Goat And Sheep Farming : వ్యాపార సరళిలో జీవాల పెంపకంతో మెరుగైన జీవనోపాధి !
గొర్రెలు లేదా మేకల్లో పునరుత్పత్తి యాజమాన్యంపైనే మంద అభివృద్ధి ఆధారపడి వుంటుంది. సాధారణంగా గొర్రె ఒక పిల్లను ఇస్తే, మేక 2 పిల్లలు ఇస్తుంది. ప్రతి 8 నెలలకు ఒక ఈత చొప్పున అంటే 2 సంవత్సరాలకు జీవాలు 3 ఈతలు ఈనాలి. ఏ మాత్రం ఆలస్యమైన ఖర్చులు పెరిగిపోయి రైతుకు నష్టాలు తప్పవు.

Goat and Sheep Farming
Goat And Sheep Farming : తెలుగు రాష్ట్రాల్లో గొర్రెలు, మేకల పెంపకం దినాదినాభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు సంచారజాతుల వారికే పరిమితమైన వీటి పెంపకాన్ని, ఇప్పుడు నిరుద్యోగ యువకులు కూడా చేపడుతున్నారు. వాణిజ్య సరళిలో పెంచి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. గొర్రెలను స్టాల్ ఫీడింగ్ పద్ధతిలో అంటే పూర్తిగా సాంద్ర పద్ధతిలోను, మేకలను పాక్షిక సాంద్ర పద్ధతిలో అంటే అటు షెడ్లలోను పెంచితే మంచి ఫలితాలు వస్తాయని, క్షేత్ర స్థాయి అనుభవాలు రుజువుచేస్తున్నాయి. అయితే ప్రాంతానికి అనుగుణంగా అధిక మాంసోత్పత్తినిచ్చే జాతుల ఎంపిక అనేది చాలా కీలకం. పోషణలో రాజీ లేకుండా పరిశ్రమను కొనసాగించాలి. జీవాల పెంపకం వివరాల గురించి కృష్ణాజిల్లా గన్నవరం పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. వెంకట శేషయ్య ద్వారా తెలుసుకుందాం.
వ్యవసాయ అనుబంధ రంగాల్లో వాణిజ్యసరళిలో దినదినాభివృద్ధి చెందుతున్న పరిశ్రమ జీవాల పెంపకం. ఒకప్పుడు విస్తృత పద్ధతిలో ఆరుబయట పొలాలు, పచ్చిక బీళ్లలో వీటిని మేప విధానం వుండేది. కానీ ఇప్పుడు పచ్చికబీళ్లు తగ్గిపోవటం, వ్యవసాయం వ్యాపారంగా మారిపోవటంతో, శివారు భూముల్లో తప్ప, ఇప్పుడు ఆ అవకాశాలు లేవు. దీంతో దేశంలో జీవాల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. డిమాండ్ మాత్రం నానాటికీ పెరుగుతోంది. 2000 సంవత్సరంలో కిలో 80 రూపాయలున్న మటన్ ధర, 19 సం.ల కాలంలో ప్రస్థుతం 600రూపాయలకు చేరుకుంది.
READ ALSO : Sheep And Goats : గొర్రెలు, మేకల్లో హిమాంకోసిస్ వ్యాధి
ఏటా ధరల్లో గణనీయమైన వృద్ధి వుండటంతో ఈ పరిశ్రమలోని లాభదాయకతను దృష్టిలో వుంచుకుని ఇటీవలికాలంలో కొంతమంది రైతులు వాణిజ్యసరళిలో జీవాల పెంపకానికి ముందడుగు వేస్తున్నారు. అయితే ఈ రంగంలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించినప్పుడే ఆశించిన ఫలితాలు పొందే వీలుంది. ముఖ్యంగా జాతుల ఎంపిక, పోషణ యాజమాన్యం, ఆరోగ్య సంరక్షణ, పునరుత్పత్తిపై ప్రత్యేక శ్రద్ద, ఈ పరిశ్రమను విజయబాటలో నడిపిస్తాయని కృష్ణా జిల్లా, గన్నవరం పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. వెంకట శేషయ్య చెబుతున్నారు.
గొర్రెలు లేదా మేకల్లో పునరుత్పత్తి యాజమాన్యంపైనే మంద అభివృద్ధి ఆధారపడి వుంటుంది. సాధారణంగా గొర్రె ఒక పిల్లను ఇస్తే, మేక 2 పిల్లలు ఇస్తుంది. ప్రతి 8 నెలలకు ఒక ఈత చొప్పున అంటే 2 సంవత్సరాలకు జీవాలు 3 ఈతలు ఈనాలి. ఏ మాత్రం ఆలస్యమైన ఖర్చులు పెరిగిపోయి రైతుకు నష్టాలు తప్పవు. గొర్రెలు మేకల పెంపకంలో ప్రతి రైతు ముందుగా తల్లులను అభివృద్ధి చేసుకుని, వీటి సంతానంతో మంద వృద్ధి చెందాక అమ్మకం ప్రారంభిస్తే, పరిశ్రమలో రిస్కు తగ్గి మున్ముందు మంచి ఫలితాలు సాధించే వీలుంది.
అయితే ప్రతి 100 జీవాలకు 3 ఎకరాల పొలాన్ని పశుగ్రాసం కోసం కేటాయించాల్సి వుంటుంది. సాధారణంగా 100 జీవాలు పెంచే రైతు, ఏటా లక్షన్నర నుంచి రెండు లక్షల నికర లాభం సాధిస్తున్నారు. వనరుల అందుబాటునుబట్టి జీవాల సంఖ్యను నిర్ణయించుకుని భారీ ఎత్తున కాకుండా, కొద్ది సంఖ్యతో ప్రారంభించి, అనుభవం వచ్చాక క్రమేపి సంఖ్యను పెంచుకుంటే ఆశించిన ఫలితాలు పొందవచ్చు.