Moringa Crop : మునగపంట సాగులో యాజమాన్య పద్దతులు !

వేరు కుళ్లు, కాండం కుళ్లు వర్షాకాలంలో మురుగు నీరు పోయే సౌకర్యం లేని నేలల్లో ఎక్కువగా ఆశిస్తుంది. కాండం చుట్టూ ఉన్న బెరడు కుళ్లిపోయి, చెట్టు విరిగిపోతుంది. వేర్లు కూడా కుళ్లిపోయి చెట్టు చనిపోతుంది.

Moringa Crop : మునగపంట సాగులో యాజమాన్య పద్దతులు !

Moringa Crop :

Moringa Crop : మునగ పంట అన్ని ప్రాంతాలకు అనువైన పంట. అన్నినేలలు దీని సాగుకు అనుకూలంగా ఉంటాయి. 9 నుండి 10 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఇటీవలి కాలంలో మునగను రైతులు వాణిజ్య సరళిలో సాగు చేస్తున్నారు. వేసవి ప్రారంభంలో పూతకు వస్తుంది. ఆగస్టు , సెప్టెంబరు మాసాల్లో గింజలను పాలిధిన్ సంచుల్లో గాని నేరుగా గాని పొలంలో విత్తుకోవాలి. బహువార్షిక రకాల్లో కొమ్మ కత్తిరింపులను జూన్ రెండవ వారం నుండి ఆగస్టు చివరి వరకు భూమిలో నాటుకోవచ్చు.

మునగ విత్తన రకాలు ;

దేశవాళీ రకాలు ఎక్కువగా సాగులో ఉన్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జాఫ్నా పికెఎం 1 రకాలు ఎక్కువగా సాగుచేస్తున్నారు. పికెఎం వార్షిక రకం మొక్క 4 నుండి 6 మీటర్ల ఎత్తు వరకు పెరిగి విత్తిన 170 రోజుల్లో పూతకు వస్తుంది. కాయ పొడవు 60 నుండి 70 సెం.మీ ఉంటుంది. మొక్కకు 32 కిలోల లేదంటే 225 కాయలు వస్తాయి. జాఫ్నా రకం విత్తనం బహువార్షిక రకం. కాయ పొడవు 60 నుండి 90 సెం.మీ ఉండి మెత్తని గుజ్జు, రుచికరంగా ఉంటుంది. రెండో సంవత్సరం నుండి కాపుకు వస్తుంది. విత్తే ముందు నేలను నాలుగైదు సార్లు దుక్కి దున్నాలి. మొక్కలు 60నుంచి 75 సెం.మీ ఎత్తు పెరిగాక మొక్కల చివర్లు తుంచివేయాలి.

ఎరువుల యాజమాన్యం ;

గింజలు విత్తిన 3 నెలలకు ఒక్కొక్క గుంటకు 100గ్రా. యూరియా, 50గ్రా.మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ వేసి నీరు పెట్టాలి. మొక్కలకు ఆరు నెలలక ఒకసారి, 9నెలలకు మళ్లీ ఒకసారి 100గ్రా. యూరియా, 50గ్రా. మ్యూరేట్‌ఆఫ్‌ పొటాష్‌ను వేసి నీరు పెట్టాలి. అంతరకృషి: మొక్కలు 60నుంచి 75 సెం.మీ ఎత్తు పెరిగాక మొక్కల చివర్లు తుంచాలి.

అలాగే నీటి తడులకు సంబంధించి విత్తనాలు మొలకెత్తే వరకు ప్రతి 3 రోజులకు నీటితడి ఇవ్వాలి. తర్వాత 10నుంచి 15 రోజులకు ఒకసారి నీటితడి ఇవ్వాలి. వరుసల మధ్య అంతర పంటలుగా అలసంద, బెండ, వంగ, ఫ్రెంచి చిక్కుడు వంటి పంటలను వేసుకోవాలి.

చీడపడీల నివారణ :

చిన్న గొంగళి పురుగులు గుంపులు గుంపులుగా కాండంపై చేరి పత్రహరితాన్ని గీకి తింటాయి. పెద్ద పురుగులు ఆకులన్నీ తిని ఈనెలను మిగులుస్తాయి. నివారణకు లీటరు నీటికి కారజెన్‌ రైనాక్సిపైర్‌ 0.3 మి.లీ కలిపి పురుగులు చిన్నవిగా ఉన్న దశలో పిచికారి చేయాలి. కాయతొలుచు ఈగ పూత దశలో ఆశించి పిందె దశలో కాయలోనికి ప్రవేశించి, లోపలి పదార్ధాన్ని తిని నాశనం చేయడం వల్ల కాయల ఆకారం మారిపోయి వంకరగా అవుతాయి. కాయతొలుచు ఈగ నివారణకు పూత దశలో లీటరు నీటికి ఫాసలన్‌ 2 మి.లీ కలిపి పిచికారీ చేయాలి. పిందె దశలో లీటరు నీటికి డైక్లోరోవాస్‌ను 1మి.లీ కలిపి మళ్లీ పిచికారీ చేయాలి. అవసరమైతే మరోసారి 25రోజులకు పిచికారీ చేయాలి.

వేరు కుళ్లు, కాండం కుళ్లు వర్షాకాలంలో మురుగు నీరు పోయే సౌకర్యం లేని నేలల్లో ఎక్కువగా ఆశిస్తుంది. కాండం చుట్టూ ఉన్న బెరడు కుళ్లిపోయి, చెట్టు విరిగిపోతుంది. వేర్లు కూడా కుళ్లిపోయి చెట్టు చనిపోతుంది. నివారణకు మొక్కల మొదలు వద్ద 1గ్రా. కార్బండైజిమ్‌ లేదా 3గ్రా. డైథేన్‌ ఎం-45 ఒక లీటరు నీటికి కలిపిన ద్రావణం కానీ లేదా 1శాతం బోర్డోమిశ్రమంగానీ ముంపుగా తడపాలి. మొక్క మొదలు వద్ద మురుగు నీరు నిలవకుండా జాగ్రత్త తీసుకోవాలి. ప్రతి చెట్టు మొదలులో ట్రైకోడెర్మా విరిడి ఎకరానికి 2 కిలోలు తీసుకుని కలిపిన పశువుల ఎరువును 5కిలోల చొప్పున వేయాలి.

పంట దిగుబడి ; బహువార్షిక రకాలు నాటిన 8నుంచి 9 నెలలకు కాపుకొస్తాయి. మొదటి పంట మార్చి నుంచి జూన్‌ నెలలో రెండో పంట సెప్టెంబరు-అక్టోబరు నెలలో వస్తుంది. పంట పెరిగినపుడు మొక్కకు ప్రతి సంవత్సరానికి 500నుంచి 600 కాయల వరకు దిగుబడి వస్తుంది. ఏకవార్షిక మునగ రకాలు గింజలు విత్తిన 6 నెలలకే కాపు చేతికందుతుంది.