Green Gram Cultivation : వరిమాగాణుల్లో పెసర సాగు యాజమాన్యం – తక్కువ ఖర్చు, శ్రమతో మెరుగైన ఫలితాలు
Green Gram Cultivation : వరి మాగాణుల్లో మినుము సాగు ఆలస్యమైనప్పుడు పెసర చక్కటి ప్రత్యామ్నాయం. అయితే ఏటా పల్లాకు తెగులు ఉధృతి ఎక్కువగా వుండటంతో ఫలితాలు నామమాత్రంగా వుంటున్నాయి.

Green Gram Cultivation
Green Gram Cultivation : తక్కువ కాలంలో పంట చేతికి వచ్చే అపరాలలో పెసర ముఖ్యమైనది. ఈ పంట సాగుతో భూసారం పెరగడంతోపాటు తరువాత వేసే పంటకు మంచి మాంసకృతులు, నత్రజని లభిస్తుంది. ప్రస్తుతం వరి మాగాణుల్లో ఈ పంటను విత్తేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.
వరి మాగాణుల్లో మినుము సాగు ఆలస్యమైనప్పుడు పెసర చక్కటి ప్రత్యామ్నాయం. అయితే ఏటా పల్లాకు తెగులు ఉధృతి ఎక్కువగా వుండటంతో ఫలితాలు నామమాత్రంగా వుంటున్నాయి. ఈ సమస్యను అధిగమించే దిశగా, పల్లాకు తెగులును తట్టుకునే పెసర రకాలు, సాగులో పాటించాల్సిన యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వరి మాగాణుల్లో పెసర సాగు, తక్కువ ఖర్చుతో స్వల్ప కాలంలోనే మంచి ఫలితాలను పొందవచ్చు. గత ఏడాది కొంతమంది రైతులు ఎకరాకు 6 నుంచి 10క్వింటాళ్ల దిగుబడిని నమోదుచేసి ఆర్ధికంగా సత్ఫలితాలు సాధించారు.
ఏటా ఖరీఫ్ లో వరి నాట్లు ఆలస్యమవుతున్న నేపధ్యంలో మినుముకు ప్రత్యామ్నాయంగా పెసర పంట అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. అయితే చాలామంది రైతులు ఇంకా వైరస్ తెగులును తట్టుకోని పాత రకాలనే సాగుచేయటం వల్ల నష్టాలను ఎదుర్కుంటున్నారు. ఈ నేపధ్యంలో మేలైన పెసర రకాలు, సాగు యాజమాన్యం గురించి తెలుసుకుందాం..
ఎల్.జి.జి – 407 రకం పంటకాలం 65 నుంచి 70రోజులు. మొక్కలు నిటారుగా పెరిగి కాయలు మొక్క పైభాగాన కాస్తాయి. గింజలు మెరుస్తూ మధ్యస్థ లావుగా వుంటాయి. కొంత వరకు బెట్టను కూడా తట్టుకునే ఈ రకం, పల్లాకు తెగులుతోపాటు ఆకుమచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది. ఎల్.జి.జి- నాలుగువందల అరవై రకంలో కాపు గుత్తులు గుత్తులుగా మొక్క పైభాగన వుండి కోయడానికి సులభంగా వుంటుంది.
ఒకేసారి కోతనిచ్చే ఈ రకం పల్లాకు తెగులుతోపాటు మొవ్వుకుళ్లును కూడా కొంత వరకు తట్టుకుంటుంది. దీని పంటకాలం 65 నుండి 70 రోజులు. టి.ఎమ్-తొంభైఆరు డాష్ రెండు రకం అధిక తేమను కూడా తట్టుకుంటుంది. గింజలు లావుగా మెరుస్తూ వుంటాయి. దీని పంటకాలం కూడా 60 నుంచి 65రోజులుగా వుంది.
కిలో విత్తనానికి 5 గ్రా. ఇమిడాక్లోప్రిడ్ లేదా 5 గ్రా. థయోమిథాక్సామ్ లేదా 5 మి.లీ. మోనోక్రోటోఫాస్ ను కలిపి విత్తనశుద్ధి చేయాలి. దీంతో 15 – 20 రోజుల వరకు రసం పీల్చు పురుగుల బారి నుండి పంటను రక్షించుకోవచ్చు. ఖరీఫ్ వరి అడుగుల్లో విత్తనం చల్లిన తరువాత కలుపును గమనించినట్లైతే 21 – 28 రోజుల మధ్య ఫినాక్సిప్రాప్ ఇథైల్ 250 మి.లీ. లేదా సైహలోఫాప్ బ్యూటైల్ 300 మి.లీ. లేదా సోడియం ఎసిఫ్లోర్ ఫెన్ + క్లోడినాఫాప్ ప్రొపార్జిజ్ 400 మి.లీ, 200 లీటర్ల నీటిలో కలిపి పిచకారి చేయాలి. చిప్పెర గడ్డి మరియు గడ్డిజాతి కలుపు నివారణకు ఎకరాకు ఇమాజితాఫిర్ 250 మి.లీ, 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. విత్తిన 25 రోజు వరకు పైరులో కలుపు లేకుండా చూడాలి.
సాధారణంగా వరి మాగాణుల్లో సాగుచేసే పెసర పంటకు నీటితడుల అవసరం వుండదు. కానీ బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు ఒకటి రెండు తడులు ఇచ్చినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. ఈ విధంగా పెసరలో మేలైన యాజమాన్య పద్ధతుల పట్ల రైతులు తగిన శ్రద్ధ పెట్టి, చీడపీడల నివారణ పట్ల కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎకరాకు 6 నుంచి 10క్వింటాళ్ల దిగుబడిని సాధించే వీలుంది. ప్రస్థుతం పెసర ధర క్వింటా 4 వేల నుంచి 5 వేల మధ్య వుంది. తక్కువ ఖర్చు, శ్రమతో వరి సాగుకంటే మెరుగైన ఫలితాలు ఈ పంటలో నమోదవుతున్నాయి.
Read Also : Chilies Pest : మిర్చితోటల్లో తామర పురుగు నివారణ చర్యలు