Sheep And Goats : జీవాల్లో ఎద లక్షణాలు
పుట్టినప్పుడు ఆరోగ్యవంతమైన పిల్లల శరీర బరువు రెండన్నర కేజీల నుండి మూడున్నర కేజీల వరకు ఉంటుంది. పోతుపిల్లల బరువు ఇంకా ఎక్కువగా ఉంటుంది.

Goats
Sheep And Goats : గొర్రెలు సీజన్ ల వారీగా ఎదకు వస్తుంటాయి. వేసవి కాలంలో, చలికాలంలో, వర్షాకాలంలో ఎదకు వస్తుంటాయి. 80 శాతం గొర్రెలు వర్షాకాలంలో 20శాతం గొర్రెలు జనవరి నుండి మార్చి మాసాల మధ్య ఎదకొస్తుంటాయి. మేకలు మాత్రం ఏడాది పొడవునా ఎదకు వచ్చినప్పటికీ మార్చి, సెప్టెంబర్ లో రెండు సీజన్ లలో ఎక్కువగా ఎదకొస్తాయి. గొర్రెల్లో ఎదకాలంలో 30 నుండి 36 గంటలు ఉంటుంది. మేకల్లో 36గంటలు ఉంటుంది. ఎదకు ఎదకు మధ్య 14 నుండి 21 రోజులుంటుంది. మేకలు 19రోజులు, గొర్రెలు 17రోజులు ఎదచక్రం కలిగి ఉంటాయి.
ఎద ప్రారంభమైన తరువాత అండోత్పత్తి గొర్రెల్లో 24 నుండి 30 గంటలు, మేకల్లో 30 గంటలు తరువాత సంభవిస్తుంది. గొర్రెలు, మేకలు ఎదలో ఉన్న సమయంలో చికాకుగా ఉండటం, తోక కదిలిస్తుండటం, తరచుగా మూత్రం పోయడం, మేత సరిగ్గా తినక పోవటం, అరుస్తుండటం, పోతు, పొట్టేలు కోసం వెంటపడటం వంటివి గమనించవచ్చు. ఎద లక్షణాలు ప్రారంభమైన 10 నుండి 12 గంటల తరువాత ఎదచివరి దశలో పొట్టేలు, మేక పోతుతో ఆడ జీవాన్ని జత పరిస్తే ఎక్కువ జీవాలు చూలి కడతాయి.
చూడికాలానికి సంబంధించి గొర్రెల్లో 152రోజులు, మేకల్లో 150 రోజులుంటుంది. ఎదకు రాకపోవడం , చరుకు దనం లోపించడం, పాల ఉత్పత్తి తగ్గడం, పొట్ట పరిమాణం పెరగడం మొదలకు లక్షణాల ద్వారా చూడి కట్టిన జీవాల్ని గుర్తించవచ్చు. గొర్రెలు ఒక్కో ఈతలో సాధారణంగా ఒక పిల్లను పెడుతుంది. రెండు పిల్లలను అరుదుగా పెడతాయి. మేకల్లో మాత్రం మొదటి ఈతలో ఒక పిల్ల , తరువాత ఈతల్లో 2 నుండి 3 పిల్లల్ని పెడతాయి. పుట్టే మగ, ఆడ పిల్లల నిష్పత్తి 50:50 ఉంటుంది.
పుట్టినప్పుడు ఆరోగ్యవంతమైన పిల్లల శరీర బరువు రెండన్నర కేజీల నుండి మూడున్నర కేజీల వరకు ఉంటుంది. పోతుపిల్లల బరువు ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎదకు రాని జీవాల్ని గుర్తించి 30 రోజుల పాటు అదనంగా దాణా ఇవ్వాలి. ఖనిజ లవణ మాత్రలు, విటమిన్లు వాడాలి. అయినప్పటికీ ఎదకు రాకపోతే హర్మోన్లతో చికిత్స చేయించి ఎదకు వచ్చేలా చూడాలి.