Rabi Ullinaru Cultivation : రబీ ఉల్లి సాగుకు సిద్దమవుతున్న రైతులు – నారుమడుల పెంపకంలో చేపట్టాల్సిన యాజమాన్యం

Rabi Ullinaru Cultivation : ఉల్లిని రబీపంట కాలంలో నవంబరు-డిసెంబరు నుండి ఏప్రిల్ మాసం వరకు నాటతారు. సాధారణంగా నారుమళ్లను నీటివసతి వున్న ప్రాంతాల్లో పెంచటం జరుగుతుంది.

Rabi Ullinaru Cultivation : రబీ ఉల్లి సాగుకు సిద్దమవుతున్న రైతులు – నారుమడుల పెంపకంలో చేపట్టాల్సిన యాజమాన్యం

Ownership of Rabi Ullinaru Cultivation

Updated On : October 9, 2024 / 2:37 PM IST

Rabi Ullinaru Cultivation : ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ప్రభుత్వాలను సైతం గడగడలాడించిన చరిత్ర ఉల్లిది. అలాంటి ఉల్లి మనప్రాంతంలో సుమారుగా 70వేల హెక్టార్లలో సాగుచేయబడుతోంది. ఉల్లిని ఖరీఫ్, రబీ, వేసవి…ఇలా మూడు కాలాల్లోనూ సాగుచేస్తున్నా..  రబీపంట మంచి నాణ్యతతో, అధిక దిగుబడులనిస్తుంది. మరి రబీ ఉల్లిసాగుకు సమాయత్తమవుతున్న రైతులు మొదట శ్రద్ధ పెట్టాల్సింది నారుమళ్ళ పెంపకంపైన. ఉల్లిలో నాణ్యమైన నారుకోసం ఎలాంటి మెలకువలు పాటించాలో చూద్దామా..

Read Also : Agri Tips : అంతరపంటలతో అధిక లాభాలు పొందుతున్న మాలి గిరిజనులు

ఉల్లి గుండెజబ్బులకి దివ్యఔషధం. మనశరీరంలోని కొలెస్ట్రాల్‌ని తగ్గించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. కంటికి, జ్ఞాపకశక్తికి, జీర్ణక్రియకు ఉపయోగపడే ఉల్లి… మన దినసరి ఆహారపు అలవాట్లలో భాగమైంది. అందుకే తల్లిచేయని మేలు ఉల్లిచేస్తుందంటారు. ఉల్లిని రబీపంట కాలంలో నవంబరు-డిసెంబరు నుండి ఏప్రిల్ మాసం వరకు నాటతారు. సాధారణంగా నారుమళ్లను నీటివసతి వున్న ప్రాంతాల్లో పెంచటం జరుగుతుంది. నాణ్యమైన నారు, అధిక దిగుబడులకు మూలం కాబట్టి సాంప్రదాయ పద్ధతులకు తోడుగా శాస్త్రీయతను జోడించి తగిన మెళకువలు పాటించినట్లైతే, మంచి ఆరోగ్యవంతమైన నారు పొందే అవకాశం వుంటుంది.

ఉల్లిలో బళ్ళారి రెడ్, రాంపూర్ రెడ్, నాసిక్ రెడ్, అగ్రిఫౌండ్ డార్క్ రెడ్, అగ్రిఫౌండ్ లైట్‌ రెడ్, పూసారెడ్, అర్క నికేతన్, అర్క కళ్యాణ్, అర్క ప్రగతి… వంటి రకాలు అవుకూలంగా వుంటాయి. ఎకరా పొలంలో విత్తుకోవటానికి 3నుంచి 4కిలోల విత్తనం సరిపోతుంది. నారు పెంపకానికి ఎత్తైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. కొందరు రైతులు సనాతన పద్ధతులైన సమతల మళ్ళలో నారుపెంచుతున్నారు. ఇలా పెంచటం వల్ల మురుగునీరు పోయే వసతి లేకపోవటంతో నారుకుళ్ళు సోకి చివరకు సరిపడ నారు లేక ఇబ్బందిపడుతున్నారు.

