇచ్చిందని సెటైర్లు వేస్తున్నారు.