ఈ సమస్యను అధిగమించటానికి ఎత్తైన నారుమళ్ళలో నారు పెంపకం చక్కటి పరిష్కారాన్ని చూపెడుతోంది. ఎంచుకున్న పొలాన్ని 3,4సార్లు బాగా దుక్కి దున్నుకోవాలి. ఒక్కోనారుమడి 1మీటరు వెడల్పు, 3మీటర్ల పొడవు, 15సెంటీమీటర్ల ఎత్తు వుండే విధంగా ఎత్తు మళ్ళను చేసుకుని, 2మడుల మధ్య 1అడుగు దూరం వుంచుకోవాలి. ఇలా వుంచటం వల్ల నారుమడుల మధ్య నడుస్తూ సస్యరక్షణా చర్యలు చేపట్టటానికి అనువుగా వుంటుంది.ఈవిధంగా ఎకరాకు  200నుంచి 250చదరపు మీటర్ల  స్థలంలో పెంచిన నారు సరిపోతుంది. రైతులు 50శాతం నీడనిచ్చే షేడ్ నెట్ లను ఉపయోగించినట్లయితే మొలకశాతం బాగుండి,నాణ్యమైన నారును పొందవచ్చు.

ముందుగా కిలో విత్తనానికి 8గ్రాముల ట్రైకోడెర్మావిరడి కలిపి శుద్ధి చేయాలి. లేదా 3గ్రాముల థైరమ్ లేదా కాప్టాన్ కూడా ఉపయోగించి విత్తనశుద్ధి చేసుకోవచ్చు. ముందుగా నారుమళ్ళపై సన్నని గీతలు చేసుకుని,వరుసల్లో పలుచగా విత్తనాలను వేసుకుని తిరిగి మట్టితో కప్పుకోవాలి. నారుకుళ్ళు తెగులు నుంచి పైరును కాపాడుకోవటానికి 10రోజులకొకసారి లీటరు నీటికి 3గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి మళ్ళను బాగా తడుపుకోవాలి.ఉల్లికి మరొక ప్రధానసమస్య-రసం పీల్చు పురుగులైన తామరపురుగులు.వీటి బెడద నారుమళ్లలోనే కాక నాటిన తొలిదశలో కూడా పంటను ఆశించి నష్టపరుస్తాయి.ఇవి ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చటం వలన తెల్లని మచ్చలు ఏర్పడుతాయి. దీనినే మజ్జిగతెగులు అని కూడా పిలుస్తారు.దీని నివారణకు లీటరు నీటికి 2మిల్లీ లీటర్ల డైమిథోయేట్ కలిపి పిచికారీ చేసుకోవాలి.

ప్రధానపొలాన్ని 3,4సార్లు బాగా దున్ని చదును చేసుకోవాలి. 30సెంటీమీటర్ల ఎడంతో బోదెలు చేసుకుని ఇరువైపులా నాటుకోవాలి. నాటేముందు నారును 1శాతం బోర్డోమిశ్రమంలో ముంచి నాటడం వల్ల భూమి నుంచి ఆశించే తెగుళ్ల నుంచి పంటను కాపాడవచ్చు. ఆఖరి దుక్కిలో ఎకరాకు 10టన్నులు బాగా చివికిన పశువుల ఎరువుతోపాటు 24కిలోల భాస్వరం ఎరువును వేసి కలియదున్నుకోవాలి.60నుంచి80కిలోల నత్రజని, 24కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను 2సమభాగాలుగా చేసుకుని నాటేటపుడు ఒకసారి, నాటిన 30రోజులకు 2వసారి వేసి, నీటితడి ఇచ్చినట్లయితే గడ్డలు బాగా ఊరుతాయి.

అలాగే కలుపు నివారణలో భాగంగా నాటిన వెంటనే భూమిలో తగినంత తేమ వున్నప్పుడు ఎకరాకు 1.3లీటర్ల నుంచి 1.6లీటర్ల వరకు పెండిమిథాలిన్ లేదా 200మిల్లీలీటర్ల ఆక్సీఫ్లోరోఫిన్ 200లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే కలుపును నివారించవచ్చు. విత్తిన 30,45రోజుల దశలో ఒకసారి కలుపు తీయించి, మొదళ్లకు మట్టిని ఎగదోసినట్లయితే గడ్డలు దృఢంగా ఊరి, నాణ్యమైన దిగుబడులను పొందవచ్చు.

Read Also : Agri Tips : ఖరీఫ్‌కు అనువైన.. స్వల్పకాలిక సన్న, దొడ్డుగింజ రకాలు